High Cholesterol | నేటి వేగవంతమైన ప్రపంచంలో అధిక కొలెస్ట్రాల్ కూడా ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, మారిన జీవనశైలి వంటి తదితర కారణాల వల్ల మనలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వాటితో పాటు ఇతర గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల ధమనులు మూసుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అధిక కొలెస్ట్రాల్ రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇది మొత్తం శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు ఆహారం, జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ సమస్య భవిష్యత్తులో రాకుండా చూసుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరిచే, వాటిని నిర్వహించడానికి పాటించాల్సిన చిట్కాల గురించి వైద్యులు వివరిస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వారు పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, చిక్కుళ్లు వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఆలివ్ నూనె, అవకాడో నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే నూనెలను తీసుకోవాలి. ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే ప్రతివారం 150 నిమిషాల వ్యాయామం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. నడక, జాగింగ్, ఈత వంటివి చేయడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
అంతేకాకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తప్రవాహం నుండి చెడు కొలెస్ట్రాల్ తొలగించబడుతుంది. అదేవిధంగా శరీర బరువు తగ్గడం వల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి, మొత్తం గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు మద్యం సేవించడం, ధూమపానం మానేయడం వంటివి చేయాలి. వీటిని మానేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉండాలి. అలాగే జన్యుపరంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నవారు కూడా వైద్యుడిని సంప్రదించి కొలెస్ట్రాల్ స్థాయిలను పరీక్షించుకోవడం మంచిది. అలాగే దీర్థకాల ఒత్తిడి కూడా అధిక కొలెస్ట్రాల్ కు దారి తీస్తుంది. కనుక యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ విధమైన చిట్కాలను పాటించడం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ చిట్కాలను పాటించడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య భవిష్యత్తులో రాకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.