యువకుడిగా ఉన్నప్పటి నుంచీ కేటీఆర్ తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నుంచి అనేక సుగుణాలను పుణికిపుచ్చుకున్నారు. ప్రజల పట్ల సేవాతత్పరత, ఏ విషయంపై అయినా అనర్గళంగా ప్రసంగించటం కేసీఆర్ నుంచి నేర్చుకున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పండితులను సైతం మెప్పించేలా ప్రసంగించటం కేసీఆర్ ప్రత్యేకత. తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ కూడా ఆయా భాషల్లో అనర్గళంగా ప్రసంగించి అందరినీ మెప్పిస్తారు.
1990-2000 మధ్యకాలంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. పల్లెలు, పట్నాలు తెలంగాణ నినాదంతో హోరెత్తాయి. రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఆందోళనలు, చేస్తున్న పోరాటాలు అమెరికాలో ఉన్న కేటీఆర్‌ను ఆలోచింపజేశాయి. నాడు తన తండ్రి కేసీఆర్ ఉద్యమానికి అన్నీ తానై ముందుకు నడుస్తున్న సమయం. కేటీఆర్ ఏ మాత్రం ఆలోచించకుండా ఉద్యోగం వదిలేసి వచ్చి తండ్రికి సహాయకుడిగా, తోడుగా ఓ సామాన్య తెలంగాణ బిడ్డగా ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.
ఉద్యమం తీవ్రరూపం దాల్చి పిల్లలు, పెద్దలు సబ్బండవర్గాలు ‘జై తెలంగాణ’ నినాదంతో రోడ్డెక్కాయి. యూనివర్సిటీలు, స్కూళ్లు, కాలేజీలు రణక్షేత్రాలయ్యాయి. ఆ క్రమంలోనే సకలజనుల సమ్మెలు, సాగరహారాలు, మిలియన్మార్చ్లతో తెలంగాణ కదం తొక్కింది. రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న భిన్నరూపాల ఉద్యమాల్లో ముందుభాగాన నిలిచి కేటీఆర్ పోరాడారు. ఆ క్రమంలోనే తెలంగాణ సమాజ అవసరాలు, ఆశలు, ఆకాంక్షలను లోతుగా అర్థం చేసుకున్నారు. ఆ నేపథ్యంలోంచే.. తెలంగాణ అభివృద్ధి, పునర్నిర్మాణం ఎలా సాగాలో అవలోకనం చేసుకున్నారు.
అది మొదలు రాష్ట్ర సాధన కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో తండ్రి కేసీఆర్‌కు కుడి భుజంగా ఉద్యమంలో అన్నివేళలా ముందున్నారు. కేసీఆర్ చావునోట్లో తలపెట్టి సాధించిన తెలంగాణలో అంతే భవిష్యత్ దర్శనంతో తెలంగాణ సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్నారు. ఆ తర్వాత కాలంలో 2014లో జరిగిన ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మన్ననలు పొందారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆపత్కాలంలో పిలిస్తే పలికే ఆత్మీయుడిగా… ప్రజా సేవకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
ముఖ్యంగా రెండోసారి టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టారు కేటీఆర్. రాష్ర్టాభివృద్ధిలో కీలకంగా ఉన్న ఐటీ శాఖతో పాటు మున్సిపల్ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తూ.. తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్నారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ జంట నగరాలను తీర్చిదిద్దటంలో, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనలో కేటీఆర్ ముందుచూపు గురించి ఎంత చెప్పినా తక్కువే. అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యటించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ అభివృద్ధి గురించి వివరించిన కేటీఆర్ ప్రసంగం ప్రపంచాన్నే మంత్రముగ్ధుల్ని చేసింది. ఏదేమైనా… తెలంగాణ ప్రభుత్వంలో యువ మంత్రిగా అందరి మన్ననలు అందుకుంటున్న కేటీఆర్ స్వయం శక్తి నైపుణ్యాలతో ప్రకాశిస్తున్న యువనేత. ఇలాంటి నేతలు పదికాలాల పాటు ప్రజల సేవలో కొనసాగాలి.
(వ్యాసకర్త: టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు)
అట్లూరి రమాదేవి