హామీల అమలు కోసం ‘సింగరేణి గర్జన’
నల్లబొగ్గుకు నెత్తురునద్ది... సింగరేణికి సిరులందించి.. చీకటి బతుకులయ్యేనా.. ఓ సింగరేణి గని కార్మికా.. చితికిన బొమికలు మిగిలేనా..
అంటూ సింగరేణి ప్రాంత ప్రముఖ కవి దయానర్సింగ్ ఆలపించిన పాట సింగరేణి కార్మికుల జీవితాల్లోని అన్యాయాన్ని, ఆవేదనను కండ్లకు కట్టింది. దేశ సౌభాగ్యానికి వారు తమ రక్తాన్ని ధారపోసి, వెలుగులు పంచి, వారు మాత్రం చీకట్లలో మగ్గిపోతున్నారు. వివిధ రకాల అనారోగ్య సమస్యలను వారు ఎదుర్కొంటున్నా నేటి పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు మళ్లీ సింగరేణి బొగ్గు గనుల్లో నేడు ప్రతిధ్వనిస్తున్నాయి. తమ హక్కుల కోసం ఉద్యమించిన కార్మికులు గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏడు డిమాండ్లతో కూడిన లేఖ రాయడం సింగరేణి వాడల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నది.
సింగరేణి కార్మికుల సంక్షేమానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ కార్మికుల పక్షపాతిగా వారి హృదయాల్లో స్థానం దక్కించుకున్నారు. 201415లో 21 శాతంగా ఉన్న లాభాల వాటాను 202223 నాటికి 32 శాతానికి పెంచారు. ఆ ఏడాది రూ.711 కోట్ల వాటాను అందించారు. కార్మికుల పదవీ విరమణ వయస్సు 58 ఏండ్ల నుంచి 61కు పెంచారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పించే విధానాన్ని రూపొందించారు.
ఉద్యోగుల వేతన ప్రయోజనాల కోసం తెలంగాణ ఇంక్రిమెంట్ అందించారు. అర్హులైన ఉద్యోగులకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని గృహ రుణాలు, ఉద్యోగులు, రిటైర్డ్ కార్మికులకు మెరుగైన వైద్యం, కార్మికుల పిల్లల ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించారు. సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తి చేసే సంస్త మాత్రమే కాదు, తెలంగాణ ఆర్థిక ప్రగతి రథచక్రం. వేలాది కార్మిక కుటుంబాలకు జీవనాధారం. తరతరాల శ్రమకు, శ్రమజీవుల త్యాగాలకు ప్రతీక. భూమి పొరల్లోకి దిగి, ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గును వెలికితీసే కార్మికుల కష్టంతోనే విద్యుత్తు వెలుగులు విరజిమ్ముతున్నాయి. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగలో తొక్కింది.
సింగరేణి కార్మికుల సొంతింటి కలను నిజం చేస్తామని, ప్రతి కార్మికుడికీ 250 గజాల స్థలం, రూ.20 లక్షల వడ్డీలేని రుణం అందించాలనే హామీ కల కలగానే మిగిలిపోయింది. వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, లాభాల్లో మెరుగైన వాటా ఇస్తామని చెప్పిన హామీలకు అతీగతీ లేదు. పెర్క్స్‌పై ఆదాయపు పన్నును కంపెనీ చెల్లించేలా చేస్తామని కాంగ్రెస్ నమ్మబలికింది. ఈ సమస్యను కూడా పరిష్కరించలేదు.
కార్మికుల శ్రమను గుర్తించడంతో పాటు, లాభాల్లో న్యాయమైన వాటా కల్పించడం కూడా అంతే ముఖ్యం. 202324 ఆర్థిక సంవత్సరంలో రూ.4,701 కోట్ల నికర లాభం, 202425లో రూ.6,394 కోట్ల లాభం వచ్చినప్పటికీ బోనస్ చెల్లింపుల్లో కార్మికులకు తగిన న్యాయం జరుగలేదు. సంస్థ లాభాల్లో కార్మికులకు 36 శాతానికి పైగా వాటా చెల్లించాలని, వాస్తవ లాభాల ఆధారంగా బోనస్ నిర్ణయించాలని కార్మికలోకం కోరుకుంటున్నది. సింగరేణి కార్మికులకు ఏటా దసరా సందర్భంగా బోనస్ ప్రకటించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బోనస్‌ను ప్రకటించినప్పటికీ, నిరుడితో పోలిస్తే బోనస్ భారీగా తగ్గింది. దీంతో కార్మికులు తీవ్ర అసహనంతో ఉన్నారు. నిరుడు ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 బోనస్ ప్రకటించగా, ఈ ఏడాది రూ.1,53,912 మాత్ర మే ప్రకటించారు. కార్మికుల శ్రమ పట్ల కాంగ్రెస్ సర్కార్‌కు ఏపాటి గౌరవం ఉన్నదో దీనిని బట్టి అర్థమవుతున్నది.
కార్మికుల కుటుంబాలకు వారసత్వ ఉద్యోగాలు ఉపాధి కాదు, కుటుంబ భద్రతకు భరోసా. అనారోగ్యంతో విధులు నిర్వహించలేని కార్మికుల విషయంలో యాజమాన్యం మెడికల్ బోర్డులను సకాలంలో నిర్వహించి, నిబంధనల ప్రకారం అర్హులకు వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి. మెడికల్ బోర్డుల కోసం ఎదురుచూస్తున్న 2,500 మందికి పైగా కార్మికులు సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
సింగరేణి సంస్థకు రాష్ట్ర విద్యుత్తు సంస్థల నుంచి సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నది. ఈ మొత్తాలు పెండింగ్‌లో ఉండటం సింగరేణి ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నది. కార్మికుల భద్రత, సంక్షేమానికి అవసరమైన నిధులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి. దశాబ్దాలుగా కార్మికుల శ్రమతో ఎదిగిన ఈ సంస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరించే యత్నాలు చేస్తున్నది. తెలంగాణకు మకుటాయమైన సింగరేణిని ప్రైవేటుపరం కాకుండా రక్షించుకోవాలి. అందుకోసం తెలంగాణ ప్రజలంతా పోరాడాలి.
‘పోరాడితే పోయేదేమీ లేదు..బానిస సంకెళ్లు తప్ప’ అనే నినాదాన్ని అందుకుని కార్మికలోకం సింగరేణి యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నేడు గోదావరిఖని సింగరేణి స్టేడియం లో ‘సింగరేణి కార్మిక గర్జన’ నిర్వహించబోతున్నారు. నల్లసూర్యులకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా కార్మికుల పక్షాన గొంతెత్తేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ సభకు రానున్నారు. కార్మికులను దగా చేస్తున్న కాంగ్రెస్ దోపిడీ పాలనపై సమరభేరి మోగించనున్నారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని కార్మికులు, ఉద్యోగుల హెచ్చరిస్తున్నారు.
డాక్టర్ ఆవాల హరిబాబు
98495 38813
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

