‘దామగుండం’ అంటే మాకో భావోద్వేగం! ఒక్క మాటలో వర్ణించలేని ప్రకృతి సృష్టించిన అద్భుతమది. గలగలపారే సెలయేర్లు.. పక్షుల కిలకిలరావాలు.. పచ్చని చెట్లు.. ఇలా ఒక్కటేమిటి దామగుండమంటే ప్రకృతి రమణీయత. ఓ వైపు ప్రకృతి నిలయం దామగుండం.. మరోవైపు అధ్యాత్మిక కేంద్రం రామలింగేశ్వరుడి క్షేత్రం.. మా జీవితాలతో విడదీయరాని అనుబంధంగా అల్లుకుపోయాయి.
నా చిన్నతనంలో అమ్మమ్మ వాళ్ల ఊరు బాకాపురం వెళ్తే కుటుంబమంతా కలిసి దామగుండానికి వెళ్లేవాళ్లం. ఆ ప్రకృతి అందాలను చూసి పరవశించిపోయేవాళ్లం. దామగుండం వెళ్తే సర్వరోగాలు నయమవుతాయని మా అమ్మమ్మ అంతమ్మ చెప్పేది. ఏటా రామలింగేశ్వరుడి జాతర కన్నుల పండువగా జరిగేది. అక్కడి ప్రజలు దామగుండం, రామలింగేశ్వరుడి దర్శనం తర్వాతే ఏ కార్యక్రమమైనా ముందటేసుకుంటారు. దామగుండంలో వీచే గాలుల మాదిరిగానే అక్కడి ప్రజల మనసులూ స్వచ్ఛమైనవే. దామగుండం ముచ్చట్లు చెప్పుకుంటూపోతే ఇప్పట్లో ఒడువదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరాక జరుగుతున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో దామగుండం కనుమరుగవుతుందేమోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర సర్కార్ ప్రకటించినప్పటి నుంచి జరగనున్న విధ్వంసం తలచుకుంటేనే భవిష్యత్తులో జరిగే దుష్పరిణామాలు కండ్లముందు కనిపిస్తున్నా యి. నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు వెనుక దేశ ప్రయోజనాలే ఉండొచ్చు. కానీ, మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతున్న ఈ రోజుల్లో ప్రకృతి ప్రసాదించిన దామగుండం అటవీ క్షేత్రాన్ని దహించివేయడం ఎందుకు?
నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు దామగుండం లాంటి ప్రాంతం ఏ మాత్రం సరికాదు. ఈ కేంద్రం ఏర్పాటుతో ఇక్కడి ప్రకృతి విధ్వంసమవుతుంది. రాడార్ కేంద్రం ఏర్పాటుతో సానిక ప్రజలు రేడియేషన్ ప్రభావానికి గుర వుతారు. ఈ విషయాన్ని ప్రభుత్వాలు కొట్టిపారేస్తున్నప్పటికీ ఇది ముమ్మాటికీ నిజం.
రాడార్ కేంద్రం వల్ల ఒక్క దామగుండమే కాదు, పక్కన ఉన్న అనంతగిరి అడవులు కూడా విధ్వంసం అవుతాయి. ఎన్నో అరుదైన జంతుజాతులు అంతరించిపోతాయి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటూ అంతర్జాతీయ స్థాయిలో తీర్మానాలు చేస్తున్న ఈ రోజుల్లో.. జీవవైవిధ్యానికి కేరాఫ్‌గా ఉన్న దామగుండాన్ని ఇలాంటి రాడార్ కేంద్రాలకు కేటాయించటం ప్రకృతి పట్ల పాలకుల అవగా హనారాహిత్యాన్ని తెలియజేస్తున్నది. రాడార్ కేంద్రం ఏర్పాటుతో దామగుండం ఆంక్షల వలయంలోకి వెళ్తే మా ప్రాంత ప్రజ లు కొలిచే రామలింగేశ్వరుడి దర్శనం దొరుకుతుందా? అన్న భయం నన్ను వెంటాడుతున్నది.
2009లోనే రాడార్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాడార్ అంశం తెరపైకి రాలేదు. కేంద్ర ప్రయత్నాలను నాటి కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకోవడమే దానికి ప్రధాన కారణం. మార్పు పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాడార్ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక దస్ర్తాల దుమ్ము దులిపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2024 జనవరి 24న సీఎం రేవంత్‌రెడ్డితో నేవీ అధికారులు భేటీ అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశా రు. దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల అటవీ భూమిని అధికారికంగా నేవీకి అప్పగించారు. నేవీ అధికారులతో భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే రాడార్ కేంద్ర ప్రాజెక్టుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఓ వైపు చేసేది చేస్తూనే మరోవైపు తమకేం తెలియదని గత ప్రభుత్వం పై నిందలు మోపు తూ కాంగ్రెస్ పాలకులు చేతులు దులుపుకుంటున్నారు.
పర్యావరణ విధ్వంసంలో తెలంగాణ ప్రభుత్వం భాగం కాకూడదంటే తక్షణమే ప్రాజెక్టుపై పునరాలోచన చేయాలి. భూముల బదలాయింపు ఒప్పందాలను రద్దుచేసుకోవాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కూడా పోరాడేందుకు వెనుకాడకూడదు. ‘లేదు, మేం ఇలాగే రాజకీయాలు చేస్తూ కాలం వెళ్లదీస్తామ’ని చూస్తే ఈ ప్రాంత బిడ్డలు చూస్తూ ఊరుకోరు. మరో పోరాటానికి సిద్ధమవుతారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చాటిన చైతన్యాన్ని, పోరాట స్ఫూర్తిని మరోసా రి గట్టిగా చాటిచెప్తాం. ‘సేవ్ దామగుండం’ అనే ఏకైక నినాదంతో జరుగుతున్న ఉద్యమా న్ని మరింత ముందుకు తీసుకువెళ్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి మా భావోద్వేగాలతో ముడిపడి ఉన్న దామగుండాన్ని రామలింగేశ్వరుడి సాక్షిగా రక్షించుకుంటాం.