బ్రిటీష్ వలస పాలన కాలం నుంచి కేంద్ర పాలకులకు గవర్నర్లు విధేయులుగా ఉన్నారు. ఇటీవల కాలంలో వీరు విపక్ష పాలిత రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాలు సర్కారియా కమిషన్ సూచనలను పట్టించుకోకపోవడం, రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలను గౌరవించకపోవడమే ఈ దుస్థితికి కారణం.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ల వ్యవస్థను వ్యతిరేకించిన నరేంద్ర మోదీ.. ఇప్పుడు అదే వ్యవస్థను అడ్డగోలుగా వాడుకొంటున్నారు. విపక్షాలు పాలిస్తున్న ప్రతి రాష్ట్రంలోనూ గవర్నర్లు అక్కడి ప్రభుత్వాలతో నిరంతరం ఏదో మిషతో వివాదాలు సృష్టించి పరిపాలనకు ఆటంకం కలిగించడం, బిల్లులు ఆమోదించకుండా నాన్చడం.. ఎక్కడి సమాఖ్య స్ఫూర్తో అర్థం కాదు.
ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించిన కాలంలో బ్రిటిష్ రాణికి ప్రతినిధిగా ఇక్కడ వైస్రాయ్ దొర ఉండేవారు. ఆయనకు ప్రతినిధులుగా రాష్ర్టాల్లో గవర్నర్లు ఉండేవారు. వైస్రాయ్ దొర ఆదేశాలను గవర్నర్లు తు.చ. తప్పకుండా అనుసరించేవారు. డబ్భు ఐదేండ్లయింది వాళ్లు వాళ్ల దేశానికి పోయి. కానీ వారి పద్ధతులనే ఇవాళ్టికీ కొనసాగిస్తున్నాం. ఢిల్లీలో ఉండే అధికార పార్టీ అధిష్ఠానానికి నమ్మిన బంటులుగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారు. రాజ్ భవన్లలో కూర్చొని ఢిల్లీ సూచనల ప్రకారం విపక్ష పార్టీల ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టే దుష్ట సంప్రదాయానికి నిలువెత్తు ప్రతీకలుగా నిలుస్తున్నారు. మొదటి ప్రధాని నెహ్రూ మొదలుకొని ప్రస్తుత మోదీ దాకా అందరు ప్రధానులు, కేంద్ర ప్రభుత్వాలు విపక్ష పాలిత రాష్ర్టాల్లో గవర్నర్లను తమ అరాజకీయాలకు పావులుగా వాడుకున్న వారే. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఈ విపరీత ధోరణి పరాకాష్ఠకు చేరుకుంది. తరువాత వచ్చిన అన్ని ప్రభుత్వాలు అడ్డదిడ్డంగా గవర్నర్ల వ్యవస్థను వాడుకొన్నవే. ఇప్పుడు మోదీ హయాంలో ఈ పరిస్థితి మరీ మితిమీరిపోయింది.
గవర్నర్ వ్యవస్థ ఏర్పాటు విషయంలో రాజ్యాంగ నిర్మాతలు భావించింది వేరు. వాస్తవంగా జరుగుతున్నది వేరు. కేంద్రానికి, రాష్ర్టాలకు మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తూ, సమాఖ్య వ్యవస్థలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం గవర్నర్ విధి. రాజ్యాంగం పరిధిలో రాష్ర్టాలు పరిపాలన సాగించేలా రాష్ట్రపతి ప్రతినిధిగా పర్యవేక్షించడం గవర్నర్ బాధ్యత. మంత్రి మండలి సలహా మేరకే గవర్నర్ నడుచుకుంటారు కాబట్టి ఆ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు అవసరం లేదని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. కాబట్టే గవర్నర్‌ను రాష్ట్రపతి ద్వారా నామినేట్ చేసే పద్ధతిని రాజ్యాంగంలో పొందుపరిచారు. గవర్నర్‌ను ప్రత్యక్షంగా ఎన్నుకున్నట్టయితే మంత్రిమండలికి, గవర్నర్‌కు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుందని ప్రముఖ న్యాయ నిపుణులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఆనాడే అభిప్రాయపడ్డారు.
గవర్నర్లను ప్రత్యక్షంగా ఎన్నుకున్నట్టయితే వారు రాష్ర్టాల్లో చీలిక రాజకీయాలకు పాల్పడే ప్రమాదం ఉందని జవహర్లాల్ నెహ్రూ అభిప్రాయపడ్డారు. అందుకే రాష్ట్రపతి ఇష్టాయిష్టాలపై ఆధారపడేలా గవర్నర్ పదవిని రాజ్యాంగ నిర్మాతలు రూపొందించారు. ఈ పద్ధతే ఇప్పుడు బెడిసి కొట్టింది. మన రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఎంతటి సిద్ధహస్తులో దాన్ని నిర్మించిన అమాయక పెద్దలకు ఆనాడు గ్రహింపు లేదు. ఇప్పుడు ఎన్ని నీతి సూత్రాలు బోధించినా ఏం ప్రయోజనం? గవర్నర్ వంటి ఉన్నత పదవిని చేపట్టేవారు నిస్సందేహంగా ప్రజా జీవితంతో మమేకమైన వారై ఉండాలి. అదే సమయంలో రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేనివారై ఉండాలి. అలాంటప్పుడే వారు గవర్నర్‌గా నిష్పాక్షికంగా వ్యవహరించగలుగుతారని కేకే మున్షీ, టీటీ కృష్ణమాచారి వంటి ప్రముఖ నేతలు చెప్పారు. సర్కారియా కమిషన్ ఇంకాస్త ముందుకు వెళ్లి ముఖ్యమంత్రులను సంప్రదించాకే గవర్నర్‌ను నియమించాలని సిఫారసు చేసింది. ఈ సూచనలన్నీ బుట్ట దాఖలయ్యాయి.
గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తి కేంద్ర ప్రభుత్వానికి ఏజెంటుగా పని చేయరాదని హరి గోవింద్ వర్సెస్ రఘుకుల్ తిలక్ కేసులో సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు టీటీ కృష్ణమాచారి 1979 మే 1న స్పష్టంగా చెప్పారు. ‘గవర్నర్ రాజ్యాంగ బద్ధంగా తనకు నిర్దేశించిన విధి నిర్వహణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం లేదు. రాజ్‌భవన్ స్వయంప్రతిపత్తి గల రాజ్యాంగ కార్యాలయం. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతమాత్రం నియంత్రించజాలదు’ అన్నది కృష్ణమాచారి స్పష్టీకరణ. కానీ ఇవాళ జరుగుతున్నదేమిటి?
‘గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా ప్రైవేటు అంచనాలను చేయజాలరు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధమైనవి. ఎందుకంటే ప్రజాస్వామ్యం వాస్తవంగా పనిచేసేది చట్టసభల నుంచి మాత్రమే కావడం. గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ ఈ ప్రశ్నకు సొంతంగా సమాధానం చెప్పలేరు. చట్టసభలు అన్నవి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. వారికి జవాబుదారిగా ఉంటాయి. అంతే కానీ గవర్నర్ కు కాదు’ అని ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది. 1984లో ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి మెజారిటీలో ఉన్న ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసిన నాటి గవర్నర్ రామ్‌లాల్ మొదలుకుని జీడీ థాప్సే, జగ్మోహన్, మోతీలాల్ వోరా, రొమేశ్ భండారీ, కేకే షా, ఫాతిమా బీవీ, కుముద్ బెన్ జోషి, ఇవాళ్టి బీజేపీ గవర్నర్ల దాకా ఎందరో ఆ పదవికి ఏర్పడిన కళంకాన్ని తొలగిపోకుండా చూస్తున్నారు! గవర్నర్ పదవి పూర్తిగా రాజకీయ నియామకమేననడం నిస్సందేహం. అన్ని రాజకీయ పార్టీలూ ఈ విధమైన పద్ధతిని అనుసరిస్తున్నప్పుడు నియామకాలను తప్పుపట్టడంలో అర్థం లేదు. కానీ, ఒకసారి నియామకం అయిన తరువాత గవర్నర్ రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరించడమే ఆక్షేపణీయం.
గవర్నర్ల వ్యవస్థను ఇలా దుర్వినియోగం చేయడాన్ని విపక్షంలో ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు విమర్శిస్తాయి. అధికారంలోకి వస్తే మాత్రం రాజకీయ లబ్ధి ముందు ఇవన్నీ బలాదూర్ అవుతాయి. రాజ్యాంగ ఉన్నత పదవులను గౌరవ ప్రదంగా నిర్వహించాల్సిన రాజకీయ వ్యవస్థే దాన్ని దుర్వినియోగం చేస్తుంటే.. ఇక ప్రజాస్వామ్యానికి దిక్కేది?
-కోవెల సంతోష్ కుమార్
90521 16463