Venki – Anil Ravipudi | తెలుగు చిత్రసీమలో ‘వినోదం’ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు అనిల్ రావిపూడి. కేవలం పదేళ్ల వ్యవధిలోనే వరుసగా తొమ్మిది విజయాలను అందుకుని, అపజయం ఎరుగని దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయన సినిమాలు కుటుంబం మొత్తం కలిసి థియేటర్లో నవ్వుకునేలా ఉంటాయి. కమర్షియల్ హంగులు, సింపుల్ ఎమోషన్స్, టైమింగ్ ఉన్న కామెడీ ఇవన్నీ కలిపి అనిల్ రావిపూడి మార్క్‌గా మారాయి. అనిల్ రావిపూడి కెరీర్లో సంక్రాంతి సీజన్ అంటే ప్రత్యేక అధ్యాయం. 2019లో విడుదలైన ‘F2’ నుంచి మొదలుకొని ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఇటీవల వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ వరకు… ప్రతి సంక్రాంతికీ బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించారు. వరుస హిట్లతో టాలీవుడ్లో ఈ పండగ సీజన్‌ను తన సొంతం చేసుకున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు.
విక్టరీ వెంకటేష్‌తో అనిల్ రావిపూడి కలయిక ఇప్పటికే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టింది. ‘F2’, ‘F3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్దనే కాదు, ఫ్యామిలీ ఆడియెన్స్ గుండెల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఇప్పుడు ఇదే క్రేజీ కాంబినేషన్లో మరో కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ‘మన శంకరవరప్రసాద్ గారు’ వంటి భారీ విజయానంతరం అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. కథా చర్చలు పూర్తయ్యాయని, ఈ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరించనుండగా, జూన్ నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని టాక్.
గతేడాది విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లలో ఒకటిగా నిలవడం విశేషం. దాదాపు ₹300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ‘సంక్రాంతి విన్నర్’గా నిలిచింది. ఈ విజయంలో వెంకీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపిన మేనరిజమ్స్, అనిల్ మార్క్ కామెడీ టైమింగ్, ఐశ్వర్య రాజేష్ – మీనాక్షి చౌదరి నటన, బుల్లిరాజు కామెడీ కీలకంగా నిలిచాయి. ఇదే మ్యాజిక్ మరోసారి రిపీట్ అయితే, 2027 సంక్రాంతి కూడా ఈ జోడీదేనని అభిమానులు నమ్ముతున్నారు. ఇక ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలో క్యామియోగా మెరిసిన వెంకటేష్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం:47’ చిత్రం చేస్తుండగా, మలయాళ సూపర్ హిట్ సీక్వెల్ ‘దృశ్యం 3’ చిత్రాలు చేస్తున్నాడు. ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్యలోనే మళ్లీ అనిల్ రావిపూడితో సినిమా అనౌన్స్మెంట్ రావడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.