క్రాప్ హాలిడే.. సర్కార్‌కు జాలీడేనా!
ఎల్ నినో కరువు ముంచుకొస్తున్నది కనుక వరి పైరు వేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన రైతుల్లో తీవ్ర ఆందోళన, ఆవేశం, ఆగ్రహం రేకెత్తించింది. రైతుకు క్రాప్ హాలిడే..మరి ఈ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదా? దాహం వేసినప్పుడే బావి తవ్వుకుంటామా? ఎల్ నినో ప్రకృతి విపత్తు కావచ్చు. నీటి నిర్వహణలో వైఫల్యానికి బాధ్యులెవరు?
ఎల్ నినో కరువు ముంచుకొస్తున్నది కనుక వరి పైరు వేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన రైతుల్లో తీవ్ర ఆందోళన, ఆవేశం, ఆగ్రహం రేకెత్తించింది. రైతుకు క్రాప్ హాలిడే..మరి ఈ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదా? దాహం వేసినప్పుడే బావి తవ్వుకుంటామా? ఎల్ నినో ప్రకృతి విపత్తు కావచ్చు. నీటి నిర్వహణలో వైఫల్యానికి బాధ్యులెవరు? ముందస్తు చర్యలు చేపట్టాలన్న ఇంగితం ఇసుమంతైనా ఈ ప్రభుత్వానికి లేదా? ఇవి రైతులు సోషల్ మీడియా వేదికగా సంధిస్తున్న ప్రశ్నలు. పంట వేయొద్దని రైతుకు చెప్పడం సులభం. కానీ పంట వేయకుండా రైతు కుటుంబం ఎలా బతకాలో చెప్పడం అంత సులభం కాదు. నీళ్లు లేవు కాబట్టి వరి వేయొద్దని సీఎం విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే ఎనిమిది నుంచి పది నెలలు తాగు, సాగునీరు, విద్యుత్తు విషయంలో కష్టాలు ఎదురుకావచ్చని ఆయనే హెచ్చరిస్తున్నారు.
రైతు పంట వేయకపోతే అతని కుటుంబానికి అన్నం పెట్టేదెవరు? అప్పులు తీర్చేదెవరు? వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేదెవరు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రైతుకు క్రాప్ హాలిడే ప్రకటించే ముందు, రైతు కుటుంబానికి ఆదాయ భరోసా ప్రకటించాలి. సామాజిక మాధ్యమాల్లో రైతులు చేస్తున్న వ్యంగ్య వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఒక సూటి ప్రశ్నను సంధిస్తున్నాయి. ‘ముఖ్యమంత్రి గారూ! మీరు చెప్పినట్టు మేం ఆరు నెలలు పంట వేయకుండా ఉంటాం. కానీ మా మాట కూడా వినండి. మేం పంటలు వేయకుండా ఉంటే, ప్రభుత్వంలోని మీతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధి కారుల నుంచి చిన్న ఉద్యోగుల వరకు అందరూ ఆరు నెలల పాటు జీతాలు తీసుకోకుండా ఉండండి. అప్పుడు మా బాధ మీకు అర్థమవుతుంది’ అని ఆవేశంతో ప్రశ్నిస్తున్నారు. రైతు జీవనాధారాన్ని వదులుకోవాల్సి వచ్చినప్పుడు, అతనికి ప్రత్యామ్నాయం ఏమిటన్న ప్రశ్న. ఉద్యోగికి జీతం ఆదాయం.
రైతుకు పంట ఆదాయం. రైతు పెట్టుబడి పెట్టి, నెలల తరబడి శ్రమించి, పంట చేతికొస్తేనే డబ్బు సంపాదిస్తాడు. ప్రభుత్వం పంట వేయొద్దంటే అతని కుటుంబ పోషణ ఎలా సాగాలి? ఈ నష్టానికి పరిహారం ఎవరిస్తారు? మేడిగడ్డ నుంచి దిగువకు 734 టీఎంసీలు, కృష్ణా, గోదావరి నుంచి నిరాటంకంగా నీళ్లు కిందికి పోతుంటే చేతులు ముడుచుకు కూర్చున్న ప్రభుత్వానికి ఏ బాధ్యత లేదా?
మేడిగడ్డ మీదుగా వంద రోజుల్లో 734 టీఎంసీల గోదావరి జలాలు దిగువకు వెళ్లాయి. ఎల్లంపల్లి నుంచి జూన్-అక్టోబర్ 16 వరకు 17.69 టీఎంసీల నీరు దిగువకు విడుదలైంది. ఈ గణాంకాలు తెలంగాణ నీటి నిర్వహణపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. గోదావరిలో ప్రవహించిన మొత్తం నీటిని నిల్వ చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ బరాజ్‌ల భద్రత, నిల్వ సామర్థ్యం, పంపుల పనితీరు వంటి పరిమితులు ఉంటాయి.
అయినప్పటికీ, అందుబాటులో ఉన్న నీటిని సాధ్యమైనంత మేరకు తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక రూపొందించిందా? లేదా? అనేదే కీలకం.ప్రజలకు అవసరమైన నీటిని అందుబాటులోకి తెచ్చేందుకు సాంకేతికంగా సాధ్యమైన చర్యలను వేగంగా చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతను కాపాడుతూనే నీటి వినియోగానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి. రాజకీయ వివాదాల మధ్య ప్రజాప్రయోజనాలు బలికాకూడదు.కృష్ణా జలాల విషయంలో పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరో కీలక ఉదాహరణ. ఈ ప్రాజెక్టులో ఐదు భారీ రిజర్వాయర్లు, పంపింగ్ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నప్పటికీ, నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీటిని తరలించే కాలువలో 2.5 కిలోమీటర్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కారణంగా మిగతా రిజర్వాయర్లకు నీటిని తరలించడంలో ఆటంకం ఏర్పడింది.
ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించాలన్నది లక్ష్యం. అలాంటప్పుడు కీలకమైన కాలువ పనులు సకాలంలో ఎందుకు పూర్తి చేయలేదు? నీటి కొరత తీవ్రతరం అవుతున్నప్పుడు అందుబాటులో ఉన్న నిల్వ సామర్థ్యాన్ని వినియోగించుకోలేకపోవడానికి కారణాలేమిటి? దీనికి సర్కార్ సమాధానం చెప్పాలి. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ నీటిని వినియోగించుకుంటున్న సమయంలో, తెలంగాణ ప్రాజెక్టుల ద్వారా నీటిని సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతుందా? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఎల్ నినోను ఏ ప్రభుత్వం ఆపలేదు. కానీ దాని ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించవచ్చు. జలాశయాల నిర్వహణ, పంటల ప్రణాళిక, తక్కువ నీటితో పండే పంటలకు ప్రోత్సాహం, తాగునీటి భద్రత, రైతులకు పరిహారం వంటి చర్యలు చేపట్టవచ్చు. కానీ అలా చేయకుండా ప్రభుత్వం ఈ అక్టోబర్‌లో తాగు, సాగునీరు, విద్యుత్తు సరఫరాపై సమీక్షలు నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. అయితే సమీక్షలు నిర్వహించడం ఒక ఎత్తు. ముందస్తు చర్యలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలయ్యాయన్నది మరో ఎత్తు. నీటిని నిల్వ చేసుకునే అవకాశాలు, ప్రాజెక్టుల పెండింగ్ పనులు, అంతర్రాష్ట్ర జలాల వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వం సమగ్ర నివేదిక ఇవ్వాలి.
నీటి కొరత ఉన్నప్పుడు తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ రైతును ఆదాయం లేకుండా వదిలేయడం పరిష్కారం కాదు. పంట విరామం కోరితే ఆర్థిక సహాయం, ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు, మార్కెట్ భరోసా, పంటల బీమా, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలి. గోదావరి జలాల వినియోగం, కాళేశ్వరం నిర్వహణ, పాలమూరురంగారెడ్డి కాలువ పనులు, కృష్ణా జలాల వాటా వంటి అంశాలన్నింటిపై వాస్తవాలతో ప్రజలకు సమాధానాలు చెప్పాలి.
ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడంలో పాలకుల సామర్థ్యమే ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పంటకు విరామం ఇవ్వాలని రైతును కోరే ప్రభుత్వం, జలవనరుల నిర్వహణపై కూడా లెక్కలు చెప్పాలి. రైతు తన ఆదాయాన్ని వదులుకోవాల్సి వస్తే, అతని కుటుంబాన్ని ఆదుకునే బాధ్యతను స్వీకరించాలి. ఎల్ నినో ప్రకృతి సృష్టించిన సంక్షోభం కావచ్చు. దానిని ఎదుర్కొనే సంసిద్ధత సర్కార్ బాధ్యత. రైతు బతికితేనే వ్యవసాయం బతుకుతుంది. వ్యవసాయం బతికితేనే తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బతుకుతుంది. ఈ విషయాన్ని మర్చిపోతే రైతునే కాదు..యావత్ రాష్ర్టాన్నే కరువు కబళిస్తుంది!
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
వీరేంద్ర కాపర్తి
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

