ఉద్యమంతో పోరాటం సలిపి రాష్ర్టాన్ని సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వతహాగా కవి, సాహిత్యవేత్త, సాహితీకాముకుడు. దాంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ సాహిత్యం, కవిత్వం, కళలు వెలుగులోకి రావడం మొదలైంది. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళారూపాలు.. గత పదేండ్ల కేసీఆర్ పాలనలో అస్తిత్వాన్ని చాటుకున్న సంగతి అందరికీ విదితమే. ఎందరో కవులు, రంగస్థల నటులు, సాహితీవేత్తలు, ఉద్యమకారులు నడియాడిన నేల తెలంగాణ. తెలంగాణ మట్టిలో మరుగునపడ్డ మాణిక్యాలను వెలికి తీసి ప్రజల ముందుంచి వారి ప్రాభవాన్ని తిరిగి నెలకొల్పాలనే చిన్న ప్రయత్నం ఈ వ్యాస పరంపర. తెలుగు నాటకానికి నూతన ఒరవడి కల్పించాలన్న కలతో ఖండాంతరాలకు వెళ్లి ప్రపంచ నాటకాన్ని వీక్షించి తన కలను సాకారం చేసుకున్న మహనీయుడు మంత్రి శ్రీనివాసరావు.
DR. Mantri Srinivasa rao | ఆధునిక యుగంలోకి తెలుగు నాటక రంగ ప్రవేశానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. 1950వ దశకంలోనే తెలంగాణ నాటక రంగ వైభవానికి పాటుపడ్డ తెలంగాణ బిడ్డ, ఆధునిక తెలుగు నాటక రంగ మకుటం, తెలుగు నాటక రంగ చరిత్ర గుర్తుంచుకోదగ్గ నటుడు, ప్రయోక్త, ఆచార్యులు మంత్రి శ్రీనివాసరావు.
హైదరాబాద్ సమీపంలోని కందుకూరు మండలం బచ్చుపల్లి గ్రామంలోని తెలంగాణ దేశ్ముఖ్ల కుటుంబంలో 1928 జనవరి 1న మంత్రి శ్రీనివాసరావు జన్మించారు. తండ్రి రామచంద్రరావు, తల్లి రాజ్యలక్ష్మి. ముఫీద్ – ఉల్ – ఆలం హైస్కూల్లో ఆయన ప్రాథమిక విద్యనభ్యసించారు. తర్వాత నిజాం కళాశాలలో ఇంటర్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీలను పూర్తి చేశారు. అక్కడే ఆయన ఆంగ్ల, ఉర్దూ నాటకాల్లో నటనలో ఓనమాలు దిద్దారు. నాటి నిజాం పాలనలో తెలుగు భాషకు అంతగా ప్రాధాన్యం ఉండేది కాదు. 1946-47లో తొలిసారి ‘ఆంధ్రాభ్యుదయ నాటకోత్సవాలు’ పేరిట జరిగిన తెలుగు నాటక ప్రదర్శనల్లో చెకోవ్ ‘ప్రపోజల్’ నాటకంతో రంగస్థలం మీద ఆయన అడుగుపెట్టారు. నిజాం కళాశాలలోనే ప్రముఖ సాహితీవేత్త, జర్నలిస్టు అబ్బూరి వరద రాజేశ్వరరావుతో పరిచయం కావడంతో శ్రీనివాసరావు దృష్టి ఆధునిక తెలుగు నాటకం వైపు సాగింది. సరోజినీ నాయుడు కుమారుడు జయసూర్య పరిచయం.. శ్రీనివాసరావును ప్రపంచ నాటక రంగ ఆధ్యయనానికి పురికొల్పింది. ఆ దిశగా శ్రీనివాసరావు పురోగమించేందుకు అనేక ప్రపంచ నాటక గ్రంథాలను జయసూర్య ఆయనకు అందించి సాయపడ్డారు.
1952లో ఇండియన్ నేషనల్ థియేటర్ (ఐఎన్టీ)ను శ్రీనివాసరావు స్థాపించారు. 1954 నుంచి నిజాం కళాశాలలో తెలుగు నాటకోత్సవాలను నిర్వహించడం ప్రారంభించారు. ఇందులో బెల్లంకొండ రామదాసు ‘మాష్ట్టార్జీ’ నాటకాన్ని శ్రీనివాసరావు ప్రదర్శించారు. ఆ తర్వాత శ్రీశ్రీ
రచించిన ‘విదూషకుడి ఆత్మహత్య’ అనే రేడియో నాటకాన్ని శ్రీనివాసరావు, ఎ.ఆర్. కృష్ణ రంగస్థలానికి అనువుగా నాటకీకరణ చేసి ప్రదర్శించారు.
1950- 60ల మధ్యకాలంలో శ్రీనివాసరావు అనేక రేడియో నాటకాలను తెలంగాణ మాండలికంలో అందించారు. 1956లో రష్యన్ నాటక రచయిత గొగొల్ రచన ‘ఇన్స్పెక్టర్ జనరల్’ను స్వీయ దర్శకత్వంలో శ్రీనివాసరావు ప్రదర్శించారు. 1957లో కుందుర్తి ఆంజనేయులు రాసిన ‘ఆశ’ నాటకాన్ని అనిబద్ద శైలిలో మంత్రి శ్రీనివాసరావు ప్రయోక్తగా ప్రయోగాత్మకంగా ప్రదర్శించగా, ఇందులో ప్రొఫెసర్ రమామెల్కోటే ప్రధాన పాత్రలో నటించారు.
రాష్ట్ర సమాచార శాఖలో పని చేస్తున్న ఆయన 1961లో ఏడాది సెలవు పెట్టి మరీ బొంబాయిలో బ్రిటిష్ రంగస్థల నిపుణులు ‘హెర్బట్ మార్షల్’ వద్ద నట శిక్షణలో ప్రత్యేక కోర్సును పూర్తి చేశారు. ఆ తర్వాత 1963లో నటనలో ప్రత్యేక శిక్షణ కోసం లండన్లోని ‘బ్రిటిష్ డ్రామా లీగ్’కు వెళ్లారు. ఇండియా నుంచి నలుగురిని మాత్రమే ఎంపిక చేసే ఈ కోర్సుకు అనేక వడపోతల తర్వాత మంత్రి ఎంపికయ్యారు. అక్కడ ఏడాదిపాటు శిక్షణ పొందిన ఆయన ‘యాక్టింగ్ డిప్లొమా’ను సాధించారు. ఈ విద్యార్హతే 1966లో ఆయనను ఆంధ్రా యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్ డిపార్ట్మెంట్కు తొలి శాఖాధిపతిని చేసింది. విశ్వవిద్యాలయం వేదికగా కూడా మంత్రి ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎందరికో స్ఫూర్తినిచ్చారు. శాఖాధిపతిగా మంత్రి పని చేసిన కాలం ఒక స్వర్ణయుగమని ప్రఖ్యాత నటుడు మిశ్రా కొనియాడారంటేనే ఆయన చేసిన కృషిని అర్థం చేసుకోవచ్చు. సాక్షి రంగారావు, వంకాయల సత్యనారాయణ, అత్తిలి కృష్ణారావు, ఎస్కే మిశ్రా, కృష్ణ చైతన్య, శరత్ బాబు వంటి వారు ఆయన శిష్యులే. హిపోక్రసీ లేని, లౌక్యం తెలియని ముక్కుసూటి మనిషి మంత్రి శ్రీనివాసరావు. తెలంగాణ నాటక వికాసానికి బాటలు పరిచిన మార్గదర్శి కూడా ఆయనే.
1964లో అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని రాష్ట్రపతి భవన్లో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. నాటకరంగ అభివృద్ధికి మంత్రి శ్రీనివాసరావు చేసిన కృషిని గుర్తించిన ఆనాటి ప్రభుత్వం 1957లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా నియమించి ఆయన్ను గౌరవించింది. రంగస్థల శాఖ విద్యార్థులు ప్రదర్శించబోయే నాటక ఏర్పాట్లలో ఉండగానే తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన 1974 అక్టోబర్ 9న విశాఖలో 46 ఏండ్లకే మరణించారు. ఆయన మరికొంత కాలం జీవించి ఉంటే ఎందరో నటులు, దర్శకులను ప్రభావితం చేసి, నాటకాన్ని ఆధునికత వైపు పరుగులు పెట్టించేవారు. మంత్రి శ్రీనివాసరావు మరణం తెలుగు నాటకానికే కాదు.. తెలంగాణ నాటకానికీ తీరని లోటును మిగిల్చింది. మంత్రి నాటక రంగ ప్రస్థానాన్ని ఈ తరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
-సాయి లోహిత పులప