తన నిరంకుశ పోకడలు, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు ఆ ఊబి నుంచి బయటపడలేక తంటాలు పడుతున్నాడు. ఉక్రెయిన్ను యుద్ధంలో గెలువలేక పోగా, ఆక్రమిత ప్రాంతాన్ని కొంత ఇటీవల కోల్పోవలసి వచ్చింది. సైనికులలో నైతిక ైస్థెర్యం కొరవడింది. దేశాన్ని కాపాడుకోవడానికి ఎవరైనా సిద్ధపడతారు. కానీ పరాయి దేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రాణాలను పణంగా పెట్టడానికి సైనికులకు కూడా మనసొప్పడం లేదు. శత్రువుల వైపు ఫిరాయించిన వారికి లేదా పరారైన వారికి శిక్షలు కఠినం చేస్తూ చట్టసభ (డ్యూమా) శాసనం చేసింది. దీన్నిబట్టి సైన్యం అదుపు తప్పుతున్నదని తెలిసిపోతున్నది. ఇప్పుడున్న సైన్యం కూడా సరిపోవడం లేదు. కొత్తగా మూడు లక్షల మంది పౌరులను సైన్యంలో చేర్చుకోవాలంటూ జారీ చేసిన ఫర్మానా పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. సైనిక సమీకరణ భయాలు, అణచివేత మూలంగా లక్షలాది మంది పొరుగు దేశాలకు వలస పోతున్నారు.
చర్చలతో కాకుండా యుద్ధం ద్వారా పరిష్కారాలు కోరుకోవడం వినాశకరమనడానికి రష్యా దాడి తాజా ఉదాహరణ. ఉక్రెయిన్ రాజధానిని అలవోకగా ఆక్రమిస్తామని, అక్కడ తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠిస్తామని పుతిన్ వేసిన అంచనా తలకిందులైంది. స్వాతంత్య్ర కాంక్ష బలంగా ఉన్న ఉక్రెయిన్ పౌరులు రష్యా సైనిక దాడిని బలంగా ప్రతిఘటించారు. నాటో దేశాల ఆయుధ సహాయం ఉక్రెయిన్‌కు కలసివచ్చింది. మరోవైపు రష్యాలో పుతిన్ ప్రతిష్ఠ అడుగంటింది. పలు నగరాలలో యుద్ధానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు సాగుతున్నాయి. ప్రతిపక్షాలను పుతిన్ తీవ్రంగా అణచివేసిన నేపథ్యంలో, ప్రజలు ఎవరి ప్రోద్బలం లేకుండానే నిరసనలకు దిగుతున్నారు.
రష్యా వైఫల్యాల నుంచి నాటో దేశాలు నేర్చుకోవలసింది కూడా ఎంతో ఉన్నది. వాస్తవంగా, రష్యా దాడికి నాటో విస్తరణ విధానాలు కూడా కారణమే. ఈ విస్తరణ కాంక్షల వల్లనే రెండు ప్రపంచయుద్ధాలు జరిగాయి. అనేక ఘర్షణలలో మానవాళి ఎంతో క్షోభించింది. అందుకే ఫిన్లాండ్, స్వీడన్ వంటి దేశాలు ఇటీవలివరకు నాటోలో చేరడానికి విముఖంగా ఉన్నాయి. ఫిన్లాండ్ ప్రజలు ఉక్రెయిన్‌పై దాడిని నిరసిస్తూ ప్రదర్శనలు జరిపినప్పుడు, కొందరు ‘ఉక్రెయిన్‌పై దాడి వద్దు, నాటోలో చేరిక వద్దు’ అంటూ నినదించారు. దురాక్రమణల కాలం ఇప్పుడు లేదు. ఇరువై ఏండ్ల యుద్ధం తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోక తప్పలేదు. ఇప్పటికైనా అంతర్జాతీయ న్యాయసూత్రాలను గౌరవిస్తూ శాంతియుత పద్ధతులలోనే విభేదాలను పరిష్కరించుకోవాలి.