దేశంలో ఉమ్మడి కుటుంబాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. సంపాదనే ధ్యేయంగా యువత దూరతీరాలకు తరలిపోతుండటంతో కుటుంబాలు, గ్రామసీమ లు వెలవెలబోతున్నాయి. విదేశాంగ శాఖ లెక్క ప్రకారం.. మూడున్నర కోట్ల మందికి పైగా భారతీయులు విదేశాల్లో ఉన్నారు. వారంతా విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపా ర రీత్యా వెళ్లినవారే. పేద, మధ్యతరగతి వారు సైతం పిల్లల చదువులు, ఉపాధి నిమి త్తం నగరాలు, పట్టణాలకు వలసపోతున్నా రు. దీంతో ఐక్యత, ఆప్యాయత, అనురాగాలకు ఆలవాలమైన ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. తల్లిదండ్రులు ఒంటరివారవుతున్నారు. నగరాలు, పట్టణాల్లోని వృద్ధులు వృద్ధాశ్రమాల బాటపడుతున్నారు.
పల్లెల్లోకీ ఈ జాఢ్యం పాకింది. పల్లె ప్రజలు సైతం ఎవరింటికివారే పరిమితమవుతున్నారు. మనుషుల మధ్య పెరుగుతున్న అసూయ, ద్వేషాలే అందుకు కారణం. ఫలితంగా గ్రామాల్లోని రచ్చబండలు వెలవెలబోతున్నాయి. మనుషుల మధ్య పలకరింపులు కరువై ఒంటరితనం ఆవహిస్తున్నది. పెండ్లి, పేరంటాల సందర్భంగా కలుసుకోవడమూ గగనంగా మారింది. ఆ సందర్భాల్లో కూడా కృత్రిమ పలకరింపులే దర్శనమిస్తున్నాయి. అది కూడా ఈ తరానికే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తర్వాతి తరానికి బంధువులు, సన్నిహితులనే పదాలు కూడా తెలియకపోవచ్చు. ఇదిలా ఉంటే కుటుంబ సభ్యుల మధ్య కూడా అసూయ, ద్వేషం వచ్చి చేరుతున్నాయి. రక్త సంబంధీకుల మధ్య విభేదాల కుంపట్లు రాజుకుంటుండటం బాధాకరం.
అంతెందుకు, చిన్న కుటుంబాల్లోనూ అందరూ కలిసిమెలిసి ఉండే పరిస్థితులు లేవు. పిల్లలు సెల్ ఫోన్ ప్రపంచంలో జీవిస్తుండగా, తల్లిదండ్రులు ఉద్యోగ జీవితంలో తలమునకలవుతున్నారు. వారాంతంలో దొరికే ఒక్క రోజు సెలవును చిన్న చిన్న పనులకు వెచ్చించాల్సి వస్తున్నది. విరామం లేని జీవితం కారణంగా భార్యాభర్తల మధ్య సంబంధాలు సన్నగిల్లుతున్నాయి. సామాజిక సమస్యలను ఎదుర్కోలేని సున్నితత్వంలో పిల్లలు, దైనందిన జీవిత సమస్యలతో తల్లిదండ్రులు.. వెరసి కుటుంబాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. వివాహ వ్యవస్థ సైతం సంక్షోభంలో కూరుకుపోతున్నది. ఉపాధి వేటలో నిమగ్నమవడం, ఉద్యోగాల్లో తీరిక లేకపోవడం తదితర కారణాల వల్ల చాలామంది యువత ఒంటరిపక్షులుగా మిగిలిపోతున్నారు. పెండ్లి అయిన జంటలు అకారణంగా, చిన్న చిన్న గొడవలకే విడిపోతున్నారు. ఏ ఫ్యామిలీ కోర్టు చూసినా ఇలాంటి జంటలతో కిటకిటలాడుతున్నది. ఇప్పటికే దేశంలో 3.5 కోట్లకు పైగా విడాకుల కేసులు పెండింగ్లో ఉన్నట్టు ఒక అంచనా.
ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం వల్ల సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతున్నాయి. భవిష్యత్తులో సమాజాన్ని నడిపించే యువత లేని సమస్యను మన దేశం కూడా త్వరలో ఎదుర్కొనే అవకాశం ఉంది. సామాజిక సవాళ్లను ఎదుర్కోలేని సమాజం అనేక అనర్థాలకు, రుగ్మతలకు ఆలవాలంగా మారుతుంది. అందుకే మనుషుల మధ్య పెరుగుతున్న ఈ ఒంటరితనం మనిషిని, మనస్సును కలచివేసే ప్రమాదం పొంచి ఉంది.
డబ్బు ఒక్కటే సుఖ జీవనానికి మార్గం కాదు. మనం ప్రేమించే, మనల్ని ప్రేమించేవారు మన జీవితంలో ఉండటం ఒక గొప్ప వరం. కాబట్టి, ఇకనై నా ఆప్యాయత, అనురాగం, బంధుత్వాలతో కలగలిసిన సామూహిక సమా జం వైపు మన పిల్లలను నడిపించాల్సిన అవసరం ఉంది. మన సాంప్రదాయాలు, ఆచారాలు, పండుగల గురించి పిల్లలకు తెలియజేయాలి. ఉమ్మడి కుటుంబాల్లో ఉండే బంధాలు, అనుబంధాలను వారికి రుచిచూపించాలి. మనిషి మనిషిని ద్వేషించే కలుషిత వ్యవస్థ నుంచి దూరం జరగాలి. ఇప్పటికైనా మానవతా సమాజం వైపు పయనం మొదలుపెట్టాలి. అందుకు ఉరుకుల పరుగుల జీవితాల నుంచి విరామం తీసుకొని, శారీరక శ్రమను గౌరవించే వృత్తులు, ప్రవృత్తుల వైపు భవిష్యత్తు తరాలను నడిపించాలి. లేకపోతే మనిషి ఒంటరై, దుఃఖభరితుడై, సహజ సంతోషకర జీవనానికి దూరమై జీవచ్ఛవంగా బతకాల్సిన గత్యంతరం ఏర్పడుతుంది.
-ఎన్.తిర్మల్
94418 64514