కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక రూపకల్పన, నిర్మాణంలో నిర్లక్ష్యం, అవకతవకలు, లోపాలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై విచారించి బాధ్యులను గుర్తించాలని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం-1952 ప్రకారం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2024 ఏప్రిల్ 27న ఈ మేరకు ఒక పబ్లిక్ నోటీస్ జారీచేసింది. ప్రజలు తమ అభ్యంతరాలు, ఆరోపణలను వాంగ్మూలాల రూపంలో కమిషన్‌కు సమర్పించాలని కోరింది. కమిషన్ మొత్తం 15 నెలల్లో 119 మంది సాక్షులను విచారించి, 110 మంది వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. సంబంధిత నివేదికను 2025 జూలై 31న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్ మీదనే తుది నివేదిక సమర్పించింది. జాతీయ డ్యాం భద్రతా విభాగం ఇచ్చిన నివేదిక మీదనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఈ కమిషన్ సూచించింది.
2025 ఆగస్టు 4న ముఖ్యమంత్రి, మంత్రులు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవమానకరంగా, తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని, పక్షపాతంగా, చట్ట విరుద్ధమైన తీరులో మాట్లాడారని, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కమిషన్ నివేదికను ప్రస్తావిస్తూ తన పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేశారని, ఈ నివేదిక ప్రతిని తనకు ఇవ్వకుండా నివేదికలోని అంశాలను బహిర్గతం చేయడం చట్ట విరుద్ధమని, తనకు ఈ నివేదిక ప్రతిని అందించాలని 2025 ఆగస్టు 8న రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి కోరారు. కమిషన్ నివేదిక తనకు ఇవ్వకుండా అందులోని అంశాలపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరపడం వల్ల తన వ్యక్తిగత భద్రతకు భంగం కలుగుతున్నదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఏ విచారణ అయినా సహజ న్యాయ సూత్రాలకు, చట్టాలకు లోబడి జరగాలి. అట్లా జరగని పక్షంలో ఆ విచారణకు ఎలాంటి విలువ ఉండదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం-1952 ప్రకారం ప్రభుత్వాలకు సంబంధిత అంశం మీద విచారణ చేసే హక్కు ఎంత ఉందో, విచారణను ఎదుర్కొనే పౌరులు, అధికారులు, నాయకులు ఎవరైనా సరే వారికి కూడా ఏకపక్ష విచారణల నుంచి తమను తాము రక్షించుకునే హక్కు ఉంది. చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం విచారణ కమిషన్‌కు సాక్షులను పిలిచి, ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. విచారణ వల్ల ఎవరి ప్రతిష్టకైతే భంగం వాటిల్లుతుందో వారు తమ ప్రతివాదనలు వినిపించడానికి అదే చట్టంలోని సెక్షన్ 8(బీ) ప్రకారం నోటీసులు ఇవ్వాలి. డిఫెండ్ చేసుకునే సంపూర్ణ అవకాశం వాళ్లకు ఇవ్వాలి. కమిషన్ సేకరించిన ఆధారాలను వారు గాని, వాళ్ల తరపున న్యాయవాది గాని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి సెక్షన్ 8(సీ) ప్రకారం తగిన అవకాశం కల్పించాలి.
కాళేశ్వరం కమిషన్ విచారణను ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రికి, మాజీ నీటిపారుదల శాఖ మంత్రికి, అధికారులకు డిఫెండ్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు. సెక్షన్ 8(బీ), 8(సీ) కింద నోటీసులు ఇవ్వలేదు. ఈ కమిషన్ ఉద్దేశపూర్వకంగా విచారణ జరపడంతో విధివిధానాలను పాటించనట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా కమిషన్ అనేది వాస్తవాలను కనుగొనడం (ఫ్యాక్ట్ ఫైండింగ్) మాత్రమే చేయాలి. అంతేగానీ ఇది న్యాయ విచారణ కాదు, కమిషన్ చెప్పింది తీర్పూ కాదు. ఆ వాస్తవాల పరిశోధన కూడా చట్టానికి లోబడి చేయాలి. లేకపోతే అది రాజ్యాంగ ఉల్లంఘనే.
సెక్షన్ 8(బీ) ప్రకారం నోటీసులు ఇవ్వకుండా, విచారణ జరిపి ఇచ్చిన రిపోర్టుల గురించి గతంలో వివిధ సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులను ఒకసారి పరిశీలిద్దాం. విచారణ కమిషన్‌ను రాజకీయ ఆయుధంగా వాడకూడదని 1958లో రామకృష్ణ దాల్మియా వర్సెస్ టెండూల్కర్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టం పరిధిలో నిష్పాక్షికంగా విచారణ జరపాలని సూచించింది. 1989లో కిరణ్ బేడి వర్సెస్ కమిటీ ఆఫ్ ఎంక్వైరీస్ కేసులో సెక్షన్ 8(బీ) కింద నోటీసులు ఇవ్వకుండానే విచారణ చేసి రిపోర్టు ఇవ్వగా, అది చెల్లదని, న్యాయబద్ధం కాదని, అలాంటి నివేదిక లెక్కలోకి రాదని అంటూ జస్టిస్ ఎన్.ఎన్.గోస్వామి వ్యాఖ్యానించారు. అంతేకాదు, జస్టిస్ డి.పి.వాద్వా కమిషన్ ఇచ్చిన సదరు రిపోర్టును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
లాల్ కృష్ణ అద్వానీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సెక్షన్ 8(బీ) కింద నోటీసు ఇవ్వనందుకు జస్టిస్ రామ్ నందన్ ప్రసాద్ ఇచ్చిన రిపోర్టును బీహార్ హైకోర్టు రద్దుచేసింది. దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. 1997లో జయలలిత వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో విచారణ ఎదుర్కొనే వారిని సాక్షులుగా మాత్రమే పిలిచి సెక్షన్ 8(బీ) కింద ప్రతివాదన వినిపించేందుకు నోటీసులు ఇవ్వకపోతే ఆ విచారణ చెల్లదని మద్రాస్ హైకోర్టు తేల్చిచెప్పింది. అంతేకాదు, ఈ తీర్పులో 8(బీ) నోటీసులు ఇవ్వడం తప్పనిసరి అని కూడా చెప్పింది.
1977లో జస్టిస్ జె.సి. షా కమిషన్‌ను ఎమర్జెన్సీలో జరిగిన అరాచకాల మీద విచారణ కోసం అప్పటి జనతా ప్రభుత్వం నియమించింది. ఈ కేసులో మాత్రం ఇందిరాగాంధీ, ప్రణబ్ ముఖర్జీ, మరి కొంతమందికి సెక్షన్ 8(బీ) కింద విచారణ కమిషన్ నోటీసులు ఇచ్చింది. డిఫెండ్ చేసుకునే అవకాశం కల్పించింది. కానీ, ఈ రిపోర్టును పార్లమెంట్లో ప్రవేశపెట్టగానే దేశమంతా నిరసనలు, ధర్నాలు జరిగాయి. క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఇందిరాగాంధీ తన స్వయం నిర్ణయాధికారంతోనే రాజకీయ కక్ష సాధింపు కోసం నాడు ఎమర్జెన్సీ విధించి వేలాది మందిని ప్రివెంటివ్ డిటెన్షన్ పేరుతో జైళ్లలో పెట్టారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. అయితే, చివరికి ఈ రిపోర్టుపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే పక్కన పెట్టేశారు. కానీ, తమ హక్కులకు భంగం కలిగిందంటూ ఇందిరాగాంధీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో సెక్షన్ 8(బీ) పద్ధతి ప్రకారం (procedural fairness) లేదని చెప్తూ షా కమిషన్ రిపోర్టును 1978 నవంబర్ 7న ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది.
1992 డిసెంబర్ 16న బాబ్రీ మసీదు కూల్చివేతపై అప్పటి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ లిబర్హాన్ కమిషన్‌ను నియమించింది. ఈ కేసు విచారణను 3 నెలల్లో పూర్తి చేయాలని చెప్పినప్పటికీ, 48 సార్లు కమిషన్ గడువు పొడిగించారు. 17 సంవత్సరాల అనంతరం కమిషన్ రిపోర్టు ఇచ్చింది. దేశ చరిత్రలోనే సుదీర్ఘకాలం నడిచిన కమిషన్ ఇదే. 2009 జూన్ 30న పార్లమెంట్లో ఈ కమిషన్ రిపోర్టును ప్రవేశపెట్టారు. అయితే, నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి నిరసనలకు దిగింది.
1991లో కేంద్ర ప్రభుత్వం రాజీవ్‌గాంధీ హత్యలో జరిగిన భద్రతా వైఫల్యాలపై జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్‌ను నియమించింది. సెక్షన్ 8(బీ) కింద అందరికీ నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ ఈ రిపోర్టు ఆధారంగా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2023లో దిశ హత్య కేసులో సుప్రీంకోర్టు జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్‌ను నియమించింది. తహసీల్దార్‌తోపాటు మరి కొంతమందికి 8(బీ) కింద నోటీసులు ఇవ్వలేదని రాష్ట్ర హైకోర్టు W.P. No. 8572 of 2023లో స్టే విధించింది.
ఇప్పటి వరకు వివిధ అంశాలపై వేసిన ఏ ఒక్క కమిషన్‌లో కూడా సెక్షన్ 8(బీ), 8(సీ) కింద నోటీసులు ఇవ్వని రిపోర్టు చట్టం ముందు నిలబడలేదు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 6లో జ్యుడీషియల్ కమిషన్‌గా పేర్కొంది. కానీ, విచారణ కమిషన్ల చట్టం ప్రకారం జ్యుడీషియల్ కమిషన్ అనేది ఉండదు. పైగా విచారణ జరిపి బాధ్యులను నిర్ధారించాలని జీవోలో పేర్కొన్నారు. కానీ ఎంక్వైరీ కమిషన్‌కు ఆ అధికారం లేదని గతంలో సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో పేర్కొంది. కమిషన్లు భవిష్యత్తులో లోటుపాట్లు లేకుండా ఏం చేయాలో ప్రభుత్వానికి సూచించాలి. అంతేగానీ ఫలానా వాళ్లు తప్పు చేశారని నేరుగా ఆరోపణలతో నివేదిక ఇవ్వడానికి వీల్లేదు. సాక్షులు ఏం చెప్పారో నివేదికలో పొందుపరచాలి. ఫలానా వ్యక్తులు బాధ్యులని నివేదిక ఇవ్వడం చట్టవిరుద్ధం, నిజనిర్ధారణ మాత్రమే చేసే అధికారం కమిషన్‌కు ఉంది. అందుకే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేవలం భద్రతా వైఫల్యాల మీదనే దృష్టి సారించి ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారం నడుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.