అంతర్జాతీయ పర్వత దినోత్సవం ఏటా డిసెంబర్ 11న నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి పలు కార్యకలాపాల ద్వారా కొనసాగిస్తున్నది. మన దేశంలో భారతీయ పర్వతారోహణ సంస్థ ఆదేశంతో దేశంలోని పలు పర్వతారోహణ సంస్థలు వివిధ కార్యక్రమాలను నిర్వహించతలపెట్టాయి. ఈ సంవత్సరం ‘పర్వత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించటం’ కార్యక్రమంలో భాగంగా వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆయా సం స్థలు నిర్ణయించాయి. అందులో భాగంగా సదస్సు లు, సెమినార్లను విద్యార్థులకు పెయింటింగ్ పోటీలను నిర్వహించనున్నాయి. అలాగే పర్వతాల సంరక్షణ కోసం కృషిచేస్తున్న వారికి పురస్కారాలు అందజేయాలని కూడా నిర్ణయించారు.
పర్వతాల మీద ఆధారపడి ప్రపంచ జనాభాలో 15 శాతం మంది ప్రజలు జీవిస్తున్నారు. మంచుతో కూడిన పర్వతాలు అత్యంత ఆకర్షణీయ సాహస పర్యాటక ప్రాంతాలుగా విస్తరిస్త్తూ పర్వత పర్యాటకంపై ఆధారపడిన వారికి ఆదాయ మార్గంగా పనిచేస్తున్నాయి. నేపాల్, యూరప్‌లోని కొన్ని దేశాలు పూర్తిగా పర్వతాలపై ఆధారపడి జీవిస్తున్నాయి.
భారతదేశంలో హిమాలయ శ్రేణులు సుమారు 2,400 కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి. ఇందులో అనేక పర్వతాలు సుమారు 1100 అడుగుల నుంచి 24 వేల అడుగుల ఎత్తువరకున్న పర్వతాలు కూడా ఉన్నాయి. జీవనదులైన గంగా, బ్రహ్మపుత్ర, యంగె జ్ వంటివి ఈ పర్వతాల నుంచే ప్రవహిస్తున్నాయి. మన హిమాలయ పర్వతాలు ప్రపంచంలోనే 3వ అత్యధిక మంచుతో కూడిన పర్వతాలు. తర్వాత కారకోరం పర్వత పంక్తులు. ఈ పర్వత శ్రేణులు భారత్, చైనా సరిహద్దుల్లో విస్తరించి ఉన్నాయి, ఇవి సుమారు 500 కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి. ప్రపంచంలోని 2వ అతిపెద్ద పర్వతం కే2 (8,611) మనదేశంలో అతిపెద్ద పర్వతం కాంచనజంగా 8,5 86 మీటర్ల్లు. తర్వాత నందదేవి 7,816 మీటర్లు.
ఇవి కాకుండా ఆరావళి పర్వతాలు సుమారు 700 కి.మీ.లు విస్తరించి ఉన్నాయి, ఢిల్లీ నుంచి రాజస్థాన్, హర్యానా నుంచి గుజరాత్ వరకు ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. ఇవి మంచుతో కూడినవి కావు, ఇక్కడ గురుశిఖర్ ఎత్తయిన పర్వతం (5,650 అడుగులు) ఆ తర్వాత వెస్ట్రన్ ఘాట్స్ వీటిని యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తించింది. ఈస్ట్రన్ ఘాట్స్ బెంగాల్ నుంచి ఏపీ, కర్ణాటక, తమిళనాడు వరకు విస్తరించి ఉన్నాయి. ఎత్తయిన పర్వతం జిందగాద్ (5,540 అడుగులు).
ముఖ్యంగా మన దేశంలోని విద్యార్థులు, యువతకు హిమాలయ పర్వతాలను గురించి అవగాహన కల్పించాలి. ఎందుకంటే మన దేశ సరిహద్దులో రక్షణపరంగా ఇవి ఎంతో కీలకమైనవి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మంచుతో కూడుకున్న చిన్నపెద్ద సుమారు 16 వేల పర్వతాలు మన దేశంలో ఉన్నాయి. వీటి ప్రాముఖ్యం గురించి భవిష్యత్తు తరాల వారికి అవగాహన కల్పించాలి.
పర్వతాల గురించి పర్వతారోహకులకు వాస్తవ పరిస్థితులను తెలియజేయవలసిన బాధ్యత పర్వతారోహణ సంస్థలకు ఉన్నది. అనేక మంది పర్వతారోహకులకు పర్వతాల గురించి కానీ, పర్వతారోహణ గురించి అవగాహన లేదు. మన భారతదేశంలో మంచుతో కూడిన పర్వతాలను మన యువత అధిరోహించడానికి ముందుకురావాలి. దేశంలోని అనేక పర్వతాలు పర్వతారోహణకు చాలా అనుకూలంగా ఉన్నాయి. దేశంలోని పర్వతారోహకులను ప్రోత్సహించడం ద్వారా మన దేశానికి కూడా అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది.
(నేడు అంతర్జాతీయ పర్వత దినోత్సవం)
కె రంగారావు
98492 70575