మనుషులే కాదు,
పుస్తకాలూ మాట్లాడుతయి..
ఒక గురువులా, ఒక మిత్రునిలా..
జన్మనిచ్చిన అమ్మలా..
వేలు పట్టి నడిపించే నాన్నలా..
బంధం పెనవేసుకున్న ఓ ప్రేయసిలా..
పుస్తకాలూ మాట్లాడుతయి..
జీవితాన్ని పండించాలనుకునేవాడికి
పుస్తకం ఒక సుక్షేత్రమే..
ఓటమిని మండించాలనుకునేవాడికి
పుస్తకం అనుభవైకవేద్య కురుక్షేత్రమే..
పుస్తకం నిన్నామొన్నల
సమాహారమే కాదు,
అది భవిష్యత్ నిర్మాత కూడా..
అందులో పూలు వికసిస్తాయి
ఆశలు సీతాకోకలై విహరిస్తాయి..
దేదీప్యంగా వెలిగే చుక్కలు రెండు కన్నీటి బొట్లను చెమరుస్తాయి..
మోదాన్ని ఖేదాన్ని కూడా
ఆమోదంగా వర్షిస్తాయి..
తెరిచిన ప్రతిసారి
కొత్త కొత్త లోకాల్ని చూపిస్తాయి…
మనిషికి కాలక్షేపమే కాదు,
మనసుకు మైమరుపు పుస్తకమే
నేను పుస్తకం చదువుతున్నంతసేపు
నా చేతులలో ఎవరివో కలలను మోస్తున్నట్టనిపిస్తుంది
ఏవో కలాలు నన్ను భుజం తట్టి
నడిపిస్తున్నట్టనిపిస్తుంది…
డాక్టర్ చింతల రాకేశ్ భవాని
92466 07551