ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాంగ రక్షణ, సామాజిక న్యాయం, కులగణన అంశాలే కాంగ్రెస్కు ఊపిరిపోశాయి. అయితే సామాజిక న్యాయం అం టూ జాతీయ కాంగ్రెస్ నినదిస్తుంటే.. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకత్వం మాత్రం భిన్న వైఖరిని అవలంబిస్తున్నది. సామాజిక తెలంగాణ, ప్రజా పాలన పేరిట గద్దెనెక్కిన కాంగ్రెస్ ఆ నినాదాలకు తిలోదకాలిచ్చింది. ముఖ్యమంత్రి తమ సామాజికవర్గానికి చెం దినవారికి ఎక్కువ పదవులు కట్టబెట్టడమే సామాజిక న్యాయం అనేటట్టుగా వ్యవహరిస్తున్నారు.
గెలుపు గుర్రాల పేరిట అసెంబ్లీ ఎన్నికల్లో అగ్రకులాలకే పట్టం గట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లోనూ అదే ధోరణిని కొనసాగించింది. సామాజిక న్యాయాన్ని పూర్తిగా విస్మరించి బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగానే చూడటం శోచనీయం. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇప్పటివరకు కులగణన వైపుగా ఒక్క అడుగు కూడా వేయలేదు. అత్యంత వెనుకబడిన కులాలకు మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఇస్తామన్న రూ.10 లక్షల రుణాలపై కార్యాచరణ రూపొందిం చలేదు. స్థానిక సంస్థలతో పాటు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలుకాలేదు. వీటన్నింటిని అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నది. ఈ మోసాన్ని ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలి. బీసీలు తమ వాటా కోసం పోరు జెండా ఎత్తాలె. లేకపోతే ఆత్మవంచనకు గురవడం ఖాయం.
– బారి అశోక్ యాదవ్
95810 72140