మబ్బు నుంచి జారిపడిన చినుకు మళ్లీ వెనకకు తిరిగి వెళ్లాలనుకున్నా వెళ్లలేదు. అదేవిధంగా నోరు జారిన మాటను, పేలిన తూటాను వెనక్కి తీసుకోలేం. కాబట్టి, ప్రతి వ్యక్తికి తన నాలుక మీద నియంత్రణ అవసరమన్న సందేశమిచ్చారు శ్రీ కోటిలింగేశ్వర శతకకారుడు.
ఎవరైనా నోటి మీద అదుపు కోల్పోయి, వేరేవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే అందుకు పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు. సదరు అనుచిత వ్యాఖ్యలు ఎదుటివారి పరువుకి భంగం కలిగిస్తే పరువు నష్టం దావాను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఈ మధ్య ఉభయ తెలుగు రాష్ర్టాల్లో చాలామంది రాజకీయ నాయకులు భావావేశంలో నియంత్రణ కోల్పోయి లేదా దురుద్దేశంతో హద్దులు మీరి మాట్లాడుతూ చిక్కులను కొనితెచ్చుకుంటున్నారు.
ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి, సంస్థకు, సొసైటీకి, లేదా ఒక వస్తుత్వానికి లభించే గౌరవాన్ని ఆ వ్యక్తి లేదా ఆ వస్తుత్వ పరువుగా పేర్కొంటారు. స్థిర చరాస్తుల వలె ఇది కూడా అమూల్యమైన సంపదే. ఆ సంపదకు ఎవరైనా తమ చర్యల ద్వారా ఉద్దేశపూర్వకంగా హాని కలిగిస్తే ఆ చర్యలు చట్టం కల్పించిన పది మినహాయింపుల పరిధిలో లేని పక్షంలో దాన్ని పరువు నష్టంగా భావించవచ్చు. నష్టపోయిన వ్యక్తి సివిల్, క్రిమినల్ న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. సివిల్ కోర్టులో బాధితుడికి నష్టపరిహారం లభిస్తే, క్రిమినల్ కోర్టులో నేరస్థుడికి శిక్ష పడుతుంది. ఇక క్రిమినల్ కేసు విషయానికొస్తే, భారతీయ న్యాయ సంహిత- 2023లోని సెక్షన్ 356 పరువు నష్టం, అందుకు విధించే శిక్షల గురించి వివరిస్తుంది.
సెక్షన్ 356: (1) ప్రకారం.. ఎవరైనా సరే మరొక వ్యక్తికి హాని కలిగించాలనే ఉద్దేశంతో లేదా తన చర్య మరొక వ్యక్తి పరువుకి హాని కలిగిస్తుందని తెలిసి లేదా ఏ కారణం వల్ల అయినా నమ్మి తన మాటలు, రాతలు, సంజ్ఞలు, వ్యక్తీకరణ ద్వారా గాని, ఏ విధమైన ఆరోపణలు చేసినా, ప్రచురణలు చేసినా ఆ ఆరోపణలు ఈ కింది మినహాయింపులకు లోబడనప్పుడు ఎదుటి వ్యక్తి (ఆరోపణలు చేయబడిన వ్యక్తి) పరువుకు నష్టం కలిగించినట్టుగా పరిగణించాలి.
అయితే, ఈ సెక్షన్లో పేర్కొన్న పది మినహాయింపులకు లోబడినప్పుడు అది పరువు నష్టం కిందకు రాదు. ఆ మినహాయింపులు ఇవి:
సెక్షన్ 356 (2): ఎవరైనా మరొకరి పరువుకి భంగం కలిగించినప్పుడు రెండు సంవత్సరాల వరకు సాధారణ ఖైదు లేదా జరిమానా లేదా రెండు, లేదా సామాజిక సేవను శిక్షగా విధిస్తారు.
సెక్షన్ 356 (3): తాము అచ్చు వేస్తున్న లేదా చెక్కుతున్న ఏదైనా అంశం మరొక వ్యక్తి పరువుకి భంగం కలిగిస్తుందని తెలిసి లేదా సహేతుక కారణాల వల్ల నమ్మి ఆ విషయాన్ని అచ్చువేసినా లేదా చెక్కినా రెండేండ్ల సాధారణ ఖైదు లేదా జరిమానా లేదా రెండు శిక్షలు విధిస్తారు.
సెక్షన్ 356 (4): పరువునష్టం కలిగించే అంశాన్ని ఎవరైనా అచ్చువేసిన లేదా చెక్కిన ఏదేని ఒక వస్తువును అమ్మినప్పుడు లేదా అమ్మకానికి పెట్టినప్పుడు రెండేండ్ల వరకు సాధారణ ఖైదు లేదా జరిమానా లేదా రెండు శిక్షలు విధిస్తారు. అయితే, పరువు నష్టం సెక్షన్ 356 కింద నమోదయ్యే కేసులు బెయిల్ ఇవ్వదగినవి. అంతేకాదు, ఈ కేసులు రాజీకి అవకాశమున్నవి కావడం గమనార్హం.
-బసవరాజు నరేందర్‌రావు
99085 16549