గిరిజనులు భూమి, నీరు, అడవి వంటి ప్రకృతి సంపదలను నమ్ముకొని జీవనం సాగించే ఆది మూలవాసులు. వీరిని ప్రకృతి పూజారులు, ప్రకృతి సంరక్షకులని కూడా అంటారు. తమ భాషను, ప్రాచీన కట్టుబాట్లను, సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్న చరిత్ర గిరిజనులది. కాలమాన పరిస్థితులను అధిగమిస్తూ, విదేశీ పాలకులను ఎదిరించి ఈ దేశ నిర్మాణంలో పునాదిరాళ్లుగా వారు ఒదిగి ఉన్నారు. దేశ హితం కోసం గిరిజనులు చేసిన కృషి, త్యాగాలు వారి భాషకు లిపి లేని కారణంగా చరిత్రలో రాయబడలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గిరిజనులకు తీరని అన్యాయం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆంధ్రా ప్రాంతంలోని లంబాడీలు, ఎరుకల, యానాదిలను గిరిజన జాబితాలో చేర్చి తెలంగాణ ప్రాంతం వారిని మాత్రం ఆ జాబితాలో చేర్చకుండా అన్యా యం చేశారు. దీనికోసం ఈ మూడు కులాలు 20 ఏండ్లు పోరాడాయి. దీని ఫలితంగా యాక్ట్ నంబర్ ‘108 ఆఫ్ 1976’ ద్వారా గిరిజనుల జాబితాలో చేర్చారు. ఈ విషయంలో తొలుత చారిత్రక తప్పిదానికి పాల్పడిన కాంగ్రెస్ ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తామే వారిని ఎస్టీ జాబితాలో చేర్చామని చెప్పుకోవడం హాస్యాస్పదం. వలసాంధ్ర పాలనలోఒక నిర్దిష్టమైన ప్రణాళిక, దూరదృష్టి కరువై గిరిజనులు అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణలో గిరిజనులతో పాటు ప్రజలందరికీ జరుగుతున్న వివ క్ష, అన్యాయాన్ని సహించని కేసీఆర్ ఎమ్మెల్యే పదవితో పాటు ఉప శాసన సభాపతి పదవికి రాజీనామా చేశారు.‘జలవిహార్’ సాక్షిగా 2001 లో టీఆర్ఎస్ను ఏర్పాటుచేసి తెలంగా ణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో గిరిజనులు తమ శక్తి మేరకు కేసీఆర్ నాయకత్వా న్ని బలపరిచారు. ప్రజల ఆకాంక్ష, యువకుల బలిదానాలు, ఉద్యమనాయకుడు కేసీఆర్ పట్టుదలకు తలొగ్గిన కేంద్రం 2014, జూన్ 2న తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసింది.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 32 గిరిజన తెగలు మిగిలాయి. 2021 జనాభా లెక్కల (అంచనా) ప్రకారం రాష్ట్రంలో గిరిజనుల జనాభా 42 లక్షలు. ఇందులో ‘బంజారా గొర్బొలి’ భాష మాట్లాడే లంబాడీలు దాదాపు 32 లక్షలు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు పట్టం గట్టారు. ఈ నేపథ్యంలో గిరిజనుల అభివృద్ధి, వారి కోరికల పరిష్కారానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
గ్రామ పంచాయతీల ఏర్పాటు: గిరిజనుల చిరకాల వాంఛ అయిన ‘మావే నాటే మావే రాజ్’ (మా తండాలలో మా రాజ్యం)ను సీఎం కేసీఆర్ సాకారం చేశారు. 500 జనాభా కలిగిన తండాలు, గోండు, కోయగూడేలు, చెంచు పెంటలను 3,146 ప్రత్యేక గిరిజన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు.
రిజర్వేషన్ల పెంపు: గిరిజనుల అభివృద్ధికి మూలమైన విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ శాతా న్ని 6 నుంచి 10 శాతం పెంచి వారి కల నెరవేర్చారు. ఇది గిరిజన జాతి ఎన్నడూ మరిచిపో దు. రిజర్వేషన్ పెంపు నిర్ణయాన్ని మంత్రి హరీష్‌రావు వైద్య విద్యార్థుల అడ్మిషన్లో మొదటిసారిగా అమలుపరచడం అభినందనీయం.
గిరిజన అస్తిత్వానికి ప్రతీకలు: బంజారాజాతి ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ కాలిడిన నేల నేడు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ సంపన్నులకు నిలయమైంది. నవాబ్‌ల పాలనలో బంజారాలు మన్ననలు పొంది, వారిచే రంజన్ కా పానీ.. చప్పర్ కా ఘాస్.. దీన్ కా తీన్ ఖూన్ మాఫ్.. జహా అసభ్ జాహీక ఘోడ వహ జంగి.. భంగి కా బయల్ అను ఫర్మానా పొందారు. అంతటి చరిత్ర సంతరించుకున్న బంజారాహిల్స్‌లో 50 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించిన సంత్ శ్రీ సేవాలాల్ బంజారా భవనం, ఆదివాసి కొము రం భీం భవనం గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయి. గిరిజన కళారూపాల పరిరక్షణతోపాటు సదస్సులు, సమావేశాలకు గొప్ప వేదికగా ఇవి ఉపయోగ పడుతాయి.
కల్యాణలక్ష్మి: ఈ పథకం ఒక లంబాడీ కుటు ంబం ఆవేదన నుంచి ఉద్భవించినదని స్వయం గా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ములుగు మండలం, రామచంద్రపురం గ్రామ పంచాయతీ పరిధిలోని భగ్య తండాలో 2002 ఏప్రిల్‌లో ఓ ఇల్లు కాలిపోయింది. అప్పటి ఉద్యమనేత కేసీఆర్ వారిని పరామర్శించారు. అప్పుడు ‘అయ్యా! నా బిడ్డ పెళ్లికి దాచుకున్న డబ్బు, వస్తువులు, ధాన్యం కాలిపోయాయి. మేం ఇక ఆమె పెళ్లి చేయలేం. ఆత్మహత్యే మాకు శర ణ్య ం’ అని బానోత్ ఖీమా నాయక్ ఏడుస్తూ చెప్పా డు. ఆయన పరిస్థితి చూసి కేసీఆర్ కంటతడి పెట్టారు. పెళ్లి ఆగిపోకుండా అతనికి కేసీఆర్ ఆర్థిక సహాయం చేశారు. ఈ విధంగా నేటి ‘కల్యాణలక్ష్మి’ పథకానికి ఆ రోజే బీజం పడింది.
షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి (STSDF) చట్టం: గిరిజన జనాభా దామాషాలో నిధుల కేటాయింపును నిర్ధారించడానికి STSDF చట్టం 2017లో రూపొందించబడింది. ఈ చట్టం ప్రకారం విధిగా 10 శాతం నిధులను గిరిజన సంక్షేమం కోసం కేటాయించి ఖర్చు చేయాలి. ఒక వేళ చేయని పక్షంలో ఆ నిధులను తర్వాతి సంవత్సరానికి అదనంగా కేటాయించాలి. ఈ చట్టం గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపయోగపడుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యను ప్రాధాన్యరంగంగా గుర్తించి, గిరిజన బాలబాలికలకు, యువతకు మంచి విద్యావకాశాలు కల్పిస్తున్నది. రాష్ట్రంలో అదనంగా 92 కొత్త గురుకుల పాఠశాలలను ప్రారంభించి 74,953 మంది గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నది. గిరిజన ఉద్యోగినుల కోసం వర్కింగ్ విమెన్ హాస్టళ్లను నెలకొల్పింది. సైనిక పాఠశాల మంజూరుకు కేంద్రప్రభుత్వం నిరాకరించినా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి ‘సైనిక్ స్కూల్’ను ఏర్పాటు చేసింది. గిరిజన విద్యార్థుల ఉన్నత విద్య కోసం కొత్తగా 22 డిగ్రీ కళాశాలలను ప్రారంభించింది. ఇందులో 15 మహిళా డిగ్రీ కళాశాలలు. బాల్య వివాహాలను నిర్మూలించడానికి ఇవి తోడ్పడుతున్నాయి. విద్యానిధి పేరుతో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి గిరిజన యువతకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల పేరిట రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నది. 2014 నాటికి ఉన్న కోట్ల రూపాయల బకాయిలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేయడమే కాకుండా, 2014 నుంచి ఇప్పటివరకు గృహావసరాల కోసం 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడకానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం ‘డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం’ ద్వారా గిరిజన యువతకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించి వాహనాల కొనుగోలుకు సహకరిస్తున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలోని 441 మంది గిరిజన యువకులు వాహనాల యజమానులు గా మారారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.33 కోట్లు సమకూర్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ షాపుల్లో గిరిజనులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించి దుకాణాలను కేటాయించింది.
గిరిజన యువత ప్రారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి సబ్సిడీ సహాయం కింద అనేక ప్రోత్సాహక పథకాలను అందిస్తున్నది. నిరుద్యోగుల కోసం పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేసింది. గిరిజన గ్రామాలకు మౌలిక వసతులు కల్పిస్తున్నది. గిరిజన ఉత్పత్తులకు మరింత విలువ జోడించేలా సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను నెలకొల్పింది. ‘గిరి పోషణ పథకం’ గిరిజన బాలల ఆరోగ్య రక్షణ కోసం అమలు చేస్తున్న పథకం. గిరిజన సంస్కృతి ప్రతిరూపాలుగా మ్యూజియంలను ఏర్పాటు చేసింది. ఫలితంగా గిరిజన కళలు, చేతిపనులకు ఆదరణ లభిస్తున్నది.
భూమి పుత్రులైన గిరిజనులు తమను అదుకునే నాథుడు లేక ఏండ్లుగా అన్నిరంగాల్లో వెనుకబడి ఉన్నారు. కానీ, నాడు ఉద్యమ నాయకుడుగా, నేడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గిరిజనులకు అన్నిరకాలుగా అండగా నిలుస్తుండటంతో గిరిజన సమాజం అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నది. ఈ మేలును గిరిజన జాతి మరువదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎప్పుడూ తోడునీడగా నిలుస్తామని యావత్ గిరిజన సమాజం మాటిస్తున్నది.
(వ్యాసకర్త: మాజీ పార్లమెంట్ సభ్యులు)
-ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్