ఆకలి, అవమానాలను
అనునిత్యం అనుభవిస్తూ
అన్యాయమని అరవలేక నలుగుతున్న
అణగారిన వర్గాలకు అభ్యుదయ పతాకం
ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకం
దొరా.. నీ బాంచెన్ కాల్మొక్కుతా అన్న
మట్టి చేతులే మహా పిడికిళ్ళై మర ఫిరంగులై
పనిముట్లే విముక్తి ఆయుధాలై
భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తికై
సాగిన సమరభేరికి సైరనతడు
ఉర్దూ సాహిత్య సేద్యంలో
పండిన కావ్యలెన్నో, గజళ్ళెన్నో
పరిమళించిన కుసుమాలెన్నో
ప్రేమను, విప్లవ ప్రేరణను
ఏపుగా పండించగల సవ్యసాచి
బెర్నార్డ్ షా నాటకాన్ని ప్రదర్శించి
రవీంద్రుడినే మెప్పించిన కవీంద్రుడతడు
సిటీ కళాశాల గురువై
చైతన్య కెరటమై
ఉద్యమ భాస్కరుడై
ఉద్యమాల ఉగ్గు పాలు తాగి
అగ్గి వోలే తాను మండి
అభ్యుదయం వైపు అడుగులేసిండు
భాగ్యనగరం ప్రగతిశీల ఉద్యమ నిర్మాతగా
కాలే కడుపుల కన్నీళ్ళను తుడిచే దిశగా
ఫాసిస్టు పాలనకు ఎదురు నిలిచిన ఎర్రటి కొండ
కదలలేని మెదలలేని బందీఖాన
కమ్ముకున్న చిమ్మ చీకటిలో
కండ్ల నిండా బానిసత్వం
కానరాని స్వేచ్ఛాతత్వం
బెదురు లేక ఎదురు నిలిచి
రాజులపై ధిక్కార రాగమెత్తి
ప్రజాహితముకై ప్రగతి నిర్మాణానికై
ఎన్నికల్లో నిలిచి స్ఫూర్తి కేతనమై ఎగిరిండు
సత్యశోధకుడై సమసమాజ స్థాపనకై
నిత్యం పాటుపడుతూ
ప్రగతి శీల దారుల్లో నడయాడిన
నవయుగ అభ్యదయ కవి చక్రవర్తికి
అక్షర సలాం
-చిక్కొండ్ర రవి
95023 78992