తెలంగాణలో జరుగుతున్న మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక, రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. నిజానికి రాజగోపాల్‌రెడ్డికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంటే గత కొన్నేండ్ల కిందటే తన పదవికి రాజీనామా చేయాల్సింది, కానీ అలా చేయలేదు. తెలంగాణ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న క్రమంలో హఠాత్తుగా రాజీనామా చేయడంలో ఔచిత్యం ఏమిటనే ప్రశ్న ఉద్భవిస్తున్నది. ఇది ఒక్క మునుగోడులోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా కొన్ని ప్రధాన విషయాలను ఈ వ్యాసంలో చర్చించుకుందాం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి 967 ప్రాంతాలు ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ సమస్యను తీర్చడంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పూర్తి స్థాయిలో సఫలీకృతమైంది. ప్రస్తుతం తెలంగాణలో ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాలు సున్నా అని జల శక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితమే అన్న వాస్తవం ప్రజలకు, బీజేపీకి తెలుసు.
మునుగోడు ఉప ఎన్నిక ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం సృష్టించబడినదో ప్రజలు స్పష్టంగా గుర్తించారు. ప్రగతిశీల, అభ్యుదయ, లౌకిక, ప్రజాతంత్ర భావాలతో కూడిన తెలంగాణకు ప్రపంచ చరిత్రలో ప్రముఖ స్థానం ఉన్నది. అలాంటి రాష్ట్రంలో అధికారం కోసం పగటికలలు కంటున్న ఆత్మవంచన పరులను, అహంకారపు వీరులను తరిమి కొట్టాలి. తెలంగాణ అభివృద్ధి నమూనాను భారత ప్రజల అభివృద్ధి నమూనాగా ముందుకు తీసుకుపోయే సత్తా, సామర్థ్యం కేసీఆర్‌కే ఉన్నది. ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దార్శనికతను, దూరదృష్టిని ప్రజలంతా గుర్తించారు. మానవ వికాసం, ప్రజాసంక్షేమం, సామరస్యం లక్ష్యంగా కేసీఆర్ ప్రజారంజక పాలనను అందిస్తున్నారు. ఆయన పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్నివర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి. దేశ ప్రజలందరూ తెలంగాణ ప్రజా సంక్షేమ అభివృద్ధిని, కేసీఆర్ నమూనాను కోరుకుంటున్నారు. దీనికి భిన్నంగా బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతూ విషం చిమ్ముతున్నది. కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ అధికారమే ధ్యేయంగా రాజకీయ వ్యాపార ధోరణితో రాష్ట్ర సాధారణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ ఉప ఎన్నికను అనివార్యం చేసింది.
బీజేపీ మునుగోడులో ఇప్పటిదాకా తన ఉనికిని సైతం చాటుకోలేకపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రాజగోపాల్‌రెడ్డి తన రాజకీయ స్వార్థం, వ్యాపార విస్తరణ కోసం బీజేపీలో చేరారని మునుగోడు ఓటర్లు గ్రహించారు. మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన కమ్యూనిస్టు పార్టీలు సైతం టీఆర్ఎస్కే జై కొట్టాయి.
తెలంగాణ రాష్ట్రంలో యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా ప్రజారంజక పాలన అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీని ఓడించడం అంత సులువేమీ కాదని బీజేపీకి బాగా తెలుసు. అందుకే అసత్యపు ఆరోపణలు చేస్తూ, వాస్తవాలను విస్మరిస్తూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నది. తెలంగాణ వ్యవసాయరంగ అభివృద్ధికి కేసీఆర్ ఏం చేశారో ప్రజానుభవంలో ఉన్నది. తెలంగాణ వ్యవసాయరంగంలో కేసీఆర్‌ది ఒక సువర్ణ అధ్యాయం. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌తో పాటుగా, గ్రామాల్లోనే పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. సాగునీటి రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అద్భుత ప్రగతిని సాధించింది. కేసీఆర్ అవలంబించిన ఈ వ్యవసాయ నమూనా తమకూ కావాలని దేశవ్యాప్తంగా రైతాంగం కోరుకుంటున్నది. కానీ మరొకవైపు రైతాంగం వెన్ను విరిచేలా, వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టేలా బీజేపీ నల్ల చట్టాలు తెచ్చే ప్రయత్నం చేసి దేశవ్యాప్తంగా రైతాంగం నుంచి తీవ్ర నిరసనలు రావడంతో చివరికి వెనుకడుగు వేసింది.
వ్యవసాయానికి ప్రధానంగా కావలసింది సాగు నీరు, విద్యుత్. ఇప్పుడది తెలంగాణలో పుష్కలం. గతంలో వర్షాకాలం ఒక్క పంటకే పరిమితమైన తెలంగాణ రైతాంగం నేడు సంవత్సరానికి 3 పంటలు పండించగలుగుతున్నదంటే అది కేసీఆర్ ఆలోచనల ఫలితమే. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌ది. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 25 లక్షల బోరు బావులున్నాయి. అందునా భూగర్భ జలాలు అంతంత మాత్రమే. కానీ కరువు ప్రాంతమైన మునుగోడును సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే 2015లో చెర్లగూడెం రిజర్వాయర్ మంజూరు చేసి దశబ్దాల కల నెరవేర్చారు కేసీఆర్. దాంతోపాటుగా కిష్టారంపల్లి రిజర్వాయర్ సైతం ప్రారంభించారు. ఇవి పూర్తయితే తొందర్లోనే 2.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం పెంచడం కోసం నల్లగొండ జిల్లా దామరచర్లలో రూ.30 వేల కోట్లతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మిస్తున్నారు. మరోవైపు, విద్యుత్‌రంగాన్ని ప్రైవేటీకరించే కుట్రలో భాగంగా బీజేపీ ఉచిత విద్యుత్ నిలిపివేసి మోటర్లకు మీటర్లు పెట్టాలని రాష్ర్టాలకు హుకుం జారీ చేసింది. కేంద్రం తెలంగాణ ధాన్యాన్ని కొనేందుకు విముఖత చూపింది. కానీ రైతు సంక్షేమ ప్రభుత్వంగా కేసీఆర్ రైస్ మిల్లర్లతో మాట్లాడి వడ్లు కొనేలా చేశారు.
జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు లేక వేలాది మంది ఫ్లోరోసిస్ బారిన పడి దివ్యాంగులుగా మారారు. వారి సమస్యను గత ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకోలేదు. రాజగోపాల్‌రెడ్డి ధనబలంతో, పెత్తందారీతనంతో గెలిచి దానిని తమ బలంగా చూపించేందుకు బీజేపీ ప్రయ త్నం చేస్తున్నది. కానీ మును‘గోడు’ను తీర్చిన కేసీఆర్‌కే ప్రజలు పట్టం కట్టనున్నారనేది స్పష్టం. ఇవాళ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలంటే అందుకు కేసీఆరే ప్రత్యామ్నాయం అని యావత్ దేశం బలంగా విశ్వసిస్తున్నది. అందుకు మునుగోడు నుంచే తొలి అడుగు దేశవ్యాప్తంగా పడనున్నది.
(వ్యాసకర్త : వైస్ చాన్స్‌లర్, కాకతీయ యూనివర్సిటీ)
-ప్రొఫెసర్ తాటికొండ రమేష్