Illegal Encroachment
ఎంత మాటన్నవ్ సారూ…
ఇల్లు ఇల్లీగల్ ఎైట్లెతది?
అది అమ్మ కడుపంత పవిత్రమైంది.
తాళి గట్టి పెండ్లి జేసుకున్నట్లే
రిజిస్ట్రేషన్ జేసినంక పని మొదలువెడ్తిమి
గవుర్మెంటే పెండ్లి పెద్ద
అధికారులే పురోహితులు
అది అక్రమమైతే
ఆ రోజే పంచాతి వెట్టి
పంచలూడగొడ్తుంటిరి గదా…
అమ్మ నవమాసాలు మోస్తది
ఇల్లు తరతరాలను మోస్తది
అమ్మతో సహా
చెమటబొట్లను పైసలుజేసుకున్న
కష్టార్జితం ఇల్లు
అప్పులు, మిత్తులనే
ప్రసవవేదనను
పంటి కింద భరించిన
పేగు
రెండర్రల చిన్నిల్లు అయినా
ఆశల పల్లకిలో ఊరేగించే
ఇంద్రభవనం అది
దేవుణ్ణి నెత్తిమీద వెట్టుకోని
కుడికాలు మోపిన
పవిత్ర దేవాలయం
అమ్మ ఇష్టానికి చిరునామా
నాయన కష్టానికి పరాకాష్ట
పచ్చుల గూడు ముట్టుకుంటే
పాప మనుకునే మనిషికి
ఇండ్లు కూలగొట్టనీకె
చేతులెట్లొస్తయి సారూ
మొహబ్బత్ కీ షాన్ హైదరాబాద్
ఆబాదీ కా ఖజానా హైదరాబాద్
బర్బాదీ కి మారుపేరైపోతున్నది గదయ్యా
మనిషి గుళ్లను గూలగొడితే
చేతులకు జెట్టలు మొలుస్త యంటరు…
మరి ఓట్లెట్ల పడ్తయి సారూ
ఇంకొక్కసారి…
ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ అనకుండ్రి
మీకు దండంబెడ్త!!!
-శశికళ
ఠాకూర్