భారతీయ ఝూటా పార్టీ .. అన్నట్టుగానే దాని నాయకులు మునుగోడు సభలో అన్నీ అబద్ధాలే చెప్పారు. అమిత్ షా, మోదీలు వరుసగా తెలంగాణలో సభలు పెడుతున్నరు. చెప్పింది చెప్పి పోతున్నరు. కానీ, తెలంగాణ అడుగుతున్న ఏ ప్రశ్నకూ వారి నుంచి జవాబు రాలేదు. కనీసం చెప్పే ప్రయత్నమూ చేయలేదు. కృష్ణా జలాల్లో తమ వాటా తేల్చాలని ప్రజలడిగిన ప్రశ్నకు జవాబు లేదు.
మోటర్లకు మీటర్లు పెట్టొద్దు మహాప్రభో అంటున్నా.. దానికీ స్పందన లేదు. తెలంగాణపై కరెంటు కుట్రలు ఎందుకు చేస్తున్నరంటే చెప్పలేదు. అంతా ఏదో మాయ చేసి తెలంగాణ ప్రజలను నిలువునా ముంచాలన్న ఆలోచనే. మునుగోడు సభలో అమిత్‌షా మాటలే నిదర్శనం. రైతులకు బీజేపీ ప్రభుత్వం బీమా ఇస్తున్నదనీ, కేసీఆర్ ఇవ్వడం లేదని సెలవిచ్చారు. లక్షలమంది రైతుల ఇంటి పెద్దదిక్కుగా కేసీఆర్ వారికి చేస్తున్న సేవ గురించి తెలంగాణ సమాజానికి తెలియదా? తాము అధికారంలోకి వస్తే వడ్లు కొంటామని అన్నరు. అంటే అధికారం కోసమే ఇన్నాళ్లూ ధాన్యం కొనకుండా ఆపారా? వారి కుట్రను వారే జనం ముందు ఒప్పుకొన్నరు. అంతేకాదు డబుల్ బెడ్రూం ఇండ్లు తామే ఇస్తున్నామని షా సెలవిచ్చారు. అదే నిజమైతే, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ‘డబుల్’ ఇండ్లు ఎందుకివ్వడం లేదు? దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే ఎందుకిస్తున్నరంటే ఇక్కడ పాలిస్తున్నది ఉద్యమ పార్టీ. ఉద్యమ నాయకుడు.
దళితులకు కేసీఆర్ దళితబంధు ఇస్తున్నాడా? అని ప్రశ్నించారు అమిత్ షా. తెలంగాణను పాలిస్తున్నది మీలాగా ఝూటా పార్టీ కాదు. ఉద్యమ పార్టీ. ఇప్పటికే దళితబంధు కింద వేల కుటుంబాలకు ప్రయోజనం అందింది. రాబోయే కాలంలో రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు దళితబంధు అంది తీరుతుంది. విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న మోదీ మాట తప్పారు. మాట చెప్పి తప్పించుకోవడం బీజేపీ నాయకులకు తెలిసిన విద్య. కానీ ఉద్యమ నేతకు ప్రజాసంక్షేమం ముఖ్యం. అందుకే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడాలేని పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి.
అమిత్‌షా మునుగోడు సభలో మైకు ముందుకు వచ్చిన వెంటనే పలికిన తొలి పలుకు ప్రభుత్వాన్ని పడగొడ్తం అని. వరుసగా 8 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను పడగొట్టారు. పడగొట్టే వారికి నిర్మించడం తెలియదు. కేసీఆర్ కష్టపడి నిర్మిస్తున్న బంగారు తెలంగాణను భగ్నం చేసేందుకు కంకణం కట్టుకున్నామని చెప్పకనే చెప్పారు షా. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా కేసీఆర్ సర్కారును పడగొట్టడానికేనని సెలవిచ్చారు. ఆయన ఎందుకు రాజీనామా చేసిండో మునుగోడు ప్రజలు చాలా క్లియర్‌గా చెప్పారు. కేంద్రం నుంచి సాయం పెంచాలని అమిత్‌షాను కలిసిన రైతులు కోరారు. దానికీ సమాధానం చెప్పకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఉచిత సలహా ఇచ్చినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. అంటే ఎంతసేపూ వారి మనస్సులో అంతర్గత ఎజెండాను ఎట్లా అమలు చేయాలా అనే ఆలోచనే తప్ప, ప్రజా సంక్షేమం వారికి పట్టదనే మరోసారి తేలిపోయింది.
నాటి ఉమ్మడిరాష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబు రైతుల ఉసురు పోసుకునేందుకు మోటర్లకు మీటర్లు పెట్టేందుకు సిద్ధమైతే ప్రజలు చరిత్రాత్మక ఉద్యమం చేశారు. స్వయనా రైతు, ఉద్యమ నేత అయిన కేసీఆర్‌కు రైతులకు ఏం చేస్తే మేలు జరుగుతుందో తెలుసు. ఆయన మనస్సును తెలంగాణ సమాజం ఎప్పుడో గుర్తించింది. దాన్ని గుర్తించలేని బీజేపీ నాయకులే నోటికొచ్చినట్టు, మాట్లాడిన మాటలే మాట్లాడి, రొడ్డ కొట్టుడు ప్రసంగాలిచ్చి పోతున్నరు. అయినా తెలంగాణ ఉద్యమం ఎవరు చేశారో కూడా తెలియని బీజేపీ నాయకుల చరిత్ర ఈ గడ్డకు బాగా తెలుసు.
భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనే బీజేపీ నాయకుల తాపత్రయం. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామని షా అంటున్నరు. వాస్తవానికి గోల్కొండ కోటలో కేసీఆర్ జాతీయ జెండా ఎగరేయడమే అన్నిరకాల పెత్తందారీతనాలకు, కుట్రలకు చరమగీతం పాడినట్టు. కానీ వీళ్లు కొత్తగా మళ్లా ఏదో చేస్తామని అంటున్నరు. వాట్సప్ వర్సిటీ ద్వారా తప్పుడు సమాచారం జనాల్లోకి చేరవేయడం. వారిపై థాట్ పోలీసింగ్‌కు పాల్పడటం బీజేపీకి అలవాటే. ఇది తెలంగాణను అస్థిర పరిచేకుట్ర తప్ప మరోటి కాదు. ఇది తెలంగాణ. గంగాజమునా తెహజీబ్ ఇక్కడి సంస్కృతి. దీన్ని ఎవరూ చెడగొట్టలేరు. ఇది వేల ఏండ్ల సర్వజన సమానత్వ, సమభావన చరిత్ర కలిగిన నేల. ఎందరు మోదీలు వచ్చినా, ఎంతమంది షాలు వచ్చినా తెలంగాణ ప్రజలను మోసం చేయలేరు. ఇది చరిత్ర చెప్తున్న వాస్తవం.
ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలి.. ఇక్కడ మన ప్రభు త్వం ఏర్పాటు చేయాలి.. ఇదే బీజేపీ ఆలోచన. నోరు తెరిస్తే అవినీతి, అక్రమం, ఇదేం పాలన?, వీళ్లు వాళ్లు దోస్తులు.. ఇట్లాంటి రొటీన్ మాటలే తప్ప పదజాలం కూడా మారడం లేదు. అంతెందుకు సభ పెట్టిన మునుగోడులో ప్రజలకు ఏంకావాలో రాజగోపాల్‌రెడ్డి అడగలే దు. ఏమిస్తమో అమిత్ షా చెప్పలేదు. కష్టపడి కట్టుకున్న ఇంటిని కల్లు తాగివచ్చినోడు కూలగొట్టిండట. కేసీఆర్ బంగారు తెలంగాణను ఓ యజ్ఞంలా నిర్మిస్తున్నారు. ఎవరో వచ్చి దాన్ని భగ్నం చేస్తామంటే, ప్రజల కలలను దూరం చేస్తామంటే.. తెలంగాణ చూస్తూ ఊరుకోదు. ‘నేను చెప్తున్న రాగం ఏంటి..? నువ్వు పాడుతున్న పాట ఏంటి..?’ అని ఏదో సిన్మాలో చెప్పిన్నట్టు.. ప్రజలు కోరుతున్నదేమిటి? బీజేపీ నాయకులు చేస్తున్నదేమిటి..?
చంటి క్రాంతి కిరణ్
ఎమ్మెల్యే, అందోల్