వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని ‘దామగుండం’ అటవీ ప్రాంతంలో భారత నావికాదళం (ఇండియన్ నేవీ) నిర్మించతలపెట్టిన వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ (రూ.2,500 కోట్లు) శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా హాజరవుతున్నారని సమాచారం. అయితే, 2,900 ఎకరాల అటవీ భూమిని నేవీకి అధికారికంగా అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లను సిద్ధం చేసింది.
సముద్రతీర ప్రాంతానికి దగ్గరగా దేశంలో అనేక ప్రాంతాలున్నాయి. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకపోవడం ఇక్కడి ప్రజలకు అన్యాయం చేయడమే. దాదాపు 60 వేల మంది ప్రజలు ఈ అడవిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ అడవిలో 500 రకాల వైవిధ్యభరితమైన చెట్లు, 150 రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు అంతరించిపోతాయనే విషయాన్ని స్థానిక ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
Navy Radar | వీఎల్ఎఫ్ రాడార్ నిర్మాణం ఇక్కడే ఎందుకనేది అంతుచిక్కని ప్రశ్న. ఈ రాడార్ స్టేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం 2023 వరకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. కానీ, నాటి కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ అటవీ ప్రాంతానికి, స్థానిక ప్రజలకు, పర్యావరణానికి నష్టం కలుగుతుందన్న కారణంతో అంగీకరించలేదు. కేంద్రం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గలేదు. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు వేగమందుకోవడం విడ్డూరం. జనవరి 24న సీఎం రేవంత్‌రెడ్డి దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లోని 2,900 ఎకరాల అటవీ భూమిని నావికాదళ అధికారులకు అప్పగించారు. అందుకోసం నేవీ కంపా నిధుల నుంచి రూ.133.54 కోట్లు, భూ సంరక్షణ చర్యల కోసం మరో రూ.18.56 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించింది.
ఈ రాడార్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా దామగుండం అడవిలో సుమారు 12 లక్షల చెట్లను నరికివేయాల్సి ఉంటుంది. అంతేకాదు, మూసీ నది పరీవాహక ప్రాంతం దెబ్బతింటుంది. సముద్రతీర ప్రాంతానికి దగ్గరగా దేశంలో అనేక ప్రాంతాలున్నాయి. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకపోవడం ఇక్కడి ప్రజలకు అన్యాయం చేయడమే. ఈ అడవిపై దాదాపు 60 వేల మంది ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపు వెయ్యేండ్ల చరిత్ర కలిగిన ఈ అడవిలో 500 రకాల వైవిధ్యభరితమైన చెట్లు, 150 రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు అంతరించిపోతాయనే విషయాన్ని స్థానిక ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాదు, అరుదైన జింకలు, తోడేళ్లు, అడవి పందుల వంటి జంతువులు, పలురకాల పక్షులు తమ గూడును కోల్పోనున్నాయి.
ఈ రాడార్ స్టేషన్ వల్ల ప్రాణాంతకమైన రేడియేషన్ వెలువడి, తద్వారా పంచభూతాలు కలుషితమవుతాయి. స్థానికులకు మానసిక ఆందోళన, నిద్రలేమి, సంతానలేమి, వంధత్వం, చర్మ రోగాల వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదనే వార్తలు కోకొల్లలుగా వస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో బతుకుతున్నారు. తమను రక్షించవలసిన ప్రభుత్వాలే నాశనం చేయడానికి పూనుకుంటున్నాయని ప్రజలు గోడు వెళ్లబోసుకుంటున్నారు.
ఈ దామగుండం అడవికి సమీపంలోని అనంతగిరి అడవులే మూసీ నదికి జన్మస్థలం. ఈ నది ఇక్కడి నుంచే మొదలై విశ్వనగరం హైదరాబాద్ మీదుగా దాదాపు 240 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ నల్లగొండ జిల్లాలోని వాడపల్లి సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. ఇక రాడార్ నిర్మాణం వల్ల మూసీ నదితో పాటు పుట్టిన ఈసా, కాగ్నా నదుల అస్తిత్వం కూడా ప్రమాదంలో పడుతుంది. అంతేకాదు, దీని ప్రభావం 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌పై కూడా పడుతుండటమే యావత్ రాష్ర్టాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. అందుకే, ‘సేవ్ దామగుండం’ అంటూ పర్యావరణ హితులు ఈ రాడార్ సమస్య తీవ్రతను ఇటు ప్రజలకు, అటు పాలకులకు అర్థం చేయించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
కానీ, నిద్రావస్థలో ఉన్న పాలకుల్లోనే ఇంకా చైతన్యం రావడం లేదు. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం నావికాదళానికి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలంటూ సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ పర్యావరణవేత్త మేధాపాట్కర్ రెండు నెలల కిందట ‘సేవ్ అనంతగిరి’ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాడార్ స్టేషన్ ఏర్పాటును రద్దుచేయాలని కోరుతూ దామగుండం అటవీ సంరక్షణ జేఏసీ కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే, ప్రభుత్వ షరతులన్నింటినీ పాటించాలని హైకోర్టు నేవీని ఆదేశించింది. అయినా అనేక ప్రశ్నలకు నేవీ అధికారులు సమాధానం ఇవ్వకపోవడంతో ప్రజలు మరింత భయాందోళనలకు గురవుతున్నారు. కాబట్టి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా సరైన నిర్ణయం తీసుకోవాలి. రాడార్ ప్రాజెక్టు నిర్మాణాన్ని రద్దుచేయాలి. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయనే సత్యాన్ని పాలకులు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
(దామగుండం అటవీ ప్రాంతంలో నేడు నేవీ రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన)
-డాక్టర్ కోలాహలం రామ్‌కిశోర్
98493 28496