29 రాష్ర్టాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య ‘భారత్’ అని గర్వంగా చెప్పుకొంటాం. అలాంటి దేశంలో కేంద్రంలోని బీజేపీ అధికార దర్పంతో ప్రజాస్వామ్యాన్ని నడి బజారులో మానభంగం చేస్తున్నదని చెప్పాలి. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా ఇది పచ్చి నిజం. ప్రజాస్వామ్య నిబంధనలు, ప్రభుత్వ వ్యవస్థలపై బీజేపీ నిరంకుశత్వం పూర్తిస్థాయిలో దాడి చేస్తున్నది.
‘ద గ్రేటెస్ట్ పవర్ ఈజ్ నాట్ మనీ పవర్.. బట్ పొలిటికల్ పవర్’ అని అమెరికాకు చెందిన వాల్టేర్ అనెన్ బెర్గ్ అన్న మాటలిప్పుడు తలకిందులవుతున్నాయి. ఓటర్లను కొనడం హద్దులు దాటి ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధుల్ని కొనడం, ప్రజా ప్రభుత్వాలను కూల్చడం మన దేశంలో పరిపాటిగా మారింది. నడి బజారులో ఎమ్మెల్యేల కొనుగోళ్ల ప్రక్రియ సాగుతున్నదంటే ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేస్తున్నారని పచ్చిగా చెప్పకతప్పదు. బీజేపీ ధన, అధికార దాహం గురించి చెప్పుకొనేముందు హీరో మహేష్‌బాబుతో పూరిజగన్నాథ్ తీసిన సినిమా ‘బిజినెస్‌మ్యాన్’ గుర్తొస్తున్నది. కానీ ఆ సినిమాలో రాజకీయాల ఆత్మ ఉన్నది. డబ్బులతో ఏదైనా చేయవచ్చని, ఎలాంటి అధికారాన్నయినా సొంతం చేసుకోవచ్చని హీరో భావిస్తాడు. కానీ పొలిటికల్ పవర్ కావాలనుకోడు. ఎందుకంటే.. అంతకంటే పవర్ఫుల్ అయినది డబ్బు అని హీరోకు క్లారిటీ ఉంటుంది.
ఇప్పుడు బీజేపీ అచ్చంగా అదే ఆలోచిస్తున్నది. డబ్బుతో రాజకీయ అధికారం చేజిక్కించుకొని మరింతగా సంపాదించాలనుకుంటున్నది. దీంతో ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ప్రతి రోజూ అమ్ముడుపోతున్నది. కులాలు, వర్గాలవారీగా గతంలో ఓట్లను కొన్నట్టే ఇటీవలికాలంలో ఎమ్మెల్యేలను బహిరంగంగా కొనడం బీజేపీకి సహజ ప్రక్రియగా మారింది. ఈ సూత్రంతోనే దేశంలోని ఇప్పటికీ 8 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను దిగ్విజయంగా కూల్చగలిగింది. 2019లో కర్ణాటక, 2020 మార్చిలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం, బెదిరించడం ద్వారా ప్రభుత్వాల కూల్చివేతలో బీజేపీ సఫలీకృతమైంది. ఆ తర్వాత శివసేన ఎమ్మెల్యేలలో చీలిక తీసుకొచ్చి ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వాన్నీ కొనేశారు. డబ్బు, కాంట్రాక్టులు, నామినేటెడ్ పదవుల ఆశ చూపి ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియను బీజేపీ దేశవ్యాప్తంగా వేగవంతం చేస్తున్నది. ఛత్తీస్‌గఢ్‌లో విఫలయత్నం జరిగినా ఆపరేషన్ జార్ఖండ్‌తో మళ్లీ ఊపందుకున్నది. జార్ఖండ్ ఎమ్మెల్యేలను అసోం పిలిచి మరీ డబ్బు మూటలిచ్చారు. అసోం బీజేపీ సీఎం హిమంత బిశ్వశర్మ జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని కొనేసే టాస్క్ తీసుకున్నారని, ఆయనే బేరం పెట్టారన్నది ఓపెన్ సీక్రెట్. ఇది వర్తమాన చరిత్రే. లోగడ రాష్ర్టాలలో ప్రభుత్వాలను కూల్చినట్టే, ఎమ్మెల్యేలను అంగట్లో సరుకుల్లా కొన్నట్టే తెలంగాణలో కూడా బీజేపీ భారీ యత్నమే చేసింది. నిందితుల ఆడియో సంభాషణలు, మెసేజ్‌లను నిశితంగా గమనిస్తే తెలంగాణపై ఢిల్లీ బీజేపీ కుట్ర తేటతెల్లమవుతున్నది.
మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందే జరిగిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను కేసీఆర్ తిప్పికొట్టగలిగారు. మిగిలిన రాష్ర్టాల కంటే భిన్నంగా స్పందించి బీజేపీ బండారాన్ని సాక్ష్యాలతో సహా దేశానికి చూపగలిగారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తరుణంలో కేసీఆర్‌కు ఇది తొలి అడుగులా భావించాలి. బీజేపీ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా కేంద్రంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కిమ్మనలేదు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మీద ఈగ వాలినా ఊరుకునేది లేదని మరోసారి స్పష్టం చేశారు.
బీజేపీ ధన ప్రవాహంతో, అధికార దర్పంతో ఎమ్మెల్యేల కొనుగోలు దందా చేస్తున్నది. రాజకీయ పార్టీలు ప్రజలకు డబ్బు, మద్యం ఇతరత్రా ఖరీదైన వస్తువులను ఎరగా చూపి ప్రలోభపెడుతున్నాయి. ఇప్పుడు కొంచెం మారి ఏకంగా నేతలనే రాజకీయ పార్టీలు కొంటున్నాయి. ఇదో నిరంతర ప్రక్రియలా సాగుతున్నది. గతంలో ఒక్క ఎంపీ మద్దతు తక్కువైనప్పుడు వాజ్‌పేయి ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అదే ఇప్పుడు వంద మంది ఎమ్మెల్యేలు తక్కువైనా సరే మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే పొలిటికల్ పవర్ కన్నా.. మనీ పవర్ ఎక్కువని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియను బీజేపీ మొదటగా ఈశాన్య రాష్ర్టాల నుంచి ప్రారంభించింది. వందల సంఖ్యలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలకు ప్రభుత్వాలనే మార్చేసింది.
బీజేపీ ప్రజాస్వామ్య ద్రోహానికి పాల్పడుతున్నదన్నది నిర్వివాదాంశం. దీనికి విరుగుడు విపక్షాల ఐక్యత. ప్రజా చైతన్యం అనివార్యం. కానీ ఇక్కడ ఓ విషయం గుర్తొస్తున్నది. సమాజంలో చదువుకుంటే చైతన్యం పెరుగుతుందని అందరనుకుంటారు. కానీ చదువు లేనప్పుడు దేశంలో కొన్ని ఆదర్శాలుండేవి. ప్రజాస్వామ్యంపై అవగాహన ఉండేది. ఓటు హక్కు ఎంత పవిత్రమో తెలుసుకునేవారు. ప్రజాప్రతినిధులు కూడా సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు. కానీ ఇప్పటి సమాజంలో విద్యాధికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ మునుపటి సామాజిక స్పృహ నేడు చాలా మందిలో కనిపించడం లేదు. ఉదాహరణకు బీజే పీ దేశ వ్యాప్తంగా విచ్ఛిన్నకర రాజకీయాలకు పాల్పడుతూ దేశంలో నియంతృత్వాన్ని నెలకొ ల్పే కుట్రలు చేస్తున్నా, ఆ ప్రమాదాన్ని పలువురు విద్యాధికులు అర్థం చేసుకోవడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే దేశ భవిష్యత్తుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలి.
-వెంకట్ గుంటిపల్లి
94949 41001