ఎవరెన్ని అబద్ధాలు కూస్తేనేమి, సత్యం చెక్కు చెదరనిది. మంచినీళ్ల కోసం గుడ్లళ్ల కన్నీళ్లు కుక్కుకొని ఎంతగా కుమిలినమో కదా!ఈ దుఃఖాన్ని పారదోలటానికి ఎవరికోసం ఇంతకాలం ఎదురుచూశామో ఆ వ్యక్తే అల్లంతదూరంలో ఉన్న కృష్ణా, గోదావరి నదుల నీళ్లను ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా పంచిపెడుతున్న విషయాన్ని గుర్తుకుతెచ్చుకోండి. ఇప్పుడిప్పుడే నీళ్ల గోసను తీర్చుకుంటున్నం.
లింగమంతుని జాతర సాక్షిగా లింగ లింగ లింగో అంటూ కాళ్లకు గజ్జెలు కట్టుకొని పరవశంలో మనం మొక్కుకున్న మొక్కుల సాక్షిగా నీళ్లిచ్చిన వాళ్లను ఈ నేల మరుస్తదా! ప్రజల కోసం పనిచేసిన వారిని వదులుకుంటదా! ఎవరెన్ని చెప్పినా చేసిన మేలును మర్రిగూడ మరువదు. ఎర్రగుండ్లపల్లి, శివన్నగూడెం, చర్లగూడెం, వెంకాయపల్లిలకు అన్నీ తెలుసు. లింగోటం, లక్షణాపురం, కిష్టారంపల్లి రిజర్వాయర్ల కోసం త్యాగం చేసిన బిడ్డలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవటం ఆ గట్టి మనిషికి తెలుసు. అబద్ధాలను ఎట్లా చిట్లకొట్టాలో నెమళ్లగూడేనికి తెలుసు. తిరుమలగిరి, పెద్దాపురాలకు పునరాలోచన చేసుకునే శక్తి ఉంది. నాంపల్లి నిజాల పక్కనే నిలుస్తది, చండూరు మండలానికి ఎవరెన్ని చెప్పినా అది నమ్మకాలకు సొంతూరు. ప్రజల కోసం నేల కొరిగిన వీరులకు జన్మస్థలిగా నిలిచిన ఎర్రని జెండా రెపరెపలాడే సంస్థాన్ నారాయణపురానికి పూర్వ, వర్తమాన విషయాలన్నీ తెలుసు. సమస్త ప్రజల సౌఖ్యం కోరిన జనం కలల కల నేత కొండా లక్ష్మణ్ బాపూజీ పాద ముద్రలను మరువని అప్పటి కొండూరు నియోజకవర్గం ఇప్పటి మలిదశ ఉద్యమవీరుడు కేసీఆర్కు కొండంత అండగా నిలిచిన నైతికత కలది. చౌటుప్పల్ సమస్త తెలంగాణకు మంచినీళ్లు అందించిన మిషన్ భగీరథ పుట్టుకకు జన్మ స్థానం.
కొన్ని దశాబ్దాలు గోసబడ్డ వారు తమను ఏదో ఒక రూపంగా బయటపడేసిన వ్యక్తులను, శక్తులను, పాలకులను మరిచిపోరు. అప్పుడప్పుడు అనుకోని అకాల వర్షాలు వచ్చి పంటలను పాడు చేసినట్లు తెలంగాణ పునర్నిర్మాణానికి అడ్డుపడే శక్తులూ ఉంటాయి. గంగా జమునీ తహ్జీబ్ను చిన్నాభిన్నం చేసి సమాజాన్ని విడదీసే మత ఉన్మాద శక్తులూ ఉంటాయి. కుల, మత, వర్ణ, వర్గ ఆధిపత్యాలను దాటి తనను తాను పునర్నిర్మించుకుంటున్న తెలంగాణపైకి కమ్ముకొస్తున్న మత నీడల ప్రయత్నాలను తిప్పికొట్టాలి. మనం స్వరాష్ట్ర పునర్నిర్మాణదారులం. మత సామరస్యం కోరుకునే జాతీయవాదులం. మునుగోడు నుంచి ఫ్లోరైడ్ విషాదాన్ని పారదోలే నీళ్లే కావాలి. మత ఘర్షణలతో ప్రవహించే నెత్తురు ధారలు మనకొద్దు. మునుగోడులో ప్రతి ఊరికి ఒక పోరాట చరిత్ర ఉన్నది. ఇలాంటి పోరు నేలలో మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులకు తావులేదని చాటి చెప్పాలి. మానవీయ కోణంలో మత సామరస్యాన్ని ఎదఎదలో నాటుకొంటూ తెలంగాణను ప్రగతి పథంలో పునర్నిర్మించుకుంటూ ముందుకు సాగుదాం. దేశానికే మత సామరస్య ప్రతీకగా తెలంగాణని నిలుపుకొందాం. మానవీయ సమాజాన్ని గెలిపించుకుందాం. మనుషులను విభజిం చే మతతత్వానికి మునుగోడు ఓటెయ్యదని నమ్మకం బాజాప్తా ఉన్నది.
(వ్యాసకర్త: చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ)
-జూలూరు గౌరీ శంకర్