గత పాలకులు అనుసరించిన విధానాల వల్ల దేశ ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. రాజకీయ, ఆర్థిక దోపిడే దీనికి కారణం. రైతుల నుంచి చిన్నమొత్తాలను కూడా ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకులు, లక్షల కోట్లు తీసుకున్న కార్పొరేట్లను మాత్రం పట్టించుకోకపోవడం విడ్డూరం. వారి నుంచి అప్పును వసూలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇది కేంద్ర ప్రభుత్వాల అసమర్థతకు నిదర్శనం.
దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సామాజిక అసమానతలు తొలగిపోవాలి. గ్రామీణ నిరుద్యోగాన్ని అరికట్టాలి. దీనికోసం కుటీర పరిశ్రమలు, కులవృత్తులు, వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించాలి. గ్రామీణ నీటి వనరులను పరిరక్షించాలి. వృథాగా పోతున్న 70 శాతం నీటిని సద్వినియోగం చేసుకోవాలి. కాలానుగుణంగా వ్యవసాయరంగంలో ఆధునిక యాంత్రీకరణ విధానాన్ని ప్రవేశపెట్టాలి. దేశ జనాభాకనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి రెండో హరిత విప్లవాన్ని తీసుకు రావాలి. చిత్తశుద్ధితో కూడిన రాజకీయవ్యవస్థే ఇవన్నీ చేస్తుంది.
దేశాన్ని పురోగమనం వైపు నడిపించాలంటే మానవ జీవితానికి, సమాజ వికాసానికి పాటుపడే రాజకీయ నాయకులు, పాలనాధికారులు తమ వృత్తి ధర్మాన్ని, నైతిక విలువలను పాటించాలి. సమాజంలోని దోపిడీ వ్యవస్థను, కుళ్లు రాజకీయ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి. విలువలతో కూడుకున్న రాజకీయ వ్యవస్థను రూపొందించాలి. ఈ సందర్భంగా సమర్థవంతమైన నాయకత్వం ఈ దేశానికి అవసరమని ప్రజలు భావిస్తున్నారు.
రాజకీయ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేర్కొన్న రాజ్యాంగ విలువలు ఎంతగానో దోహదపడుతాయి. అయితే నేటి కేంద్ర పాలకులు రాజ్యాంగ విలువలు, ఫెడరల్ విధానం, ధర్మ వ్యవస్థను పూర్తిగా విస్మరించారు. విస్మరణకు గురైన ఈ విలువలను బలోపేతం చేసే దిశగా పాలన సాగించాల్సిన అవసరం ఉన్నది. దానికోసం అన్ని వర్గాలను కలుపుకొనిపోయే నాయకుడు ఈ దేశానికిప్పుడు కావాలి. ప్రపంచ జనాభాలో రెండు, ఆర్థికపరంగా ఐదో స్థానంలో ఉన్న భారతదేశం ప్రపంచశక్తిగా ఎదగాలంటే ఆర్థిక, భౌగోళిక వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికోసం వ్యవసాయ, పారిశ్రామిక, విదేశీ వ్యవహారాలు, దేశ రక్షణ విధానాలను సమర్థవంతంగా అమలుచేసే నాయకుడు కావాలి.
దేశంలో ప్రధానంగా ఒకే విధమైన వ్యవసాయ విధానం, ఒకే రకమైన పంట ధరలుండాలి. అప్పుడే దేశ రైతాంగం అన్నిరకాల వనరులను సద్వినియోగం చేసుకొని అద్భుత ప్రగతిని సాధించగలదు. దేశ రైతాంగానికి అవసరమైన పెట్టుబడి, సాగునీరు అందించి, అనుకూలమైన పంట ధరలను నిర్ణయించగల ప్రభుత్వం దేశానికి చాలా అవసరం. జాతీయ గౌరవాన్ని పెంపొందించే విధంగా రాజకీయవ్యవస్థను రూపకల్పన చేయగలిగే శక్తి, వ్యక్తి కేసీఆర్ ఒక్కరే అనడంలో సందేహం లేదు. కేసీఆరే ప్రత్యామ్నాయం. ఆ దిశగానే కేసీఆర్ నేతృత్వంలో రూపాంతరం చెందిన ‘భారత్ రాష్ట్ర సమితి’ దూసుకెళ్తుందని ఆశిద్దాం.
(వ్యాసకర్త: పీఆర్వో, కేయూ)
-డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి
98495 77610