ఎలివాడల ఎతలు వడ్తూ, వరి శేన్లల్ల పరిగేరుతూ పబ్బం గడుపుకొంటున్న కుటుంబం మాది. అంటే అర్థమయ్యే ఉంటుంది, నేను మాదిగ వర్గానికి చెందిన బిడ్డను అని. మక్క గట్క, నూకల బువ్వ, నీళ్ల చారే రోజు మా కడుపు నింపేటియి. ఎన్నడన్న ఓ రోజు అన్నంఅండుతే ఆ రోజు మా ఇంట్ల, సారీ మా గుడిసెల పెద్ద పండుగే. ఓ రోజు శుక్లారం నాత్రిపూట అదే గుడిసెల ఓ మూలగ్గూసొని వయిలు సదువుకుంటున్న. అరేయ్ ‘బాపుగా నాన్న కారటేసిండు రారా, ఆ ముచ్చటేందో సదివినిపిస్తువు’ అని పిలుస్తనే ఉన్నది అవ్వ కందుకూరి తారమ్మ.
1992ల అనుకుంటా.. నేను మా కన్నారం జిల్లా మానకొండూర్లోని పెద్ద బళ్లె ఆరో తరగతి సదువుతున్న. నాయినమ్మ నర్సమ్మ ‘అద్దురా కొడుకా, ఏ దేశం బోవుడొద్దు.. నువ్విక్కన్నే ఉండు. నాకు శేతనైనకాడికి నేన్జేసి వెడ్తా’ అని ఏడుస్తనే ఉన్నది. దాని రాగానికి మా రాగం గూడ (అవ్వ, ఇద్దరు అక్కాచెల్లెండ్లు, మేం ఇద్దరం అన్నదమ్ములం) తోడైంది. మా ఇంటిల్లిపాది ఏడ్పు బైటికినిపిస్తున్నది. నాడు మా కన్నీళ్ల మజ్జన నాన్న కందుకూరి భీమయ్య సౌదీకి వోయిండు.
సౌదీ వోయినప్పటి నుంచి నాన్న నెలకోసారి మాకు కారటేసేటోడు. ఆ కారట సదివి మేం తిరిగి నాన్నకు కారటేసేటోళ్లం. కారట రాంగనే ఎప్పట్లెక్కనే అవ్వకు పానమాగుతలేదు. ‘ఎట్లున్నడో ఏమో.. నా పెనిమిటి’ అని రందివడ్తనే ఉన్నది. నేను వొయ్యి అవ్వ చేతిలకెల్లి కారట దీసుకొని సదువుడు షురూ జేసిన. ‘తారవ్వా… నీ పెనిమిటి భీమయ్యను మాట్లాడుతున్న. నేనిక్కడ మంచిగనే ఉన్న, మీరక్కడ ఎట్లున్నరో ఈ కారట ముట్టినంక జెప్తూ బాపుగాన్ని మళ్లో కారటెయ్యిమను. ఇప్పటికైతే మూణ్నెల్ల జీతం ఓ 10 వేలు పంపు తున్న. లూటీమాఫ్ కర్సు వెట్టకు. పోరగాండ్లను మంచిగ సద్విపియి, మనమెట్లాగూ కొత్త బట్టలు తొడుక్కోలె, ఆల్లు ఈల్లు ఇచ్చిన పాత బట్టలే మనకు పండుగ బట్టలైనయి. మన లెక్కనే మన పోరగాండ్లు గూడ బతుకాల్నా? అట్లస్సల్కే బతుకొద్దు. ఈ సద్దుల బతుకమ్మకు మన పోరగాండ్లకు సక్కదనాల బట్టలు వట్టియ్యి. అరేయ్ బాపు నువ్వు సర్కారు కొల్వు జెయ్యాల్రా’ అని నా కోసం సెపరేట్గా రెండు లైన్లు ఎక్కువనే రాపిచ్చిండు నాన్న.
నాన్న నాడు రాసిన కారట నన్ను సర్కారు నౌకరి దిక్కు నడిపిచ్చింది. అందుకే మెకానికల్ ఇంజినీరింగ్ దాన్క సదువుకున్న. మెకానికల్ ఇంజినీరింగ్ అయిపోంగనే ఓ ప్రైవేట్ కంపెనీల కొల్వు జేస్తూనే సర్కారు నౌఖరి కోసం సిద్ధమైన. 2012 నాటి ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా వీఆర్ఏ నౌఖర్ల కోసం నోటిఫికేషన్ ఏస్తే అన్ల వీఆర్ఏ నౌఖరి గొట్టిన. నాడే నెలకు 16 వేల జీతం వచ్చే ప్రైవేటు కొల్వుకు రాజీనామా జేసి నాన్న కల నెరవేర్చాలనే కసితో వీఆర్ఏ కొల్వుల జాయిన్ అయిన. ఫస్టు నెల జీతం రూ.3 వేలు. మొదుగాళ్ల ఏం అనిపియ్యలే గని, ఓ ఏడాది కొల్వు జేసినంక నాడు కూడవెట్టుకున్న పైసలన్నీ కాలం కరిగిపోయినట్టే కరిగిపోయినయి. అప్పటికే నాకు పెండ్లయి ముగ్గురు పోరగాండ్లు గూడ అయిర్రు.
ఇరువై ఆరేండ్లు సౌదీల కొల్వు జేసిన నాన్న అరిగోస వడ్డడట. తిండిలేక తిప్పల వడ్డడట. నిద్ర వోగొట్టుకొని నైట్ డ్యూటీలు జేసిండట.. ‘నా కొడుక్కేంది సర్కారు నౌకరి. నన్ను బంగారం లెక్క సూసుకుంటడు’ని మరీ చెప్పొచ్చిండట సౌదీల. ఇమానం దిగనే లేదు, నన్ను అల్ముకున్న నాన్న ‘నాకిగ శాతనైత లేదు బిడ్డా’ అని గట్టిగ ఏడ్వవట్టిండు. ‘నీకెందుకు నాన్న నేను లేనా’ అని ధైర్నం జెప్పి ఇంటికి దోల్కచ్చిన. పేరుకే వీఆర్ఏ కొల్వు, దాన్ల కొత్త మిగులదని రాన్రాను నాన్నకు గూడ అర్థమైంది. రూ.3 వేలున్న నా జీతం రెండేండ్లయినంక ఆరు వేలయింది. అయినా, మా జీవితంల మాత్రం మార్పు రాలె. ఈ నౌకరిని నమ్ముకుంటే నా కుటుంబం రోడ్డుమీద వడే పరిస్థితి అస్తదని నాకర్థమైంది. అందుకే నాన్న రెక్కల కట్టంతోని సంపాయించిన ఎకురం భూమిల లిల్లీపూల పంట వండిచ్చిన. ఆ లిల్లీ పూల పంటను నాన్న, అవ్వ, నా పెండ్లాం జూసుకునేటోళ్లు. నేను నా వీఆర్ఏ కొల్వు జూసుకునేటోన్ని. వీఆర్ఏ నౌకరి పర్మినెంటయితే మావోని జీవితం సక్కగైదనే ఆశ బగ్గుండే మా నాన్నకు. అదే రంది మస్తు వెట్టుకున్నడు. 2022, జూన్ 15న గుండెపోటొచ్చి జీవిడిసిండు. నాన్న జరిగిపోయి గూడ ఏడాది దాటింది. మా బతుకులు గింతే, ఇగ మారయని మైండ్ల ఫిక్సయిన.
‘హల్లో.. కందుకూరి బాపుదేవ్, సన్నాఫ్ భీమయ్యనా?’ అని మొన్ననే కలెక్టరేట్ నుంచి ఫోన్జేసి అడిగిర్రు. ‘అవును’ అన్జెప్పిన. ‘సర్టిఫికెట్ వెరిఫికేషన్’ ఉంది రమ్మని విల్శిర్రు. కేసీఆర్ ఇట్లా వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తున్నమని చెప్పిండో లేదో, తెల్లారి నుంచి ఆ పని పట్టాలెక్కింది. ఇప్పుడు నేను ప్రభుత్వ ఉద్యోగినని సగర్వంగా ఫీలయితున్న.
‘నాన్నా… నా నౌకరి పర్మినెంటయిందే’ అని మన్సుల నాన్నను తల్సుకుంట ఉంటనే ఉన్న. ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను రద్దుజేసింది. మామూలుగైతే ఏ ప్రభుత్వ వ్యవస్థను రద్దుజేసినా అన్లున్న ఉద్యోగులు ఆగమైపోతరు, రోడ్డు మీద వడ్తరు. కనీ మమ్మల్ని కంటికి రెప్పలా సూసుకున్నడు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్. ఒక్క నన్నే గాదు, నా అసొంటి 20, 555 మంది వీఆర్ఏలను క్రమబద్ధీకరించి ప్రభుత్వ వ్యవస్థల కలుపుకొన్నడు.
నాయినమ్మ నర్సవ్వకు తొంబైకి పైనే ఉంటది వయస్సు. నౌకరి పర్మినెంట్ అయిన విషయాన్ని దానికి జెప్పి, మన కేసీఆరే ఈ పన్జేసిండని జెప్పిన. మస్తు ఖుషీ అయింది. మీ ‘నాన్న భీమయ్య ఉంటే ఎంత సంబురపడునోరా’ అని మస్తు బాధవడ్డది. ‘ఇగ్గొ గీ కేసీఆర్ పైసల్ దీస్కొని పోరగాండ్లకేమన్న కొనుక్కరాపోరా’ అని తన పింఛిన్ పైసల్ చేతిల వెట్టింది. ‘నాన్న లేకుంటేందే? ఆయన ఆశీస్సులు కేసీఆర్ రూపంలో మనకెప్పుడూ ఉంటయి’ అని నీళ్లు కారుతున్న నాయినమ్మ కండ్లను తుడ్శిన.
గడ్డం సతీష్
99590 59041