స్పేస్ఎక్స్ షేర్లు మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఆ సంస్థ విలువ 2 ట్రిలియన్ డాలర్లు దాటింది. దాంతో ఆ కంపెనీ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద కూడా సరికొత్త శిఖరాలను తాకి, అ తను ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించాడు. ట్రిలియన్ అంటే సుమారు 94 లక్షల కోట్ల రూపాయలు. అది 2025-26 సంవత్సరానికి భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు నాలుగో వంతు. లేదా, భారతదేశ అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ సంపదకు దాదాపు పది రెట్లు. మస్క్ సంపద ఆ స్థాయికి పెరుగడానికి కారణమైన స్పేస్ ఎక్స్ అసాధారణ మార్కెట్ విలువపై ప్రపంచవ్యాప్తంగా విశ్లేషకులు మల్లగుల్లాలు పడుతున్నారు. మార్కెట్ ఆపాదిస్తున్న విలువ ఆ కంపెనీ వాస్తవ స్థితిగతులను ప్రతిఫలిస్తున్నదా? లేక స్టాక్ మార్కెట్లలో తరచుగా కనిపించే అత్యుత్సాహానికి ఇది మరో ఉదాహరణ మాత్రమేనా?
స్పేస్ ఎక్స్ సంస్థను మరో సాధారణ టెక్నాలజీ కంపెనీగానో లేదా రాకెట్లు ప్రయోగించే అనేక అమెరికా సంస్థల్లో ఒకటిగానో చూస్తే దాని విలువ అసంబద్ధంగానే అనిపిస్తుంది. కానీ, ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ గతంలో టెస్లా, పేపాల్, న్యూరాలింక్ వంటి దిగ్గజ బ్రాండ్ల ద్వారా సాధించిన విజయాలను, కంపెనీ దీర్ఘకాలిక ప్రణాళికలను పరిశీలిస్తే ఆర్థిక విపణులు ఆ కంపెనీకి ఎందుకు ఇంతటి విలువను ఆపాదిస్తున్నాయో కొంతవరకు స్పష్టమవుతుంది. ముఖ్యంగా, ఇటీవలి వరకు మన ఊహలకు కూడా అందని కొన్ని వ్యాపార అవకాశాలపై స్పేస్ఎక్స్ దృష్టి సారించడం పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తున్నది.
గతంలో అంతరిక్ష ప్రయోగాలు అత్యంత ఖరీదైనవిగా ఉండేవి. వందల కోట్ల రూపాయలు ఖర్చుచేసి ప్రయోగించిన రాకెట్, పని పూర్తయిన తర్వాత వృథాగా సముద్రంలో పడిపోయేది. తదుపరి ప్రయోగానికి మరో రాకెట్ నిర్మించాల్సి రావడంతో, ప్రభుత్వాలు, విశేష వనరులు కలిగిన కొన్ని బహుళజాతి సంస్థలకే అంతరిక్ష ప్రయోగాలు పరిమితమయ్యేవి. ఆ రంగం వ్యాపార స్వభావాన్ని స్పేస్ఎక్స్ పూర్తిగా మార్చేసింది. ప్రయోగం ముగిసిన తర్వాత రాకెట్‌ను తిరిగి భూమిపైకి దించి, దానిని పునర్వినియోగించే సాంకేతికతను విజయవంతంగా అమలు చేయడంతో ప్రయోగ వ్యయం గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఉపగ్రహాల ప్రయోగం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. వాణిజ్య అంతరిక్ష ప్రయోగాల మార్కెట్లో స్పేస్ఎక్స్ దాదాపు 80 శాతం వాటాను కైవసం చేసుకున్నది. స్పేస్ఎక్స్ విలువకు కారణం రాకెట్ వ్యాపారం మాత్రమే కాదు. ఆ సంస్థ భవిష్యత్తు ఆదాయాల్లో సింహభాగం, స్పేస్ ఎక్స్ అంతర్భాగమైన స్టార్ లింక్ నుంచి రావచ్చని విశ్లేషకుల అంచనా.
వేలాది ఉపగ్రహాలను భూ కక్ష్యలో ప్రవేశపెట్టి, ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, ఎడారులు, కొండ ప్రాంతాలు, గగనతలం, ధృవ ప్రాంతాలు, యుద్ధ ప్రభావిత ప్రాంతాలు – ఇలా సంప్రదాయ టెలికాం నెట్‌వర్క్‌లు చేరుకోలేని మారుమూలలకు కూడా ఇంటర్నెట్ సేవలు విస్తరించాలన్నది స్టార్ లింక్ లక్ష్యం.
ఈ బృహత్తర ప్రణాళిక విజయవంతమైతే, స్టార్ లింక్ కేవలం మరో టెలికాం సంస్థగా కాకుండా – భౌగోళిక సంక్లిష్టతలకు అతీతంగా ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాలు సమకూర్చే వ్యవస్థగా పరిణితి చెందే అవకాశం ఉన్నది. స్పేస్ఎక్స్ మార్కెట్ విలువలో, భవిష్యత్ ఆదాయ అవకాశాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రతిబింబిస్తున్నాయనే వాదనను తోసిపుచ్చలేం. ఉత్తరోత్తరా అవకాశాలు మెండుగా ఉన్న టెక్నాలజీ కంపెనీల విషయంలో ఇది అసాధారణం కాదు. అటువంటి కంపెనీల షేర్ల ధరలను మదింపు చేసేటప్పుడు, ప్రస్తుత ఆదాయాల కంటే భవిష్యత్తు ఆదాయాల ఆధారంగా చేసే లెక్కలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి న్యూయార్క్‌కు వెళ్లాలంటే, ఎంచుకున్న మార్గాన్ని బట్టి 15 నుంచి 20 గంటలు పడుతుంది. ఆ సుదీర్ఘ ప్రయాణానికి అధికమొత్తంలో ఇంధనం ఖర్చవుతుంది. కానీ మస్క్ ఎప్పట్నుంచో కలలు కంటున్న వ్యోమనౌక ఆధారిత ప్రయాణ వ్యవస్థ విజయవంతమైతే, అదే ప్రయాణం గంటలోపే పూర్తయ్యే రోజులు రావచ్చని విశ్లేషకుల ఆశాభావం. ప్రస్తుతం ఇది ఇంకా ఆలోచన దశలోనే ఉన్నది. కానీ కార్యరూపం దాల్చితే, విమానయాన రంగం స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉన్నది. అందుకే స్పేస్ఎక్స్ భవిష్యత్తు అవకాశాల గురించి మాట్లాడేటప్పుడు ఈ రంగాన్ని కూడా మార్కెట్ వర్గాలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి.
అంతరిక్షానికి చేరుకొనే వ్యయం గణనీయంగా తగ్గుతుండటంతో, ఇప్పటివరకు దాదాపు ప్రభుత్వాలకే పరిమితమైన ఈ రంగంలో ముందు ముందు ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఆధునిక యుద్ధాల్లో ఉపగ్రహ కమ్యూనికేషన్లు, నిఘా వ్యవస్థలు, సురక్షిత డాటా నెట్వర్కులు అత్యంత కీలకంగా మారాయి. ఇంకా పూర్తిగా సమసిపోని ఐరోపా, పశ్చిమాసియాల్లో ఉద్రిక్తతలు ఈ వ్యవస్థల ప్రాధాన్యాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. అందువల్ల అంతరిక్షం, జాతీయ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక రంగంగా కూడా వేగంగా రూపుదిద్దుకుంటున్నది. ఈ కారణంగానే అనేక ప్రభుత్వాల రక్షణ, గూఢచార్య విభాగాలు కూడా అంతరిక్ష పరిశోధనా రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే ఈ అంచనాలన్నీ ఏ మేరకు కార్యరూపం దాల్చుతాయో కాలమే నిర్ణయిస్తుంది.
స్పేస్ఎక్స్ కు మార్కెట్ ఆపాదిస్తున్న అపారమైన విలువను అర్థం చేసుకోవాలంటే – దాని ప్రస్తుత కార్యకలాపాలను మాత్రమే కాకుండా, అది లక్ష్యంగా పెట్టుకున్న భవిష్యత్ రంగాలలో రోజురోజుకూ పెరుగుతున్న అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. విలువ విషయాన్ని పక్కన పెడితే, అంతరిక్షం క్రమంగా ఆర్థిక కార్యకలాపాల వేదికగా రూపుదిద్దుకుంటున్నదని, ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో స్పేస్ఎక్స్ ముందంజలో ఉందన్నది మాత్రం వాస్తవం. భారత యువత ఈ పరిణామాన్ని కేవలం ఎలాన్ మస్క్ సంపదకు సంబంధించిన అంశంగా పరిగణిస్తే విలువైన పాఠాన్ని కోల్పోతుంది. మరుగున పడి ఉన్న అవకాశాలను ముందుగానే గుర్తించి, మేధోమథనం ద్వారా వాటిని వ్యాపారాలుగా మలచినవారినే సంపద వరిస్తుందని గుర్తించాలి. నిన్నటి అవకాశం సాఫ్ట్‌వేర్‌లో ఉంటే, నేడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ముందంజలో ఉన్నది. భవిష్యత్తు అంతరిక్షం, హరిత ఇంధనం లేదా జీవసాంకేతిక రంగంతో ముడిపడి ఉండవచ్చు. మిణుకు మిణుకు మంటున్న సంకేతాలను ముందుగా పసిగట్టిన వారే రాబోయే అవకాశాలను అందిపుచ్చుకుంటారు.
-పల్లపోతు కృష్ణబాలాజీ
9949098406