సీమాంధ్ర పాలనలో విస్మరణకు గురైన తెలంగాణ ప్రాంత రజకులు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. రజకుల ఆర్థికాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం 2017-18, 2018-19 బడ్జెట్లలో వరుసగా రూ.250 కోట్లు కేటాయించడం సంతోషకరం.
తెలంగాణ ఆవిర్భావ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నది. 5,784 మంది రజకులకు రూ.31.26 కోట్ల రుణాలను అందించింది. రూ.29.45 కోట్లతో 644 చోట్ల నూతన దోభీ ఘాట్లను నిర్మించింది. ప్రభుత్వం రజక ఫెడరేషన్ ద్వారా 25 మందికి రూ.4.19 లక్షలతో కారు లోన్లు అందజేయడం అభినందనీయం.
200 మంది రజకులకు ఒక్కొక్కరికి రూ.25 వేల ఖర్చుతో డెంటల్ అసిస్టెంట్ శిక్షణ ఇప్పించింది. 21 మంది కి రూ.25 వేలతో మెజీషియన్ శిక్షణ ఇప్పించింది. రూ.2 కోట్ల 12 లక్షలతో పైలట్ ప్రాజెక్టు కింద 8 చోట్లా అత్యాధునిక లాండ్రీ యూనిట్లను మంజూరు చేసింది. 2017 జూలై 31న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 32 జిల్లాల నుంచి ప్రతి జిల్లాకు 20 మంది చొప్పున రజక ప్రతినిధులతో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రూ.37 లక్షల యూనిట్ కాస్టుతో ఆధునిక లాండ్రీల ఏర్పాటు పరికరాలపై అవగాహన కల్పించింది. రజక ఫెడరేషన్ ఆధ్వర్యంలో 11 జిల్లాల నుంచి 18 మంది రజక ప్రతినిధులు బెంగళూరుకు వెళ్లి అక్కడ ఆధునిక లాండ్రీల పనితీరును పరిశీలించారు.
మురికి నీళ్లలో ఉండే క్రిమి కీటకాలతో ఫంగస్ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. అందుకే రజక మహిళలు అనారోగ్యం బారిన పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నది. తెలంగాణలోని 8 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కింద రూ.57 లక్షల 50 వేల చొప్పున 100 శాతం సబ్సిడీతో ఆధునిక దోబీ ఘాట్ల భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. ఆ నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. హైదరాబాద్‌లో 45 లక్షలతో, మంత్రి హరీశ్‌రావు నిధుల సహకారంతో సిద్దిపేటలో రూ.1 కోటితో ఆధునిక లాండ్రీలు ప్రారంభమయ్యా యి. ఒక కోటి 30 లక్షల రూపాయలతో మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో ఆధునిక దోబీఘాట్ పనులు ప్రారంభించడం అభినందనీయం. ఆలేరు, మేడ్చల్ ప్రాంతాల్లో పనులు టెం డర్ దశలో ఉన్నాయి. ఆధునిక లాండ్రీ యూనిట్లతో రజకులు ఉపాధి పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుండటం హర్షణీయం. రజకులకు ప్రభుత్వం 72 వేల విద్యు త్తు కనెక్షన్లకు, ఉచిత మీటర్ల కోసం రూ.67 కోట్లు కేటాయించింది.
ఇదిలా ఉంటే రజకుల ఆత్మగౌరవ భవనాల కోసం ప్రభుత్వం చేయూతనందించడం ఆహ్వానించదగిన పరిణామం. ఇందులో భాగంగానే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున రజక భవనం కోసం మూడెకరాల స్థలం, రూ.5 కోట్లు, వరంగల్‌లో రజక భవనం కోసం 1 కోటి 95 లక్షలు, నల్లగొండ జిల్లా కేంద్రంలో భవనం కోసం రూ.50 లక్షలు విడుదల చేయడం ముదావహం.
రాష్ట్ర ఆవిర్భావ అనంతరం సీఎం కేసీఆర్‌తోనే రజకుల అభివృద్ధి సాధ్యమైంది. రజకుల సమస్యలపై చర్చించిన అరుదైన ఘన త కేసీఆర్‌కే దక్కింది. గ్రామీణ ప్రాంతాల్లో కనుమరుగవుతున్న కుల వృత్తులకు పునర్ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్న కేసీఆర్ కు రజక కుల బంధవులందరి తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు.
(వ్యాసకర్త: రజక సంఘాల సమితి రాష్ట్ర ముఖ్య సలహాదారు)
-కొండూరు సత్యనారాయణ
91543 83679