ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న ఆర్థిక సహకారం, అమలు చేస్తున్న పథకాల ఫలితంగా తెలంగాణలో కులవృత్తులు తిరిగి జీవం పోసుకుంటున్నాయి. పరాయి పాలనలో కుంటుపడ్డ గ్రామీణ వ్యవస్థ తొమ్మిదేండ్ల పాలనలోనే గాడిన పడ్డది. బతుకే భారమనుకొన్న దుస్థితి నుంచి హుందాగా జీవించే స్థితికి చేరుకున్నది. ఇప్పుడు కొత్త బీసీ కులవృత్తిదారులకు, చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించనుండటంతో రాబోయే రోజుల్లో వారి జీవితాలు కొత్త పుంతలు తొక్కనున్నాయి. చాకలి, మంగలి, కుమ్మరి, మేదరి ఇలా ఏ కులవృత్తి, ఏ కళాకారుడూ నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకొంటున్నది. ప్రభుత్వం అమలుచేస్తున్న సమగ్ర విధానాల వల్లే ఇది సాధ్యమైంది.
ప్రపంచంలో ఎక్కడా లేని వ్యవస్థ భారతావనిది. కులమనే ప్రత్యేక విశిష్ఠత వల్లే స్వయం సమృద్ధి గ్రామీణ ఆర్థికవ్యవస్థ సాధ్యమైంది. కానీ ఈ 75 ఏండ్ల కాలంలో ఆ వ్యవస్థను అవగాహన చేసుకున్నవారు, చేసుకున్నా ఆ వ్యవస్థ వికాసానికి అనుగుణమైన ప్రణాళికలను చేపట్టిన భారత పాలకులు ఎవరూ లేకపోవడం విషాదం.
గ్రామీణవ్యవస్థను బలహీనపరిచేందుకు బ్రిటిష్ పాలకులు అనుసరించిన విధానాలనే స్వతంత్ర పాలకులు అమలుచేస్తుండటం వైచిత్రి. చేతివృత్తులను నిలిపే చర్యలనూ, వృత్తిదారులను ఆధునిక టెక్నాలజీ వైపు తీసుకెళ్లిన ప్రయత్నాలనూ చేసిన దాఖలాల్లేకపోవడం శోచనీయం. ఆధునికీకరణ చేపట్టకపోవడం మూలంగా దేశంలోని కులవృత్తులు, చేతివృత్తులు ప్రపంచీకరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వెల్లువ ధాటికి కుప్పకులాయి. మరోవైపు అదే సమయంలో భారత పాలకులు వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసిన ఫలితంగా కులవృత్తులు మరింత అగాధంలోకి కూరుకుపోయాయి. ఎందుకంటే కులవృత్తులనేవి రైతులు, వ్యవసాయంతో ముడిపడినవి. సామాజిక సంస్కృతిలో ఒక భాగం. ఎవుసమే ప్రశ్నార్థకంగా మారిన వేళ కులవృత్తులు ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొన్నది.
ఇక తెలంగాణలో బీసీ కులవృత్తిదారుల పరిస్థితి మరింత దయనీయం. ఉమ్మడి ఏపీ పాలకులు కుట్రపూరితంగా తెలంగాణ గొలుసుకట్టు నీటిపారుదల వ్యవస్థకు గండికొట్టి, ప్రాజెక్టులను పండబెట్టి, కాలువలను ఎండబెట్టిన ఫలితంగా ఇక్కడి ఎవుసం కొండెక్కింది. పల్లె వాకిలి పొక్కిలైంది. ఒకటి కాదు, రెండు కాదు తరాల తరబడి చేసిన నిర్లక్ష్యం మూలంగా తెలంగాణ ఎవుసం కొడిగట్టింది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఆయా కులవృత్తులను కాపాడేందుకు, లాభదాయకంగా మార్చి వృత్తిదారులకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థ మౌలిక సూత్రాన్ని అర్థం చేసుకోవడంతోపాటు, దాని బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకున్న మొదటి నాయకుడు కేసీఆరే.
అందులో భాగంగా చేతివృత్తులకు ఆధునిక సొబగులద్దేందుకు ప్రణాళికలను రూపొందించి ఆ దిశగా ప్రభుత్వం ముందుకుసాగుతుండటం ముదావహం. కుల, చేతివృత్తులకు మూలాధారమైన ఎవుసాన్నే ముందుగా ఆయన సంస్కరించడం గమనార్హం. నీటి సౌలతులను మెరుగుపర్చి ఎవుసానికి ఊపిరులూదారు. పరోక్షంగానే కులవృత్తుల అభ్యున్నతికి తొలి అడుగులు వేశారు. అక్కడితో ఆగకుండా గొల్లకుర్మలకు గొర్రెలు, ముదిరాజులకు చేపల పంపిణీ, మార్కెటింగ్ కోసం వాహనాలు అందజేసి ఆయా వృత్తుల పునరుజ్జీవనానికి బలమైన పునాదులు వేశారు. ప్లాస్టిక్ వస్తువుల రంగప్రవేశంతో సంప్రదాయ ఉత్పత్తులకు గిరాకీ తగ్గి సంక్షోభంలో కూరుకుపోయిన కులవృత్తులకు కొత ్తబాటను చూపారు. కుమ్మర్లకు టీ కప్‌లు, వాటర్ బాటిల్స్, గ్లాస్లు, మగ్గులు, దీపంతలు తదితర మట్టిపాత్రల తయారీపై తర్ఫీదునిచ్చి భరోసా నింపారు. మేదర్లకు గృహాలంకరణ వెదురు ఉత్పత్తులపై శిక్షణ ఇప్పించారు. ఆధునిక యంత్ర పరికరాలపై మార్కెట్ డిమాండ్‌కు అనుగుణమైన ఉత్పత్తులు తయారుచేసేలా శిక్షణ ఇప్పించారు. రజక, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఆధునిక మోడ్రన్ లాండ్రీలను ఏర్పాటు చేస్తుండటమే కాకుండా ప్రభుత్వసంస్థల్లో బట్టలు ఉతికే పనులను రజక సొసైటీలకే కట్టబెట్టారు. నాయీబ్రాహ్మణ యువతకు సైతం బ్యూటీషియన్ వంటి కోర్సుల్లో తర్ఫీదునిస్తూ వృత్తిపనులకు సొబగులద్దారు.
విశ్వబ్రాహ్మణులకు ఆధునిక క్యాడ్ మిషన్‌పై ఉంగరాలు, ఆభరణాలు, విగ్రహాలను ఎలా తయారుచేయాలి, ఏ విధంగా నూతన డిజైన్లను రూపొందించాలి? స్వల్పకాలంలో రాళ్లను ఎలా పొదగాలి? తదితర అంశాలతో పాటు హాల్ మార్కింగ్ చేసే పద్ధతులపై కూడా శిక్షణ ఇప్పించగా, శిక్షణ పొందిన వృత్తిదారులందరూ నైపుణ్యాలు పెంచుకుని నేడు తమ వృత్తులో రాణిస్తుండటం ప్రభుత్వ కృషికి దర్పణం పడుతుంది.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అడుగు ముందుకువేసి బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.లక్షను అందించాలని నిర్ణయించడం అభినందనీయం. ప్రభుత్వం అందజేయనున్న ఈ సాయం వృత్తిపనివారల అభ్యున్నతికి ఎంతో ఊతమిస్తుందనడంలో సందేహం లేదు. శారీరక శ్రమను తగ్గించేందుకు వీలుగా రూపొందించిన అధునాతన పనిముట్లు, అచ్చు యంత్రాలను కొనుగోలు చేసుకునేందుకు దోహదపడనున్నది.
శాలివాహనులు విద్యుత్తుతో నడిచే సారె, మట్టిని జల్లెడ పట్టే, పిసికే పగ్మిల్స్ను, మట్టి గణపతి విగ్రహాల తయారీకి కావాల్సిన అచ్చులను, మేదరి కులస్థులు వెదురు బొంగులను నరికేందుకు అధునాతన కత్తులు, క్రాస్కటింగ్, డ్రిల్లింగ్ మిషన్స్, సన్డార్స్, స్వర్ణకారులకు సైతం 1-4 లక్షల విలువైన యంత్ర ఉపకరణాలను, అధునాతన డిజైన్ అచ్చులను, రజకులకు వాషింగ్మిషన్లు, ఐరన్, డ్రయ్యర్లు, నాయీబ్రాహ్మణులు బ్యూటీషియన్ కిట్లను కొనుగోలు చేసుకుని ఉపాధిని మరింత మెరుగుపరచుకునేందుకు మార్గాలు ఏర్పడ్డాయి. ఇతర వృత్తిదారులు సైతం ముడిసరుకు కొనుగోలు చేసుకునేందుకు ఆర్థిక భరోసా లభిస్తున్నది. రాబోయే రోజుల్లో తెలంగాణల బీసీ కులవృత్తులు, చేతివృత్తులు మరింత పునర్వికాసాన్ని పొందేందుకు లక్ష సాయం ఎంతో దోహదపడుతుంది. అన్నివిధాలుగా బీసీలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి, లక్ష రూపంలో సాయం చేస్తూ మరో గొప్ప పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీసీలందరి తరపున నా ప్రత్యేక ధన్యవాదాలు. లక్ష సాయాన్ని అందుకున్న వృత్తిదారులు ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలనేది నా ప్రబల ఆకాంక్ష.
(బీసీ వృత్తులకు నేటి నుంచి రూ.లక్ష ఆర్థికసాయం పథకాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా..)
-దుండ్ర కుమారస్వామి
99599 12341