వెయ్యేండ్ల తెలుగు సాహిత్యంలో ఎనిమిది వందల ఏండ్ల సాహిత్యం ప్రాచీన సాహిత్యం, మిగిలిన రెండు వందల ఏండ్ల సాహిత్యం ఆధునిక సాహిత్యం. ప్రాచీన సాహిత్యంపై సంస్కృత ప్రభావం, ఆధునిక సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం బాగా కనిపిస్తుంది. సాహిత్యాన్ని నిశితంగా అధ్యయనం చేయాలంటే ఆయా కాలాల్లో ఆయా కవులకున్న సాహిత్య దృక్పథంతో పాటు వారు సృష్టించిన రచనలు ఏ ప్రక్రియకు చెందుతాయో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం, అవసరం కూడా.
ప్రాచీన సాహిత్యంలో అనేక ప్రక్రియలు చోటుచేసుకున్నాయి. అందులో ప్రధానమైనవి ఇతిహాసం, పురాణం, కావ్యం, ప్రబంధం, పదకవిత, ద్విపద, ఉదాహరణం, శతకం, వచనం, చిత్రకవిత, కథాకావ్యం, దండకం ద్వ్యర్థి కావ్యం, అచ్చతెలుగు కావ్యం, యక్షగానం, హరికథ, బుర్రకథ, చాటువు, అవధానం, జానపద కవిత. ఆధునిక సాహిత్యంలో కూడా అనేక రకాలైన ప్రక్రియలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. పద్యం, గేయం, వచనం, వచన కవిత్వం, వ్యాసం, విమర్శ, నాటకాలు, నాటికలు, నృత్యనాటికలు, సంగీత రూపకాలు, కథలు, గేయకథలు, నవలలు, లేఖలు, జీవిత చరిత్రలు, యాత్రాకథలు మొదలైనవి.
ఆధునికాంధ్ర కవిత్వంతో అభ్యుదయ కవిత్వం, భావకవిత్వాలు ఉద్యమాలుగా స్థిరపడి ప్రత్యేకతను సంతరించుకున్నాయి. భావకవిత్వం ప్రభావం తగ్గి అభ్యుదయ కవిత్వం ప్రారంభంలో ఉన్నప్పుడు వచన కవిత్వానికి శ్రీకారం చుట్టింది. అభ్యుదయ కవిత్వాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చిన కవితా ఉద్యమం వచన కవిత్వోద్యమం. వచన కవిత్వానికి పితామహుడిగా కుందుర్తిని పేర్కొంటారు. శ్రీశ్రీ, దాశరథి, సినారె, ఆరుద్ర, సోమసుందర్, శేషేంద్ర, తదితర కవులు వచన కవిత్వాన్ని పరిపుష్టం చేశారు.
కుందుర్తి వచన కవిత్వం కళా ప్రాధాన్యం కలదిగా ఉండాలని భావించారు. ఇంకా సినారె, కేవీ రమణారెడ్డి, సోమసుందర్, సంపత్‌కుమార్ తదితరులు కూడా ఈ అభిప్రాయాన్నే వ్యక్తపరిచారు. ఆధునికాంధ్ర కవిత్వంలో సినారె ద్వారా గేయ కథా కావ్య నిర్మాణం ప్రారంభమైన పిదప వచన కవిత్వంలో ఆరుద్ర, సోమసుందర్, కుందుర్తి, శీలా వీర్రాజు, సోమయాజులు వంటివారు ప్రముఖులుగా కథాకావ్యాన్ని రాశారు. కుందుర్తి స్వతంత్రంగా రాసిన అభ్యుదయ కావ్యం తెలంగాణం. ఇది వచన కవితా ప్రక్రియ కథా కావ్యం. ఇందులో వారు భూస్వామ్య విధానాన్ని ప్రతిఘటించిన ఒక మహోద్యమాన్ని చిత్రించారు.
‘ఒక రైతు పొలం పోయి ఇల్లు చేరుకునే సరికి ఏలిన దొరవారి ఘనమైన సేవకులు వచ్చి పెళ్లాం మెళ్లో పుస్తెలు కాజేశారు’ ఇది భూస్వాముల అమానుష కృత్యాలకు అంతులేదని చెప్పడానికి నిదర్శనం. వెట్టిచాకిరి కోసం కూలి వాడి పెళ్లాన్ని దొర జప్తు చేయించాడని భావం. ‘ప్రతి పల్లె రహస్య జీవితంలోను/ ఒక రాత్రి పాఠశాల ఉంది ఇందులో సంఘం భూస్వాముల దౌర్జన్యాలను సవాలు చేసింది. ప్రజల్లోని చైతన్యం క్రమంగా పోరాట స్థాయికి చేరింది. ఈ నేల ఎవరిది/ కోటి ప్రజల సొత్తు కదా…/ కొందరు వద్దంటే ఒప్పుకోని చరిత్రా!/ ముందుకు పద…’ అన్న కుందుర్తి వచన కవితా శక్తి శ్లాఘనీయం. చరిత్ర గమనంలో నిలిచి దాన్ని ముందుకు పదమని శాసించిన ఆ కవి ఋషితుల్యుడే! తెలంగాణ ముద్దుబిడ్డ, నిలువెత్తు తెలుగు సంతకం, వివిధ రకాలైన రచనా ప్రక్రియలను సాధికారికంగా రాసి, పదాలను కదం తొక్కించి పదం పాడిన కవితా యోధుడు, స్థితప్రజ్ఞుడై జ్ఞానపీఠంపై వెలిగిన విశ్వంభరుడు సినారె. వారి కావ్య సృష్టి అద్భుతం. సామాన్యుడికి కూడా కవితావేశాన్ని కలిగించి కావ్యరచనకు పురికొలిపే రచనా శైలి ఆయనది.
‘చూడగలిగితే/ శూన్యపటం మీద దృశ్యాలు రెపరెపలాడతాయి వినగలిగితే/ మౌన ప్రపంచంలో శబ్దాలు గలగలలాడతాయి/ తెలుసుకో గలిగితే/ శూన్యం లాంటి మౌనమే/ ఒక అపూర్వ దృశ్య వాఙ్మయం’ ఇవి వచన కవితా పంక్తులే అయినప్పటికే వినూత్న సృష్టికి, పరవళ్లు తొక్కే అనుభూతికి, అనూహ్యమైన ఉత్తేజానికి, చైతన్య స్ఫూర్తికి, సరికొత్త ఆవిష్కరణలకు మార్గదర్శకాలు.
శ్రీశ్రీ విప్లవ కవి. శ్రీశ్రీ కవిత్వంలో వేదన, ఆవేదన, నివేదన, ఉత్సాహం, ఉద్దేశం ఉద్రేకం, ధిక్కారముంది. శ్రీశీ శ్రమజీవుల సంపద. శ్రీశ్రీ కవిత్వం ప్ర జల ఐక్యతకు గీటురాయి. శ్రీశ్రీ కవిత ప్రజల సమూహానికి ప్రతీక. శ్రీశ్రీ పాట ప్రజల ధిక్కారానికి నినా దం. శ్రీశ్రీ వచన కవితా లోకంలో ఒక వెలుగు రేఖ.
‘అలజడి మా జీవితం/ ఆందోళన మా ఊపిరి తిరుగుబాటు మా వేదాంతం/ ముందుకుపోతాం మేము/ ప్రపంచం మా వెంట వస్తుంది’ ఈ విధంగా వచన కవితా రసధునిలో పాఠక లోకాన్ని ఓలలాడించి, చైతన్య స్రవంతిలో మునకలెత్తించిన శ్రీశ్రీ కవితా లోకానికి ఆదర్శప్రాయుడు. అభ్యుదయ భావజాలం, విప్లవ గీతం తన ధ్యాసగా, శ్వాసగా జీవించిన విప్లవ కవితా వీరుడు. వచన కవితాయోధుడు, సాహితీ ప్రపంచానికి మార్గదర్శనం చేసిన మహోన్నత కవితా శిఖామణి. అరుణారుణ రాగరంజిత ప్రభలను వెదజల్లిన వ్యక్తిత్వం ఆయనది.
ప్రఖ్యాత కవి గుంటూరు శేషేంద్ర ‘దోమల సామ్రాజ్యంలో/ ఈగలు డిక్టేటర్లు/ ఒంటెల సౌందర్యానికి/ వంతపాడు గాడిదలు/ ఇక్కడ పాకే చీమలు హిమాలయ శ్రేణులు’ అంటూ అవకాశవాదుల, స్వార్థపరుల నీచ మనస్తత్వాన్ని తన వచన కవిత్వం ద్వారా తీవ్రంగా ఆగ్రహిస్తూ విమర్శించారు.
అధునాతన కవుల్లో ఒకరైన అలిశెట్టి ప్రభాకర్ తన వచన కవిత్వం ద్వారా కవిత్వం ఎలా ఉండాలో చెప్తూ అక్షరాన్ని అక్షరంగా నిలిపి ఆయుధంగా మలిచారు. ‘అక్షరం కపాలం కంతల్లోంచి వెలికి వచ్చే/ క్షుద్ర సాహిత్యపు కీటకమా కాదు/సౌందర్యం చర్మరంధ్రాల్లో/ తలదూర్చే ఉష్ట్ర పక్షి కాదు/ అక్షరం/ వధ్యశిలపై రాలిపోయే/ నిస్సహాయ శిరస్సు కాదు’ వచన కవిత్వాన్ని, మినీ కవిత్వాన్ని అత్యంత శక్తివంతంగా దట్టించి విసిరిన విప్లవకవి అలిశెట్టి. నూతన అభివ్యక్తితో పాఠకులను ఉక్కిరిబిక్కిరి చేయడం ఆయన కవిత్వ లక్షణం.
వచనకవితా పితామహుడిగా ప్రఖ్యాతి చెందిన కుందుర్తి ఆంజనేయులు వచన కవిత్వ వికాసానికి విశేష కృషి చేశారు. ఇతరులు వారిననుకరిస్తూ, ఆచరించి వచన కవిత్వ ప్రాధాన్యాన్ని ఆధునిక కవితా లోకానికి తెలిపారు. ప్రాచీన కవిత్వాన్ని నిరాదరిస్తూ వచన కవిత్వాన్ని కుందుర్తి అభిమానించడం కొందరు కవులకు నచ్చలేదు. భిన్నాభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఎన్నో విమర్శలు చేశారు. అయినా కుందుర్తి జంకలేదు వచన కవితా విచారణలో ‘ఉరిశిక్ష పడ్డ/ మొదటి ముద్దాయిని నేను/ అలనాటి కవితా లతాంగిని హత్య చేశాను/ అలంకార ఆభరణాలు అపహరించాను/ అన్నీ ఒప్పేసుకున్నాను ఆనాడు బోనులో ఎక్కి/ కింది కోర్టు వేసిన శిక్షను/ మానవ కారుణ్య దృక్పథంతో సడలించి/ జన్మఖైదు వేశారు హైకోర్టు న్యాయమూర్తులు/ ఒక తరం పాటు బతకాలన్నారు బందీగా/ పాఠకుల గుండెల చెరసాలలో’ అంటూ పాఠకుల ఆదరణే తనకు ముఖ్యమని కుందుర్తి స్పష్టం చేశారు. ‘పాతకాలం పద్యమైతే/ వర్తమానం వచన గేయం’ అని ఎలుగెత్తి చాటారు. పద్యానికి పాలించగల సత్తా ఉన్నా గద్యాన్ని గద్దె మీద నిలిపారు కుందుర్తి.
‘తెప్పవోలే చంద్రబింబం తేలిపోతా వుంది నింగిని/ అందులో నా ముద్దు ప్రేయసి ఉంది కాబోలు’ అని మల్లవరపు విశ్వేశ్వరరావు తన భావ కవిత్వంలో ఆకాశయానం చేశాడు. ‘శ్రమజీవుల రుధిరంతో/ఎరుపెక్కిన ఈ జెండా/ ఎగరేస్తూ మన జెండా/ జయ జయమని పయనిద్దాం’ అని నండూరి రామమోహనరావు అభ్యుదయ బావుటాను ఎగురవేశాడు. ‘నాకు బాగా గుర్తుంది/ అప్పుడు నీకు పన్నెండేళ్ళు/ నిన్ను మూలగదిలో కూర్చోపెట్టారు/ ఆ తరువాత నా ఆటల్లో పాటల్లో/ నువ్వెక్కడా లేవు’ అని రవిప్రకాశ్ ఆకెళ్ల స్త్రీవాద కవిత్వంలో తన స్నేహితురాలు ఎక్కడ మాయమైపోయిందో చెప్పాడు. ‘నాత్రిల్ల నిద్ర పడ్తలేదు/ అయిసు పోరగాల్ల మీద/ నిగరానీ బెట్టిండ్రు/ దర్వాజలు గొట్టి జీపులల్ల ఏస్కపోతున్నరు/ ఆగమాగం జేసి పోయిండ్రు/ మా కుత్కెల మీద బందూకులు పెట్టి/ కడుపుల దన్ని పోయిండ్రు’ అని ఎండ్లూరి సుధాకర్ తెలంగాణలో నక్సలిజం సృష్టించిన అలజడిని కవిత్వీకరించాడు. ‘నాగరికత కడుపు మడతల కింద/ చితికిన గజ్జి పుండు బొడ్డు/ ఆకలి మహారణ్యం బురద గుంటలో/ కాళ్లు విరిగి పడ్డ ఈగ మనిషి’ అని ఒక దిగంబర కవి నాగరికత దీపం కింద పరచుకున్న చీకటి మీద కవితా కిరణాన్ని ప్రసరింపజేశాడు.
‘కీళ్ళ నొప్పులో ఏమో శ్రీమహా విష్ణువుకు/ ఎప్పడూ పడుకునే ఉంటాడు/ కాలి దురద ఏమో పరమ శివునికి ఎప్పుడూ ఆడుతూనే ఉంటాడు/ కదలనీయని ముసలితనమో ఏమో చతుర్ముఖ బ్రహ్మకు/ ఎప్పుడూ కూచునే ఉంటాడు/ దొరకదా ఎక్కడైనా లోపం/ వెతకాలి గానీ ఓపిగ్గా’ అని ఒక వచన కవి త్రిమూర్తులను కూడా వదలకుండా తన కవిత్వంలో బంధించి వారి లోపాలను ఎండగట్టాడు.