న్యాయదేవత అంటే కండ్లకు గంతలు కట్టుకొని, ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో సమానంగా ఉండే త్రాసు పట్టుకొని ఉంటుందని మనందరికీ
తెలిసిందే! న్యాయదేవత విగ్రహంలో కొన్ని మార్పులు చేసి సుప్రీంకోర్టు గ్రంథాలయంలో ఉంచినట్లు ఈ మధ్య పత్రికల్లో వచ్చింది. ఆ విగ్రహంలో న్యాయదేవత కండ్లకు అడ్డంగా ఉండే గుడ్డని తొలగించి, చేతిలో ఖడ్గానికి బదులు రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకున్నట్టు మార్పులు చేశారు.
ఆ మార్పులు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సూచనల మేరకు జరిగినట్టు తెలుస్తున్నది. దానికి ఆయన ఇచ్చిన వివరణ కూడా
మీడియాలో వచ్చింది. ‘న్యాయాన్యాయాల నిర్ధారణలో హింసకు తావులేదు. తీర్పులు రాజ్యాంగంలో సూచించిన నిర్దేశాల ఆధారంగానే ఉంటాయి. కావున నేటి న్యాయదేవత చేతిలో ఖడ్గానికి బదులు రాజ్యాంగం ఉండటమే సబబు’ అని ఆయన అంటున్నారు.
న్యాయం గుడ్డిది అనే అపవాదు ప్రచారంలో ఉన్నదని, అది తప్పని.. కండ్లారా అన్ని పరిశీలించాకే తీర్పు ప్రకటించడం జరుగుతున్నదనే స్పష్టత కోసం విగ్రహం కండ్లకు అడ్డంగా గుడ్డ అవసరం లేదని సీజేఐ డీవై చంద్రచూడ్ భావన. మరో ప్రధానమైన మార్పు ఏమిటంటే విగ్రహంలో న్యాయదేవత ధరించే నిలువుపాటి వస్ర్తానికి బదులుగా హైందవ స్త్రీ మాదిరి చీరకట్టును ఏర్పాటుచేశారు. పాశ్చాత్య దుస్తులతో కాకుండా దేశీయ కట్టుబొట్టుతో ఉండాలనే ఆయన ఆలోచన న్యాయదేవత ఆహార్యంలోనూ మార్పును తెచ్చింది.
న్యాయదేవత విగ్రహ వాడకం ఒక ఆనవాయితీగా మారింది తప్ప దాని విషయం లో ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు గాని, చట్టపర ఆదేశాలు గాని లేవు. అందుకే ఇన్నాళ్లు గా వాడుకలో ఉన్న రూపానికి సీజేఐ తన ఇష్టానుసారంగా మార్పులు సూచించి, అలా రూపొందించిన విగ్రహాన్ని కోర్టు లైబ్రరీలో పెట్టించారు. అయితే, గౌరవ న్యాయమూర్తి చేపట్టిన ఈ మార్పుల పట్ల మాత్రం కొన్ని విమర్శలు వస్తున్నాయి.
సర్వసమ్మతమై, విశ్వ ప్రాచుర్యంలో ఉన్న ఒక రూపానికి ఎవరికి తోచిన మార్పులు వారు చేయడం అంగీకారం కాదనేది అధికం గా వ్యక్తపరిచిన ప్రధాన అభ్యంతరం. అసలు ఆ రూపంలో మార్చాల్సిన అంశమేదీ లేదు, ప్రతి అంశానికి ఒక లోక ప్రయోజక సూచన ఉన్నదనేవారు కూడా ఉన్నారు. కండ్లకు ఉం డే గంతలు తొలగించడంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. న్యాయం కోసం వచ్చినవారు ఎలాంటి వారు, చూడటానికి వాళ్లు ఎలా ఉన్నారనే విషయం అప్రస్తుతం. వారి రూపురేఖలు, ఆహార్యం, హావభావాలు, రాగద్వేషాలు తీర్పును ప్రభావితం చేయవద్దనే ఉద్దేశంతోనే న్యాయదేవత కండ్లు కప్పుకొంటుం ది. అప్పుడే తీర్పు నిష్పక్షపాతంగా ఉంటుందనేది అందరు ఒప్పుకొనే సత్యం. జాన్ రాల్స్ అనే అమెరికన్ సామాజిక తత్వవేత్త న్యాయదేవత ముసుగు ఆవశ్యకత గురించి ‘థియరీ ఆఫ్ జస్టిస్’ అనే గ్రంథంలో విస్తారంగా చర్చించారు. తాను ఎవరికి న్యాయం చెప్తున్నానో తెలియనప్పుడే తీర్పు నిక్కచ్చిగా ఉంటుంది.
కండ్లకు గంతలు ఉన్నప్పుడే త్రాసు సమతూకంగా ఉంటుందనేది శాస్త్రీయ ఆలోచన అని రాశారు. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు సొంత ప్రయోజనాల కోసం కోర్టు తీర్పులను ప్రభావితం చేయవద్దనే సందేశం అందులో దాగి ఉన్నదని అన్నారు. న్యాయదేవత చేతిలో ఉండే ఖడ్గం రెండు వైపులా పదును గల ఆయుధం, నేరం చేసినవాడు ఏ వైపు నుంచి కూడా శిక్షను తప్పించుకోలేడనే సం కేతం అందులో ఉన్నదని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడి, న్యాయానికి చిహ్నంగా వాడబడుతున్న ఈ విగ్రహానికి శతాబ్దాల చరిత్ర ఉన్నది. గ్రీకు దేవత జస్టిసియా రూపం దీనికి మూలం. అప్పటికే ఆమె బొమ్మను రోమన్ నాణేలపై, న్యాయపత్రాలపై వాడేవారు. ఆమె చేతిలో త్రాసు ఉండటంతో ఆ రూపాన్ని న్యాయదేవతగా స్వీకరించడం జరిగింది. 16వ శతాబ్దంలో కండ్లకు అడ్డంగా గుడ్డ కట్టిన రూపం వాడుకలోకి వచ్చింది. అప్పటినుంచి ఆ విగ్రహంలో త్రాసు సమన్యాయానికి, కత్తి శిక్షించే అధికారానికి, గంతలు నిష్పక్షపాతానికి గుర్తుగా ఉంటున్నాయి.
బ్రిటిష్ కాలం నుంచి మన దేశంలో ఈ విగ్రహాన్ని కోర్టు హాల్లలో, న్యాయ కళాశాలల్లో, మ్యూజియం, పార్కుల్లో వాడుతున్నారు. న్యాయవాద వృత్తుల్లో కొనసాగేవారి ఇండ్లలో కూడా కనబడుతున్నది. సుదీర్ఘ చరిత్ర, విశ్వవ్యాప్తి గల విగ్రహానికి చేపట్టిన మార్పులు ఇప్పుడు అందరిని సందిగ్ధంలో పడేశాయి. ఈ విమర్శ మెల్లగా జస్టిస్ చంద్రచూడ్ పైకి మళ్లింది.
సెప్టెంబర్ 12న గణపతి పండుగ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా జస్టిస్ చంద్రచూడ్ ఇంటికి వెళ్లి పూజలో పాల్గొనడం ఒక చర్చకు దారితీసింది. వచ్చే నెల 11 నాడు పదవీ విరమణ ఉన్నందున భవిష్యత్తులో ప్రభుత్వ పదవుల కోసం ముందస్తుగా మోదీని తృప్తిపరచే ప్రణాళికలోకి ఈ మార్పులు వస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కోర్టు తీర్పులు అధినేతల ఆదేశాలకు ప్రభావితమవుతున్నట్టే ఉంటున్నాయి. ఇక న్యాయదేవత కండ్లు తెరిచి చెప్పే తీర్పులు ఇంకెలా ఉంటాయో చూడాలి.
-నర్సన్ బద్రి
9440 128169