రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్చ చేయకుండానే ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ అనే పేరుతో తెచ్చిన దార్శనిక పత్రంలో విద్యారంగంలో సంస్కరణల గురించి ప్రస్తావించింది. ఇందులో భాగంగానే 10వ తరగతి, ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేసి, తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (టీజీఎస్ఈబీ) పేరిట ఒక్క బోర్డునే ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యావేత్తలను, మేధావులను విస్మయానికి గురిచేసింది.
ఈ నిర్ణయం ‘నూతన జాతీయ విద్యావిధానం-2020’కి అనుగుణంగా ఉన్నదన్న విషయం స్పష్టంగా తెలుస్తున్నది. ప్రైవేటీకరణ, కేంద్రీకృత విద్యావిధానాలకు అనుకూలంగా రూపొందించిన ఈ నూతన ‘జాతీయ విద్యా విధానం-2020’ను ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యావేత్తలు, మేధావులు, ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ‘నూతన జాతీయ విద్యావిధానం-2020’ మీద ఇప్పటివరకు తమ వైఖరి స్పష్టంగా తెలియజేయకుండానే ఆ విధానానికి అనుకూలంగా రాష్ట్ర విద్యారంగంలో మార్పులు తీసుకురావడం విడ్డూరం.
తెలంగాణ రైజింగ్ దార్శనికత పత్రం-204 7లో మరికొన్ని ముఖ్యాంశాలను రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచింది.
విద్యా ప్రమాణాలు, నాణ్యత, గుర్తింపునకు సంబంధించి అన్నిరకాల పాఠశాలల కోసం తెలంగాణ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ (టీజీఎస్ఎస్ఏ)ని ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించింది. అంటే, డిగ్రీ, పీజీ కళాశాలలకు ‘న్యాక్’ ఏ విధంగా గ్రేడ్ల రూపంలో గుర్తింపునిస్తుందో, ఇకనుంచి పాఠశాలలకు కూడా తెలంగాణ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ కూడా గ్రేడ్ల రూపంలో గుర్తింపును ఇవ్వనున్నదన్న మాట. సహజంగానే ప్రైవేట్ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలుంటాయి. అందుకే ప్రైవేట్ పాఠశాలలే మెరుగైన గ్రేడ్స్ సాధించే అవకాశం ఉంటుంది. అంటే, ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలలే నాణ్యమైనవని ప్రభుత్వమే అధికారికంగా చెప్పినట్టవుతుంది. అంటే మరో రకంగా ప్రభుత్వ పాఠశాలల ప్రవేశాలకు ప్రభుత్వమే అడ్డుకట్ట వేస్తుందన్న మాట.
ఒక టీచర్‌కు పీజీ, పీహెచ్డీ విద్యార్హత ఉంటే ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ఉపయోగించుకోవాలని ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ దార్శనిక పత్రంలో ప్రభుత్వం పేర్కొన్నది. ఇది చూడటానికి బాగానే ఉన్నా.. ఇంటర్, డిగ్రీ కాలేజీలలో బోధన సిబ్బంది నియామకం బాధ్యత నుంచి తప్పించుకోవాలనే ప్రభుత్వ కుటిల బుద్ధి కూడా అవగతమవుతున్నది. దీంతో నిరుద్యోగుల ఆశల మీద ప్రభుత్వం నీళ్లు చల్లకనే చల్లినట్టు అర్థమవుతున్నది. అంతేకాదు, ఇప్పటికే ఇంటర్, డిగ్రీ కాలేజీలలో కాంట్రాక్ట్ మీద పని చేస్తున్నవారు తిరిగి నిరుద్యోగులుగా మారే ప్రమాదం కూడా పొంచి ఉన్నది. ఇంటర్ అధ్యాపకులు తమ విద్య, బోధనా పద్ధతులు పాఠశాల విద్యతో విలీనమై భవిష్యత్తులో తమ ఉద్యోగ, హోదా, బాధ్యతలపై మరింత ప్రభావం పడుతుందని ఆందోళనపడుతున్నారు. ఈ ప్రభావం తరగతి గదిపై తప్పకుండా పడుతుంది.
ఉపాధ్యాయుల నియామకం, బదిలీల గురించి తెలంగాణ రైజింగ్ విజన్-2047 దార్శనిక పత్రంలో పేర్కొన అంశాలను పరికించి చూస్తే ఇప్పటివరకు ఉన్న నియామకం, బదిలీ విధానాల్లో ప్రభుత్వం మార్పులు తీసుకువస్తున్నదనే విషయం అర్థమవుతున్నది. అంటే జిల్లా, మండల స్థాయుల్లో టీచర్ల మిగులు, లోటుపై ప్రభుత్వం ఏటా సమీక్ష నిర్వహిస్తుందన్న మాట. ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా వారిని ఎక్కడ అవసరమైతే అక్కడికి టెక్నాలజీ ఆధారంగా, ఆటోమెటిక్‌గా బదిలీచేస్తారు. దీంతో ఉపాధ్యాయులు ఎప్పుడు, ఎక్కడికి బదిలీ అవుతారో తెలియని పరిస్థితి. వాళ్లు మానసికంగా ఆందోళనకు గురవుతారు. దానికారణంగా బోధనపై సరైన దృష్టి పెట్టలేరు. అంతిమంగా నష్టపోయేది విద్యార్థులే అన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలి.
ఒకే పాఠశాల ప్రాంగణం, ఒకే ప్రదేశంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మూడు వేర్వేరుగా ఉంటే వాటిని ఒకటిగా చేయాలనే ఆలోచన ప్రభుత్వానిది. అందులో భాగంగానే ప్రీ ప్రైమరీ నుంచి 10 తరగతి వరకు ఉండే బడులను హైస్కూల్‌గా మార్చి ఒకే ప్రధానోపాధ్యాయుడి ఆధ్వర్యంలో పనిచేసే విధంగా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రంలో పేర్కొన్నది. దీంతో తమ ఇంటికి పాఠశాల దూరమైతే విద్యార్థులు బడులకు వెళ్లడానికి ఆసక్తి చూపకపోవచ్చు. తద్వారా గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో డ్రాపౌట్ల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నది.
విద్యారంగంలో సంస్కరణల కోసం తెలంగాణ రైజింగ్ విజన్-2047 దార్శనిక పత్రంలో పేర్కొన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రైవేట్ విద్యను బలోపేతం చేసేవిధంగానే ప్రభుత్వ విధానాలున్నాయనే విషయం అర్థమవుతున్నది. కాబట్టి, ప్రభు త్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్టంలోని విద్యావేత్తలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
(వ్యాసకర్త: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్)
-పల్లె నాగరాజు
85004 31793