1893 నుంచి 1945 మధ్య అర్ధ శతాబ్దానికి పైగా సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజ్ తెలంగాణ ప్రజల చైతన్య వేదికగా నిలిచింది. 1862లో ఏర్పాటైన ఈ హైస్కూల్/ కాలేజ్ ప్రాంగణంలోనే జాతీయ స్థాయి సంస్కరణవాదులు, ఉద్యమకారులు, ఉద్యమ సంస్థల నాయకులు తమ కార్యకలాపాలను ప్రారంభించి, కొనసాగించారు.
1893 ఫిబ్రవరి 13న మహబూబ్ కాలేజీలో స్వామి వివేకానంద జరిపిన మహాసభ, చేసిన ప్రసంగం (మై మిషన్ టు ది వెస్ట్) ఇటు తెలంగాణలోనూ, అటు ఆయన జీవితంలోనూ చేసిన మొదటి చైతన్యపూరిత ప్రసంగం. అంతకుముందు చెన్నపట్నం (చెన్నై) నుంచి రైలులో వస్తూ దారి పొడువునా తెలుగు ప్రజలకు ఆయన దర్శనమిస్తూ వచ్చారు. 1893 ఫిబ్రవరి 9న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జంట నగరవాసులకు కనువిందు చేశారు. రైల్వేస్టేషన్లలో ఆయనకు సుమారు 500 మంది స్వాగతం పలకడం అప్పట్లో అపూర్వ సంఘటన. అలనాటి పురప్రసిద్ధులు రాజా శ్రీనివాసరావు బహదూర్, మహారాజు రంగనాథ బహదూర్, పండిత రతన్‌లాల్, నవాబ్ ఇమామ్సింగ్ బహదూర్ మొదలగువారు రైల్వే ప్లాట్ఫారం మీద స్వామికి ప్రణమిల్లారు. వివేకానందుడు బసచేసిన అతిథిగృహానికి జనప్రవాహం వెల్లువెత్తింది. ఫిబ్రవరి 17 వరకు సికింద్రాబాద్‌లో స్వామి ఉన్నారు. గోలకొండకు విచ్చేసి వివిధ ప్రాంతాలను ఆయన తిలకించారు. అప్పటి నిజాం మహబూబ్ అలీఖాన్ ప్రాసాదంలో రెండు గంటలు ప్రసంగించారు. హిందుత్వం భారత జాతీయ మౌలికత్వమని, సనాతన సత్యమని వివరించారు. ఆ తర్వాతనే అమెరికా (చికాగో)లో సర్వమత సమ్మేళనంలో వివేకానంద పాల్గొనడం, ఆయన ఉపన్యాసం విని పూర్తిగా వివశులైన అన్ని దేశాల నాయకులు తబ్బిబ్బులైపోయి దీర్ఘ కరతాళ ధ్వనులతో స్వామిజీకి జేజేలు పలికారట.
భారత కోకిల, హైదరాబాద్ ముద్దుల కోడలు సరోజినీ నాయుడు విచ్చేసిన సందర్భంలో మహబూబ్ కాలేజీలో ఆమె ఉపన్యాస సభ
జరిగింది. 1938లో అంతర్యుద్ధంలో గాయపడినవారికి సేవలందించడానికి బొంబాయి నుంచి చైనాకు వెళ్లిన డాక్టర్ కోట్నీస్ దురదృష్టవశాత్తు వాతావరణ ప్రతికూలతల కారణంగా ప్రాణాలు విడిచారు. 1942లో మహబూబ్ కాలేజీలోనే ఆయన సంస్మరణ సభ జరిగింది. చైనా
ఉద్యమ నాయకుడు చాంగ్ కై షేక్ ప్రతినిధిగా మరో ముఖ్య నాయకుడొకరు ఇక్కడికి వచ్చి నివాళులర్పించారు. అంతేకాదు, భారత వైద్య బృందం అందించిన సేవలను కొనియాడారు.
1942 ఆగస్టులో ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని మహాత్మాగాంధీ ప్రారంభించారు. మహాత్ముడి పిలుపుతో ఆగస్టు 9న జంట నగరాల్లో సత్యాగ్రహాలు మొదలయ్యాయి. మొట్టమొదటి బృందంలో వట్టికోట ఆళ్వారుస్వామి, గోపిశెట్టి రాజేశ్వరరావు, నాగం బాబురావు, జంగయ్య, శ్రీకృష్ణ దూబే, కంకర్ల పెంటయ్య, బొలుసాని శ్రీధర్, సినిమా రాజయ్య, ముత్యాల వేంకటేశం సహా 142 మంది యువకులు ఇందులో పాల్గొని చిరునవ్వుతో జైలుకు వెళ్లారు. ఈ ఉద్యమంలో మహబూబ్ కాలేజీ విద్యార్థులు విజృంభించిన తీరును అందరూ ప్రశంసించారు. ప్రిన్సిపాల్ హనుమంతరావు పోలీసులను కాలేజీ ఆవరణలోకి అనుమతించలేదు. దాంతో విద్యార్థులు బయటికి రాగానే పోలీసులు కసితో చితకబాదారు. అవి రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న రోజులు కావడంతో యుద్ధ విమానాల దాడి నుంచి రక్షణ కోసం రోడ్లపై గోతులను తవ్వారు. వాటిలో పడేసి విద్యార్థులను పోలీసులు హింసించారు. అయినా వెరవని విద్యార్థులు పోలీసులను గుంతల్లోకి నెట్టి వారిని పరాభవించారు. కొన్ని వారాలపాటు ఈ ఉద్యమం మహోధృతంగా నడిచింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల నుంచి నాలుగు అణాల చొప్పున అపరాధ రుసుము వసూలు చేశారు. రుసుము చెల్లించని విద్యార్థులు బహిష్కరణకు గురయ్యారు. వారి తల్లిదండ్రులకు హెచ్చరికలు పంపించారు. ఈ విధంగా చాలామంది చదువుల్లో వెనకబడిపోయారు. ఎస్.ఆర్.వేంకటేశం, బాబురావు, ఎం.రామ య్య, వి.విశ్వనాథశాస్త్రి, జి.రాజేశ్వరరావు, పి.భాస్కరమూర్తి, సోమ వేంకటేశం, ఎస్.బాలరాం మున్నగువారు ఉద్యమం నడిపినవారిలో ప్రముఖులు. ఈ ఉద్యమాల పర్యవసానంగా 1943లో సికింద్రాబాద్ విద్యార్థి సం ఘం ఏర్పడింది.
1943లో మహబూబ్ కాలేజీలో కోలాహలంగా జరిగిన ఆంధ్ర సారస్వత మహాసభలలో ‘నాజర్’ చెప్పిన బుర్రకథలు జనాలను ఉర్రూతలూగించాయి. కామ్రేడ్ వట్టికొండ నాగేశ్వరరావు బృందం కూడా కందుకూరి వీరేశలింగం జీవిత చరిత్రను బుర్రకథగా చెప్పింది. హిందూ కాలేజీ అధ్యాపకులు, ప్రముఖ గ్రాంథిక భాషావాది జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి ప్రధానోపన్యాసం చేశారు. ఈ సాహిత్య మహాసభలలో ఆటవెలది దత్తాత్రేయశర్మ పంతులు ప్రోత్సాహంతో పాల్గొన్న విద్యార్థులు క్రమంగా బస్తీల్లో యువజన సంఘాలు నెలకొల్పి, అనేక సామాజిక సేవా కార్యకలాపాలు చేపట్టారు. పర్యవసానంగా జంట నగరాల్లో పలు యువజన సంఘాలు, వ్యాయామశాలలు, గ్రంథాలయాలు, భజన మండళ్లు వెలిశాయి. నాటి హైదరాబాద్ రాష్ట్ర విముక్తి ఉద్యమంలో పాలుపంచుకున్నాయి.
ఆఫ్రికా ఖండంలో స్వాతంత్య్ర పోరాటం చేస్తున్న కెన్యా నాయకులు 1945లో మహబూబ్ కాలేజీలో జరిగిన సంఘీభావ సభలో పాల్గొన్నారు. ఆఫ్రికాను పాలిస్తున్న యూరోపియన్ ప్రభుత్వాలు ప్రజలను ఏ విధంగా హింసిస్తున్నాయో, లైంగికదాడులకు పాల్పడుతున్నాయో, అవమానాలకు గురిచేస్తున్నయో, ఆ దౌర్జన్యాల పట్ల అక్కడి ప్రజలు తిరగబడి ఏ విధంగా పోరాటం చేశారో ఆయన వివరించారు. అంతేకాదు, తాము కూడా మహాత్మాగాంధీని ఆదర్శంగా భావించి ఆయన సిద్ధాంతాల ప్రకారమే స్వాతంత్య్ర సమరం సాగిస్తున్నట్లు చెప్పారు. ఇలా మహబూబ్ కాలేజీ ఎన్నో సంస్కరణలు, చైతన్యాలు, సాహిత్య కార్యక్రమాలు, జాతీయ, అంతర్జాతీయ స్పృహలు, ఉద్యమ కార్యక్రమాల ఆరంభ వికాసాలకు వేదికైందని ‘అలనాటి సికింద్రాబాద్ నగర జీవనం – ఉద్యమాల చరిత్ర’ అనే పుస్తకంలో నాటి తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు వేదాంతం విశ్వనాథశాస్త్రి తెలిపారు.
-డా.ద్యావనపల్లి సత్యనారాయణ
94909 57078