మన చేనేత కళాకారులు సృష్టించే వస్ర్తాలతో బ్రిటన్ ఉత్పత్తులు పోటీ పడలేని పరిస్థితుల్లో, బ్రిటిష్ పాలకులు భారతీయ నేతన్నలను తీవ్ర అణచివేతకు గురిచేశారని చదువుకున్నాం. మహాత్మాగాంధీ అదే రాట్నాన్ని ఆయుధంగా చేసుకొని అహింసా మార్గంలో ఆ రాక్షస పాలనను అంతమొందించారు. చేనేతకు జాతీయోద్యమంలో అంతటి ప్రాధాన్యత ఉన్నది. ఈ నేపథ్యంలోనే చేనేత వస్ర్తాలపై కేంద్రంలో కొలువు దీరిన ఏ ప్రభుత్వమూ పన్ను వేయలేదు. కానీ, మోదీ ప్రభుత్వం 2017లో ఈ దుస్సాహసానికి పాల్పడింది. చేనేతపై ఐదు శాతం జీఎస్టీ విధించింది. అప్పటికే యాంత్రీకరణతో, ప్రపంచీకరణతో, కేంద్రంలోని ప్రభుత్వాల దారుణమైన నిర్లక్ష్యంతో చేనేత రంగం అతలాకుతలమైంది. దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. అయినా బీజేపీ పాలకులు చేనేత రంగంపై మరింత అక్కసుతో వ్యవహరిస్తున్నారు. చేనేతపై జీఎస్టీని ఐదు నుంచి 12 శాతానికి పెంచాలని కూడా మోదీ సర్కార్ యోచిస్తున్నదని వినిపిస్తున్నది.
చేనేత రంగం దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా కోటి మందికి, పరోక్షంగా మరో 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నది. అయినా కూడా కేంద్రప్రభుత్వాలు ఈ రంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. యూపీఏ హయాంలో బడ్జెట్ కేటాయింపు ఏనాడూ రూ.800 కోట్లకు మించలేదు. మోదీ పాలనలో మరింత తగ్గిపోయి 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.410 కోట్లకు పరిమితమైంది. అఖిల భారత చేనేత బోర్డును రద్దు చేయటంతోపాటు పలు చేనేత వ్యతిరేక చర్యలను మోదీ సర్కార్ తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం నిర్వాకం ఇలా ఉండగా, తెలంగాణలో పూర్తి భిన్నమైన పరిస్థితి మన ముందున్నది. చేనేత రంగాన్ని పునరుజ్జీవింపచేయటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారు. చేనేత మిత్ర పథకం కింద ముడిసరుకు కొనుగోలుపై 40 శాతం రాయితీ కల్పించారు. ‘నేతన్నకు చేయూత’ కింద కార్మికులు తమ వేతనంలో పొదుపు చేసే మొత్తానికి ప్రభుత్వం తన వంతుగా అంతే మొత్తం జోడించి వారి ఖాతాలో జమ చేస్తున్నది. 51 ఏండ్లు దాటిన నేత కార్మికులకు నెలకు రూ.2,016 పింఛను ఇస్తున్నది. చేనేత కార్మికులందరికీ రూ.5 లక్షల బీమా పథకం అమలు చేస్తున్నది. పావలా వడ్డీ, రుణమాఫీ సౌకర్యాలతోపాటు బతుకమ్మ చీరల ద్వారా ఉపాధి కల్పిస్తున్నది.
చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా మంత్రి కేటీఆర్ చేనేత వస్ర్తాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. మోదీ సర్కారు చేనేతను మరింత సంక్షోభంలోకి నెట్టే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు గట్టిగా వ్యతిరేకించింది. ఐదు శాతం జీఎస్టీ ప్రతిపాదన వచ్చినప్పుడు జీఎస్టీ మండలిలోనే వ్యతిరేక గళం వినిపించింది. ప్రస్తుతం ఈ నిరంకుశ నిర్ణయానికి వ్యతిరేకంగా పోస్టు కార్డుల ఉద్యమానికి కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు గొప్ప స్పందన లభిస్తున్నది. ఈ ఉద్యమంతోనైనా కేంద్రం కళ్లు తెరువాలి.