దాస సాహిత్యం పరివ్యాప్తిలో రామదాసు కీర్తనలకు విశేష ప్రాచుర్యం ఉన్నది. అంతవరకు దాసభక్తి భావసామ్యంగానే ద్యోతకమైనది. రామదాసు కీర్తనల ప్రభావ ఫలితంగా సాహిత్య సంప్రదాయంగా రూపుదిద్దుకున్నది. దాసతత్వం అంటే శరణాగతి ధారుడై ఉండి భక్తి భావైక్య స్థితిని పొందడం. దాసతత్వ సాధనలో అత్యంత సులువైన భక్తి మార్గం ‘కీర్తనం’ దేశీ సంప్రదాయాలైన శతకం, వచనగేయం, తత్వగీతాల రీతులలో దాస తత్వరూపం కొంతవరకు ప్రతిఫలించింది. అయినా దేశీ వాద్య సమేతంగా గానం చేసే ‘కీర్తన’ లోనే ఆ స్థాయి ఉధృతరూపాన్ని దాలుస్తుంది. ఆత్మ బోధనాత్మక భక్తిభావ స్థితిలో తాదాత్మ్యం చెందడమే దాసతత్వం. లౌకిక భక్తి కీర్తనం చేత అలౌకిక ముముక్షత్వాన్ని సాధించడమే దాససాహిత్య ప్రధాన లక్షణం. దాసుడు అంటే శరణాగతుడు. భగవంతుడి భక్తుడు. ఒకవిధంగా అతన్ని భాగవతుడు అని అభివర్ణించవచ్చునేమో!?
భగవంతుని దరిచేరే గుణం భక్తి భావం, దాసం. భక్తుని ఆతత్ముక ప్రబోధ ‘కీర్తనం’. కంచర్ల గోపన్న శరణాగతుడు కావడం, రామదాసుగా మారడానికి ప్రధాన కారణం నాటి రాజకీయ, ఆర్థిక, మత, సామాజిక, సాంస్కృతిక స్థితిగతులనే చెప్పవచ్చు. తత్ఫలితంగా ఉద్భవించిన భక్తి ఉద్య మం రామదాసు కీర్తనలపై పూర్తి ప్రభావాన్ని చూపింది. నాటి రాజకీయ, మత సిద్ధాంతాలతో రూపుకట్టుకున్న నియమ, నిబంధనలు సమాజ వ్యవహార సాంస్కృతిక ఆధిపత్యాన్ని వహించాయి. జీవన భారాన్ని మోస్తున్న ఈతిబాధలు, రాజ్యాధికార అజమాయిషీ, అధికార జులుం నుంచి విముక్తి కోరుతూ అంతర్గత భక్తి భావ స్ఫురణ బయల్పడింది. రాజ్యాధికార ధిక్కార స్వరాన్ని పలికిస్తూనే, జరామరణ పీడనను తొలగించడం, మోక్షసాధనాన్ని ఉపదేశించడం వంటి మార్గాలను అనుసరించింది.
రామదాసు కాలం 17వ శతాబ్దపు మధ్యభాగం. భారతదేశం మొత్తంమీద ఉత్తరాది నుంచి దక్షిణా పథం వరకు సమాజ చింతనాత్మక కవులు విశేష భక్తిమార్గాలను అనుసరిస్తున్నారు. మొఘలాయిల పరిపాలన. ఔరంగజేబు ఏకచ్ఛత్రాధిపత్యంతో దేశం అట్టుడుకుతున్నది. ఉత్తర భారత ఖండంలో గురు గోవిందుసింగ్ లాంటి ప్రభువులు, దక్షిణ భారత ఖండంలో వీరశివాజీ, కుతుబ్ షాహీలు, మొఘలాయిల సామ్రాజ్యాధిపత్యాన్ని ఎదిరిస్తూనే ఉన్నారు. కఠోరమైన ఇస్లాం మత నిబంధనలను పాలనా ప్రదేశాల నుంచి సడలించడానికి హిందువులలో భిన్న భక్తి శాఖలు ప్రబలినాయి. భక్తులు, తాత్వికులు, సాధువులు, గురువులు, సంతులు తమ రచనల ద్వారా ప్రజలను జాగృతం చేస్తున్నారు. ఇటువంటి తాత్విక నేపథ్యాన్ని పురస్కరించుకొని కీర్తనామయం చేసి భజన కూటముల ద్వారా దాస సాహిత్యాన్ని పరివ్యాప్తం చేసిన వారిలో శ్రీరామదాసు ఒకరు.
నాడు దేశమంతటా దాససాహిత్యం విస్తృత రూపం దాల్చింది. వివిధ రాష్ట్రాలలో వివిధ సాం స్కృతిక భక్తి శాఖలుగా విభాజ్యం పొందింది. ఉత్తర భారతదేశంలో 15వ శతాబ్దంలో కబీరుదాసు తనమిత్ర బృందంతో కలిసి భక్తి ఉద్యమం నడిపాడు. అది సంస్కరణ దిశగా ప్రారంభమై సంస్కరణోద్యమంగా రూపుదిద్దుకుంది. భారతదేశంలో గల లక్షణయుతమైన సంప్రదాయిక భక్తితత్వంతో పాటుగా, సూఫీలోని నిర్గుణ ఈశ్వరోపాసన, ప్రణయతత్వం వంటివి ప్రాథమికాంశాలుగా ఎన్నుకొనబడి సంస్కరణోద్యమ భక్తి ఉద్యమం దిశగా పయనించింది. కానీ సూఫీ తత్వంలోని మార్మికతను అంతగా అనుసరించలేదు. సమాజానికి, ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండే లక్ష్యాలను నిర్దేశాలను స్వీకరించి భక్తి ఉద్యమ స్వరూపం మార్పు చేయబడింది. వ్యావసాయిక, గ్రామీణ సంస్కృతికి ఆలంబనగా గల వృత్తి కళానైపుణ్యాది కుటుంబ జీవన స్రవంతిలో భక్తి ఒక ధారగాఅనునయింప బడింది.
సూరదాసు, కబీరుదాసు, తులసీదాసు, మీరాబాయి వంటి దాసభక్తులు భారతీయ భక్తి భావముల తత్వాన్ని హిందీ భాషా సమాగమంతో వృద్ధిపరిచారు. సూరదాసు (1478-1584) జన్మతః అంధుడే అయినప్పటికీ ‘అష్టచాప్’ అంటే ఎనమండుగురు వల్లభాచార్యుల శిష్యులలో ఒకడిగా ఉన్నారు. లక్షాపదివేల పద్యాలను రచించాడు. తులసీదాసు ‘శ్రీరామచరిత మానస్’ ద్వారా ‘రామ’ శబ్దానికి పరిపూర్ణతను సిద్ధింప జేశాడు. మీరాబాయి 2400 భక్తిగీతాలు రచించారు. ఇది మధుర భక్తికి సూచికలుగా ఉన్నవి. ఇవి గుజరాతీ, రాజస్థానీ, వ్రజ, హిందీ భాషల్లో ఉన్నాయి.
దక్షిణాపథంలో భక్తి ఉద్యమ ప్రథమ భాగస్వామి మహారాష్ర్టం. ఈ దేశంలో తుకారాం (1608-1650) భక్త గురు అంశతో తన అభంగాల ద్వారా భాగవత పంథాను అనుసరించి సాంస్కృతిక స్థావరాన్ని బలోపేతం చేశాడు. శివాజీ గురువు సమర్థరామదాస స్వామి (1608-1681). మనోబోధ, దాసబోధ అనే రచనలు చేసి తన అభంగాలతో ప్రజలను సమాయత్తపరిచాడు. శివాజీకి రాజధర్మం బోధ పరుస్తూనే భక్తిభావ విరాజంపై మనసు మల్లించాడు. అదే సమయంలో మహారాష్ట్రలోనే అగ్నిదాసు వంటి ప్రజాకవి (1659) శివాజీ సాగించిన విజయయాత్రలోని వీరకృత్యాలను మరాఠీ దేశీ బాణీలైన పొవాడాలుగా పాడి నాటి ప్రజలలో వీరచైతన్యం ప్రభవింప జేశాడు. నాడు పొవాడాలతో పాటుగా లావణీలనే గాధా గేయాలు దేశీ వ్యవహారంలో విస్తృత ప్రచారంలో ఉన్నాయి. నాడి ఓడ్రదేశం(ఒరియా)లో భక్తికవి చైతన్యప్రభువు ప్రభావగుణ శోభితం పరిపూర్ణమైంది. ఇక భక్తావేశానికి కన్నడదేశం ప్రసిద్ధి.
పురందరదాసు, విజయదాసు, గోపాలదాసు, జగన్నాథదాసు, కనకదాసులతో దాసకూటమి ఏర్పడింది. కన్నడ దేశ స్థానంగా దాసకూటోద్యమం క్రమంగా దేశమంతటా ప్రబలింది. అదే సమయంలో భక్తి శబలతకు తమిళదేశం ప్రధానంగా నిలిచింది. శైవ, వైష్ణవ భక్తుల కవితలు, ఆళ్వారుల భక్తి ప్రపత్తులు గీత మాలికలుగా దేశీవాళిలో వ్యాప్తిపొందాయి.
దాస సాహిత్యం దేశీ సంప్రదాయ రీతులకు పట్టం గట్టింది. తెలుగు ప్రాంతంలో ఇది దేశీ ఛందంగా, జానపద స్రవంతిగా సమాంతర రూపు రేఖలను సంతరించుకున్నది. నాడు మార్గ కవితా పండితులు రాజాశ్రయాలను పొంది విశేష గౌరవాదరణలు పొందారు. దానికి సరిసమానమైన ప్రాధాన్యాన్ని జనబాహుళ్యం నుంచి పొందినవారు దేశీకవులు. సమూహ నేపథ్యంలో దాస సాహిత్యం భిన్న సామ్యాలను ఆవిష్కరించింది. దేశీకవులు పురవీధులల్లో, ఊరి రచ్చబండల మీద, మందిర ప్రాంగణాలలో ప్రజామోదం పొందిన కీర్తనలను పాడారు. తిరునాళ్ళల్లో, జాతరల్లో, సంతల్లో, జంగములు హరిదాసుల గాయక భిక్షుకుల నోళ్ళల్లో మెదిలి కళాభిమానుల హృదయాలలో చెరగని ముద్రవేశారు.
జనస్రవంతిలో భక్తిధారగా భాసిల్లిన దాస సాహిత్యం ఎక్కువ ప్రాచుర్యం పొందింది. నాడు ప్రతీ ఊళ్ళో భజనబృందమో, భజనకూటమో ఉండే వి. స్థానికంగా ప్రఖ్యాతిచెందిన దాస భక్తు ల కీర్తనలు ఈ భజన కూటములలో ప్రభంజనం పలికించేవి. వాద్య సహకారాలుగా చిరుతలు, కోలలు, తంబుర, గజ్జెలు, డక్కీ, బుంగలు కీర్తనలకు స్వరనాదాన్ని అందించేవి. ఇప్పటికీ వ్రతాలు, నోముల సందర్భాలలో భజన కూటములు చేసే కీర్తనలు, చిందు బాగోతాలు, ఒగ్గు కథలు, పంబ కథలు, కోలాటాలు, హరి కథలు, బుర్ర కథలు వంటి అనేక కళారూపాలు ప్రదర్శింపబడుతున్నాయి. దాససాహిత్యం కీర్తనలు, శతకాలు, పదములు, దరువులు, తత్వగీతాలలో; మేలుకొలుపులు, లాలిపాటలు, జోలపాటలలో; మంగళహారతులు, తిరునామాలు, హరినామాలు, రామనామాల్లో ఇలా విస్తృతమైన సాహి త్య సాంస్కృతిక శాఖల్లో విస్తరించి ఉన్నది.
తెలుగు ప్రాంతంలో రామనామ స్రవంతుల ద్వారా దాస భక్తిసామ్యాలను పండించింది శ్రీరామదాసే. తరువాతి దాసకవులకు మార్గదర్శకుడు. సమాదరణుడు కూడా.
-డాక్టర్ వంగరి త్రివేణి , 99514 44803