ఇది ఎమర్జెన్సీ కాకుంటే మరేంటి?
‘భావప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ స్వరాజ్యానికి పునాది’. ఇది మహాత్మా గాంధీ సందేశం. కానీ స్వతంత్ర భారతదేశ చరిత్రలోని కొందరు పాలకులు ఆ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారు. అందులో దారుణమైనది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ఇందిరాగాంధీ సాగించిన ఎమర్జెన్సీ పాలన. 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 మధ్య కాలం ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం.
‘భావప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ స్వరాజ్యానికి పునాది’. ఇది మహాత్మా గాంధీ సందేశం. కానీ స్వతంత్ర భారతదేశ చరిత్రలోని కొందరు పాలకులు ఆ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారు. అందులో దారుణమైనది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ఇందిరాగాంధీ సాగించిన ఎమర్జెన్సీ పాలన. 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 మధ్య కాలం ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం. నాటి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలు పౌర హక్కులను, పత్రికా స్వేచ్ఛను హరించాయి. నేటి పాలకులు కూడా నిరంకుశత్వానికి కొత్త ముసుగులు వేసి అమల్లోకి తీసుకురావాలని చూస్తున్నారా అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెన్షన్ చట్టం, దాని నిబంధనలు మీడియా హక్కులను కాలరాసేలా కనిపిస్తున్నాయి.
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ గురించి చరిత్రలో నమోదైన వాస్తవాలను తెలుసుకుంటే.. ఎంత ఘోరం అనిపిస్తుంది. సమకాలీన సమాజంలోని కొన్ని పరిస్థితులు, నాటి పరిణామాలతో పోలి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఉదాహరణకు ఎమర్జెన్సీ కాలంలో పత్రికలు ఏ వార్త ప్రచురించాలన్నా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఉండేది. వార్తలు, సంపాదకీయాలు, ఫొటోలపైనా సెన్సార్షిప్ అమలైంది. ప్రభుత్వ విధానాలను విమర్శించిన జర్నలిస్టుల అరెస్టులు జరిగాయి. పాత్రికేయుల హక్కుల కోసం గొంతెత్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)ను కూడా రద్దు చేశారు. ప్రభుత్వానికి నచ్చని వార్తలు ప్రజలకు చేరకుండా అడ్డుకోవడమే అప్పటి పాలకుల ఉద్దేశం.
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అని అభివర్ణించే మీడియా గొంతు నొక్కిన చరిత్ర అది. ఇప్పుడు కూడా అదే తరహా అధికార కేంద్రీకరణ, సమాచారంపై నియంత్రణకు దారితీసే విధానాలను మోదీ సర్కార్ మెల్లగా పట్టాలెక్కిస్తున్నట్టు కనిపిస్తున్నది. నాటి ఎమర్జెన్సీకి, ప్రస్తుత వివాదాస్పద చట్టానికి తేడాలు ఉన్నప్పటికీ స్థూలంగా మీడియా స్వేచ్ఛపై వాటి ప్రభావం మాత్రం ఒకేలా ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ చట్టం-2023 ప్రకారం 2025లో నిబంధనలు జారీ చేసింది. ఇందులో పలు వివాదాస్పద అంశాలను పేర్కొన్నది. ఏదైనా వార్తను ప్రచురించాల్సి, ప్రసారం చేయాల్సి వస్తే డీపీడీపీ చట్టం ప్రకారం సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంలోని, ప్రభుత్వం బయట ఉన్న బడాబాబుల గురించి వార్తలు రాయాలంటే వారు అనుమతి ఇస్తారా? పాలకుల అవినీతిని బయటపెడుతామంటే పాలకులు ఒప్పుకొంటారా? అక్రమార్కుల గురించి అత్యంత విశ్వసనీయవర్గాలు సమాచారం సమకూర్చుతుంటాయి. ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వం పచ్చజెండా ఊపిన వార్తలే ప్రచురితం అయ్యేవి. ఇప్పుడు కూడా సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకోవాలి అనే నిబంధన అప్రకటిత ఎమర్జెన్సీ విధానం కాదా? డీపీడీపీ చట్టంలో మీడియాకు మినహాయింపులు కల్పించాల్సిన అవసరమున్నది.
డీపీడీపీ నిబంధనలను సవాల్ చేస్తూ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డీఎన్‌పీఏ) ఆధ్వర్యంలో 21 మీడియా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వ్యాజ్యంపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వీ మోహన ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్రంలోని సంబంధిత శాఖలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది.
ప్రజాస్వామ్యంలో ప్రసార మాధ్యమాల బాధ్యత కేవలం సాధారణ సమాచారానికి సంబంధించిన వార్తలను ప్రచురించడం మాత్రమే కాదు. అధికారంలో ఉన్న వారి నిర్ణయాలను ప్రశ్నించడం, అవినీతిని బయటపెట్టడం, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనాన్ని పాలకులు దుర్వినియోగం చేస్తే నిలదీయడం. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చూడటం. ప్రజలకు తెలుసుకునే స్వేచ్ఛ ఉంటుంది, మీడియాకు తెలియజెప్పే స్వేచ్ఛ ఉంటుంది. డీపీడీపీ నిబంధనలు-2025 ప్రకారం వ్యక్తుల వ్యక్తిగత డిజిటల్ గోప్యతను రక్షించాలి. ఆ పేరుతో ప్రజాప్రయోజనాలకు సంబంధించిన పరిశోధనాత్మక జర్నలిజం సంగతేంటి? అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై వార్తలు రాయడానికి, బాధ్యులైన వ్యక్తులు అనుమతి ఇస్తారా? అది ఎంత హాస్యాస్పదం!
ఈ నిబంధనలు ఎటుదారి తీస్తాయో ఆలోచిస్తే ఆందోళన కలుగుతుంది. రాజ్యాంగంపై ప్రమాణం చేసి, ప్రజాధనానికి ధర్మకర్తలుగా ఉండాల్సిన వాళ్లు.. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే మీడియా కచ్చితంగా ఆ విషయాలను ప్రజల ముందు పెడుతుంది. అందులో ఎవరి వ్యక్తిగతం ఏముంటుంది? పబ్లిక్ ఆఫీస్‌లో వ్యక్తిగత గోప్యత అంటే ఎట్లా? ఉదాహరణకు ఎవరైనా ఓ ముఖ్యమైన నేత సోదరుడి ఇల్లు చెరువు బఫర్ జోన్లో ఉన్నదనే వార్తను ప్రచురించాలి అనుకుందాం. ఆ ఇంటి ఫొటోను ప్రచురిస్తే వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగినట్టా? అలా అనే పరిస్థితి వస్తుందా? అసలు ‘వ్యక్తుల వ్యక్తిగత గోప్యత’ అంటే నిర్వచనం ఏంటి? పాలకుల విచక్షణనే నిర్వచనమైతే, అధికార పార్టీ సూచనలే ఆదేశాలైతే అరాచకం రాజ్యమేలుతుంది. జర్నలి స్టులు వార్తలు రాయలేని దుస్థితి తలెత్తుతుంది?
ఏదైనా అంశంపై వార్తను ప్రచురిస్తామని, ప్రసారం చేస్తామని సంబంధిత వ్యక్తులకు ముందే సమాచారం ఇస్తే.. అది ఎటు దారి తీస్తుంది? ఆధారాలను మాయం చేయరా? సాక్షులను ప్రభావితం చేయరా? వార్త ప్రచురణకు ఆటంకాలు కలిగించరా? సరే, ప్రజాప్రయోజనం లేకుండా, ఏమైనా తప్పుడు వార్తలు ప్రచురిస్తే, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తే చర్యలు తీసుకోవడానికి చట్టాలు లేవా? మళ్లీ ఎందుకు కొత్త కొత్త నిబంధనల ముసుగులో ఎమర్జెన్సీ మాడల్ సెన్సార్షిప్..? డీపీడీపీ నిబంధనల పరిధి నుంచి మీడియాను మినహాయించాల్సిన అవసరమున్నది. మీడియా వ్యక్తుల వ్యక్తిగత సమాచార వ్యాప్తిలో స్వీయ నియంత్రణ పాటించాలి. హద్దులు దాటితే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాలి. ఇందుకు ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. కొత్త ఆంక్షలెందుకు?
డీపీడీపీ చట్టం పరిధిలో ఏర్పాటు చేసే డిజిటల్ డాటా ప్రొటెక్షన్ బోర్డు స్వతంత్రత, అధికారాలు కూడా వివాదాస్పదంగానే ఉన్నాయి. సదరు బోర్డు న్యాయస్థానం పాత్రను పోషిస్తే.. పాలనా వ్యవస్థ కోర్టుల అధికారాల్లోకి చొరబడినట్టు కాదా? డీపీడీపీ చట్టం సమాచార హక్కు చట్టంలోనూ కీలక సవరణ చేసింది. అందుకే ఇది ‘మోదీ మార్క్ ఎమర్జెన్సీ’ అని, ‘కొంపదీసి ఎమర్జెన్సీ విధిస్తరా ఏంది!’ అనీ విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే దేశంలో ప్రశ్నించే గొంతుకలపై ఆంక్షలు పెరిగాయి. విద్యార్థుల నిరసన ప్రదర్శనను అడ్డుకోవడానికి కూడా సాయుధ బలగాలను మోహరిస్తున్నారు బీజేపీ పాలకులు. ఈ నేపథ్యంలో మీడియా స్వేచ్ఛను కూడా హరించడం మరింత ఆందోళనకరం. మీడియా స్వేచ్ఛను కోల్పోవడం అంటే కొందరు జర్నలిస్టులు హక్కులను కోల్పోవడం కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అవసరమైన సమాచారాన్ని మీడియా ద్వారా పొందే అవకాశాన్ని ప్రజలు కోల్పోవడం. మరోవైపు డీఎన్‌పీఏ ప్రతినిధుల వినతిపత్రంపై నెలల తరబడి స్పందించని కేంద్ర ప్రభుత్వ పెద్దలు… సుప్రీంకోర్టు నోటీసులతో ఉలిక్కిపడి మేల్కొన్నారు. డీపీడీపీ చట్టం మీడియా హక్కులను హరించబోదని, మీడియాకు రాజ్యాంగం రక్షణలు కల్పించిందని ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం అన్నారు. మరి భావప్రకటనా స్వేచ్ఛను కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఏ)ను ఉల్లంఘిస్తూ చట్టం తీసుకొస్తే అది సమంజసమేనా? మొత్తం వ్యవహారంపై సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనేది వేచి చూడాలి.
ఇనుగుర్తి సత్యనారాయణ
97046 17343
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

