నల్లగొండ ఫ్లోరోసిస్ దుఃఖంపై కేసీఆర్ రాసిన పాటలోని కొన్ని చరణాలు వింటే.. మనకిప్పటికీ దుఃఖమాగదు. ‘సూడు సూడూ నల్లగొండా.. గుండెమీదా ఫ్లోరైడు బండా’ అంటూ మొదలయ్యే ఆ పాటలో… ‘కడుపులల్లా నలుసూ మీదా కమ్ముకున్నది విషపూ నీడ.. కన్నతల్లి పాలల్లగూడా తొంగి చూసెను ఫ్లోరైడ్ జాడ…’ ‘వంక జాబిలి చూద్దామంటే వంగిపోయినా నడుములు లెవ్వయి.. కోతి కొమ్మాటలాడాలంటే కుంగిపోయినా కాళ్లూ కదలయ్’ అంటూ కేసీఆర్ తన పరితాపాన్ని పాటగా పంచుకున్నారు.
బీజేపీ నీటి మీద రాతలు
ఎనుకటికి ఎవడో చెప్పిండట.. ‘మా తాత కాలంల చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చేదని. తాత ఉన్నడా అంటే లేడు.. బర్రె ఉన్నదా అంటే చచ్చిపోయిందని చెప్పె. బుడ్డి ఉన్నదా అంటే పలిగిపోయిందనె! బీజేపీ నేతల మాటలు కూడా ఇట్లే ఉన్నయి. ‘అబద్ధాల గురువుకు దొంగ శిష్యుడు’ అన్నట్టుగా ఉన్నది వారి తీరు. రాజకీయాన్ని బొంకులకు మారుపేరుగా మార్చిన బీజేపీ నేతలు తాజాగా కొత్త పల్లవి ఒకటి అందుకున్నరు. అదేమిటంటే… ‘నల్లగొండ- మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించింది బీజేపీయేనట!
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో నిధులిచ్చి ఫ్లోరోసిస్ సమస్యకు పరిష్కారం చూపించారట’! నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్టు… జనం మొహంతో కాదు; ము…తో నవ్వుతారన్న భయం కూడా లేకుండా వీడియో క్లిప్పులు తయారు చేసి వదులుతున్నారు. అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అబద్ధాల గురువుకు దొంగ శిష్యులే దొరుకుతారు కదా! ఏ బొంకైనా బొంకండి ఎన్నికల్లో గెలవడమే ముఖ్యమని ఢిల్లీ పెద్దలే ‘అమితం’గా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నప్పుడు.. కిందివాళ్లు నీతిగా ఉంటారని ఎట్లా అనుకుంటం?!
పాటలు, పైలాన్ల సాక్షిగా కళ్లముందు కనిపిస్తున్నదాన్నే వక్రీకరించడానికి ప్రయత్నించి బీజేపీ నగ్నంగా దొరికిపోయింది. ఫ్లోరోసిస్ వ్యవహారం ఒక్కటి చాలు… వాళ్ల మాటలెంత కల్లో, డొల్లో చెప్పడానికి! ఈ విషయంలో అసలేం జరిగింది? ఒక్కసారి చూద్దాం. హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న మునుగోడులో స్వాతంత్య్రానికి పూర్వమే 1937లో మొట్టమొదటిసారి ఫ్లోరోసిస్ కేసు వెలుగులోకి వచ్చింది. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేనాటికి ఫ్లోరోసిస్ సమస్య తీవ్రతరమైంది. కానీ తెలంగాణకు సంబంధించిన అన్ని సమస్యలనూ పట్టించుకోనట్టే, వలస పాలకులు దీన్నీ పట్టించుకోలేదు. గొంతు దిగడానికి గుక్కెడు మంచినీళ్లు కరువయ్యాయి. దాహార్తిని తీర్చడానికి భూగర్భం నుంచి వచ్చే విషజలమే ఏకైక మార్గమైంది. దశాబ్దాలకు దశాబ్దాలు దుర్దశలో గడిచిపోయాయి. తరాలకు తరాలు అలాగే వంగిపోయాయి. ఫ్లోరైడ్ బాధితుల గోస తీరలేదు. ఒక్కరా ఇద్దరా…జవహర్లాల్ నెహ్రూ హయాం నుంచి నేటి నరేంద్ర మోదీ కాలం దాకా.. 14 మంది ప్రధానులు పరిపాలించారు. 15 మంది రాష్ట్రపతులు పదవినెక్కి దిగారు. ఉమ్మడి రాష్ర్టానికి 16 మంది ముఖ్యమంత్రులుగా వెలగబెట్టారు. కానీ మునుగోడు గొంతులో గుక్కెడు మంచి నీళ్లు పోయాలని ఆలోచన చేసినవాడు ఒక్కడంటే ఒక్కడూ లేడు. నల్లగొండను తడిమినోడు లేడు.
ఫ్లోరోసిస్‌ను తరిమినోడు లేడు. ప్రధానులు గుజ్రాల్, చంద్రశేఖర్ మొదలుకొని వాజ్‌పేయి దాకా, రాష్ట్రపతులు శంకర్‌దయాళ్ శర్మ నుంచి అబ్దుల్ కలాం దాకా అందరినీ ఫ్లోరోసిస్ బాధితులు కలిశారు. ఉమ్మడి రాష్ర్టాన్ని ఉద్ధరించాడని ఊదరగొడుతున్నారు కదా… అలాటి ముఖ్యమంత్రి వైఎస్‌కే వారు 25 వినతి పత్రాలు సమర్పించారు. చంద్రబాబు చెవిలో ఇల్లు కట్టుకుని పోరారు. తమ బాధలు చూసి పాలకుల గుండె కరుగుతుందని భ్రమపడి, వంగిపోయిన కాళ్లు చేతులతోనే ప్రతి నాయకుడి తలుపూ తట్టారు. ఢిల్లీల ధర్నాలు చేసారు. కోర్టుల్లో పిటిషన్లు వేసారు. ఒక్కొక్కడూ ఒక్కొక్క సానుభూతి వచనం వినిపించారు. ఆర్వో ప్లాంట్లు అన్నాడొకడు. ఆయుర్వేదం అన్నాడు మరొకడు. కేంద్రం ‘కంటామినేషన్ నిధులిస్త’దన్నాడు ఒకడు. నెదర్లాండ్స్ ఫండ్స్ అన్నాడు మరొకడు. వాటర్ షెడ్‌తో మంచి వాటర్ ఇస్తానన్నాడు వేరొకడు. డిండి ప్రాజెక్టు అయిపోతే పుష్కలంగా మంచినీళ్లంటూ కొందరు డిండిమ భట్లు చెప్పారు. అందరూ వెళ్ళి చూసి కుండల కొద్దీ కన్నీళ్లు కురిపించేవారే తప్ప గుక్కెడన్ని మంచినీళ్లు ఇచ్చిన వారు లేరు. చివరికి ఫ్లోరోసిస్ ప్రాంతం రాజకీయ టూరిస్టులకు పర్యాటక ప్రాంతంగా, పత్రికలకు మానవీయ కథనాల ముడిసరుకుగా మారిపోయింది.
ఊదు కాలదు, పీరు లేవదు’ అన్నట్టు ఎవరూ చేసింది ఏమీ లేదు. కారణం.. మూల జలమే విషమైనప్పుడు ఎన్ని మందులు కలిపితే ఏం లాభం? ‘బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత’ అంటూ ఒకొక్కడూ ఒక్కో స్కీం పేరు చెప్పి కాలం గడిపారు. సమస్య భూగర్భంలో ఉంటే ఉపరితల జలం వైపు చూడాల్సింది పోయి, ఆకాశంలో పథకాలు వేసారు. ఫ్లోరోసిస్ పరిష్కారానికి వినూత్న పథకాల పేరిట, దొరికినంత మేర మింగిన దొంగలూ ఉన్నారు. వాళ్లకు ఫ్లోరోసిస్ బాధితుల ఉసురు తప్పక తగిలింది!!
ఇక బీజేపీ ప్రచారం విషయానికి వద్దాం. వాజ్‌పేయి ప్రభుత్వం ఉన్నది 1998 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం దాకా! ప్రధానిగా వాజ్‌పేయి చివరి దశలో అంటే 2003 మార్చి 12న నల్లగొండ జలసాధన సమితి ఆధ్వర్యంలో ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామిని ఢిల్లీకి తీసుకుపోయారు. ప్రధానమంత్రి వాజ్‌పేయి ముందు టేబుల్ మీద పండుకోబెట్టారు. ‘అయ్యా ఇదీ మా గతి. ఆదుకోండి’ అని వేడుకున్నారు. ‘మీకు ఏమి కావాలి’ అని వాజ్‌పేయి తెలుగులో అడిగారు. ‘మంచి నీళ్లు కావాల’ని స్వామి అడిగిండు. స్వామి అడిగింది…. సంస్కరణల పేరుతో బీజేపీ అప్పుడూ ఇప్పుడూ అమ్మకానికి పెట్టిన విమానాశ్రయాలు కాదు, రైళ్లు కాదు, ఓడ రేవులు కాదు, ఎల్ఐసీ కాదు. స్వామి అడిగింది కేవలం మంచి నీళ్లు! మనిషికి ప్రాణాధారమైన, ప్రాథమిక హక్కు అయిన మంచి నీళ్లు! వాజ్‌పేయి సరే అన్నారు. స్వామికి సంబురమైంది. అందరి మొహాలూ వెలిగినయి. ఆ షో అక్కడితో ముగిసింది. తర్వాత ఏమైంది? ఏమీ కాలేదు! సమస్య అక్కడే ఉన్నది. తర్వాత కేంద్రం పట్టించుకున్నదీ లేదు. మునుగోడుకు రూపాయి వచ్చిందీ లేదు. తర్వాత ఏడాదికే ఎన్డీయే ఎన్నికలో ఓడిపోయి, వాజ్‌పేయి గద్దెదిగారు. తర్వాత 2004 నుంచి 2014 దాకా ప్రధాని మన్మోహన్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం రాజ్యమేలింది! అప్పుడు తెలంగాణ పరిస్థితి.. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడడం వంటిదే!
వాజ్‌పేయి గద్దెదిగడానికి సరిగ్గా మూడేండ్ల ముందు.. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే… అంటే 2001లోనే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. అస్తిత్వ జెండా ఎత్తిన రెండేండ్లకే అంటే, 2003లోనే కేసీఆర్ ‘ఫ్లోరైడ్పై పోరుయాత్ర’ పేరిట నల్గొండలో పాదయాత్ర చేశారు. వాజ్‌పేయికి వినతిపత్రం ఇచ్చిన సమయం, కేసీఆర్ పోరుయాత్ర చేసిన సమయం దాదాపుగా ఒకటే. చౌటుప్పల్, నారాయణపురం, కొత్తగూడెం, వావిళ్లపల్లి, అంతంపేట, మర్రిగూడ, నాంపల్లి, చండూరు, కనగల్ మీదుగా నల్గొండకు ఆయన పాదయాత్ర సాగింది. మర్రిగూడెంలోని అనంతరెడ్డి ఇంట్లో ఆయన రాత్రి బసచేశారు. ఆ రోజు రాత్రి మళ్లీ తరువాత రోజు ఉదయం శివన్నగూడెంలో అంశాల స్వామి సహ పలువురు ఫ్లోరోసిస్ బాధితులతో మాట్లాడారు. జలసాధన సమితి నాయకుడు దుశ్చర్ల సత్యనారాయణ, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి నాయకుడు కంచుకుంట్ల సుభాష్ మొదలైన వారితో సుదీర్ఘంగా చర్చించారు. ఫ్లోరోసిస్ బాధితుల జీవితాలను చూసి కేసీఆర్ చలించిపోయారు. నడుములు వంగీ.. బొక్కలు వంకరపోయిన జీవితాలను చూసి కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఆ కన్నీళ్లే ఆయన కలంలో సిరాగా మారాయి. ఆయన ఆర్తి, బాధితుల వేదన కలగలసి పాటగా రూపుకట్టాయి.
తెలంగాణ ఉద్యమ ఆరంభంలోనే ఆయన దీన్ని సీరియస్ అంశంగా భుజానికెత్తుకున్నారు. ఫ్లోరైడ్పై పాటలతో ప్రత్యేక క్యాసెట్లు రూపొందించి ఊరూరా నగారా మోగించారు. కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ మరోసారి 2006 నవంబర్‌లో మర్రిగూడకు వచ్చారు. బాధితులతో సమావేశం అయ్యారు. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట కార్యాలయాన్ని సందర్శించారు. మూడు గంటలు అక్కడే గడిపి చర్చలు జరిపారు. ‘ఫ్లోరోసిస్ మహమ్మారిని పారద్రోలాలని అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న సుభాష్‌కు హాట్స్ ఆఫ్. వికలాంగులుగా శారీరక, మానసిక పరంగానే కాకుండా ప్రవృత్తిలో కూడా ప్రస్ఫుటంగా కనిపించే ఈ అవిటితనాన్ని రూపుమాపాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా 200 టీఎంసీల కృష్ణా జలాలు నల్గొండకు ఇచ్చి మాతృభూమిని పూర్తిగా కడిగివేయాలి’ అని ప్రతిస్పందించారు. అంతేకాకుండా ‘నల్లగొండ నగారా’ పేరుతో ఏప్రిల్ 24, 2007న నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఫ్లోరైడ్పై యుద్ధాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా కేసీఆర్ సందర్భం వచ్చిన ప్రతిసారీ నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను గుర్తుచేసుకుంటూనే ఉంటారు.
ఏ కృష్ణానీళ్లు అయితే నల్గొండ ఫ్లోరైడ్‌ను దూరం చేస్తాయని ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ భావించారో.. అదే కృష్ణానీటితో నల్గొండ గొంతుతడిపే భగీరథ యజ్ఞానికి ఆయన శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సరిగ్గా ఏడాదికి… మునుగోడు నియోజకవర్గానికి వచ్చిన ఆయన చౌటుప్పల్‌లో జూన్ 8, 2015న మిషన్ భగీరథ పైలాన్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రమంతటా మంచినీళ్లివ్వాలని భావించిన కేసీఆర్ దానికి ఆరంభంగా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాన్నే ఎంచుకున్నారు. ఆ తర్వాత దశలవారీగా మునుగోడు ప్రాంతంలో ఇంటింటికీ మంచినీళ్ల పథకం అమల్లోకి వచ్చింది. వాటర్‌గ్రిడ్‌గా మొదలైన ఈ పథకమే ‘మిషన్ భగీరథ’గా రూపాంతరం చెంది రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నది.
జరిగింది ఇది. ఇందుకు సాక్ష్యంగా అక్కడ కేసీఆర్ పర్యటించిన, ఫ్లోరోసిస్ బాధితులతో సమావేశమైన, రోడ్‌షో నిర్వహించిన ఫొటోలున్నాయి. ఫ్లోరైడ్ విముక్తి కార్యాలయంలో చేసిన సంతకం ఉంది. ముఖ్యమంత్రిగా ఆవిష్కరించిన భగీరథ పైలాన్ ఉంది. ఇప్పుడు ఇంటింటికీ నీళ్లు ఇస్తున్న భగీరథ నల్లాలున్నాయి. రోజూ మంచి నీళ్లు తాగుతూ కేసీఆర్‌ను స్మరించుకుంటున్న మునుగోడు ప్రజలున్నారు. వాస్తవం ఇదైతే… వాజ్‌పేయి ప్రధానిగా స్పందించిందెప్పుడు? మానవత్వం చూపిందెప్పుడు? సమస్య అప్పుడే పరిష్కారమైపోయి ఉంటే.. 2003లో కేసీఆర్ అక్కడ పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముండె? పాట కట్టి పాడాల్సిన అగత్యం ఏముండె? ఒకవేళ కేసీఆర్ అబద్ధమే చెప్తున్నాడని అనుకుందాం… మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్యే లేకుంటే… మరి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో శాసనసభా బృందం అక్కడ ఎందుకు పర్యటించింది? 2020 జనవరిలో కేంద్ర జల్‌జీవన్ మిషన్ టాస్క్‌ఫోర్స్ బృందం తెలంగాణలో పర్యటించింది. అందరికీ మంచినీరు లక్ష్యాన్ని తెలంగాణ సాధించిందని కితాబిచ్చింది. మరి ఇది మా వాజ్‌పేయి ప్రభుత్వమే చేసిందని అది ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే 2004లోనే వాజ్‌పేయి శకం ముగిసింది. ఆయన ప్రభుత్వం మునుగోడుకు చేసిందేమీ లేదు.
ఇక 2014లో తెలంగాణ ఏర్పాటు నుంచి ఏడాది పాటు రాష్ర్టాన్ని చక్కదిద్దే పనిలో పడ్డ కేసీఆర్ మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టిన 2015 జూన్ దాకా కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. ప్రధాని శ్రీమాన్ నరేంద్ర మోదీ! ఆయన ప్రభుత్వం ఆ ఏడాది కాలంలో మునుగోడునుగానీ, ఫ్లోరోసిస్ బాధితులనుగానీ పట్టించుకున్న దాఖలా లేదు. రాష్ట్రపతి ప్రసంగంలోగానీ, ప్రధాని ఎర్రకోట స్పీచ్లోగానీ, తొలి బడ్జెట్లోగానీ ఎక్కడా ఫ్లోరోసిస్ ప్రస్తావనే లేదు. కేసీఆర్ మునుగోడులో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకాన్ని మోదీ స్వయంగా స్థాపించిన నీతి ఆయోగ్ ప్రశంసించి, తెలంగాణలో దీని అమలుకు రూ.19వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. అయినా మోదీ నయా పైసా ఇచ్చిన పాపాన పోలేదు. తెలంగాణ వచ్చి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాతనే కదా ఫ్లోరైడ్ పీడ విరగడైంది. మునుగోడే కాదు, భగీరథతో మారుమూల గిరిజన తండాలతోపాటు ప్రతి ఊరికీ.. ఇంటింటికీ మంచినీళ్ళు ఇచ్చింది కండ్ల ముందు కనబడ్తలేదా? ఆదిలాబాద్‌లో గిరిజనుల వ్యాధులు, నల్లగొండలో ఫ్లోరోసిస్ బాధలు పోయింది భగీరథ నీళ్ళతో కాదా?
వాజ్‌పేయి గద్దెదిగిన తర్వాత పదేండ్లకు తెలంగాణ ఏర్పడింది. 12-13 ఏండ్లకు మునుగోడులో మిషన్ భగీరథ మొదలైంది. పైలాన్ ప్రారంభించే 2015 నాటికే వాజ్‌పేయి, వయోభారంతో ప్రాపంచిక విషయాలను పట్టించుకోలేని స్థితిలో అంపశయ్యపై ఉన్నారు. ఆయన పేరు మీద అబద్ధాలు ఆడడానికి బీజేపీ నేతలకు కొంచమైనా సిగ్గుండాలి. ఆయన ఆత్మ క్షోభిస్తుందన్న పాపభీతి కూడా లేదు వారికి. అబద్ధాన్ని అతికినట్టు చెప్పే తెలివికూడా లేదు. బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్టు, ఇవ్వని మంచినీళ్లను, లేని వాజ్‌పేయి మానవత్వమనడం బీజేపీ నేతల అజ్ఞానమా? అతి తెలివా? ‘పింఛన్లను కేంద్రమే ఇస్తున్నది. ఇండ్లను కేంద్రమే ఇస్తున్నది. కల్యాణ లక్ష్మిని కేంద్రమే ఇస్తున్నది’… ఇలా అబద్ధాలు చెప్పీచెప్పీ బీజేపీ నేతలకు అబద్ధాలు అలవాటైపోయాయి. ‘అకటా వికటపు రాజు, తన సోయి తానెరుగని బంటు.. ’ ఇదీ బీజేపీ నాయకుల పాలనా తీరు. అందుకే నోటికొచ్చిన అబద్ధాలు ఆడుతున్నారు. ఆ క్రమంలోనే ఫ్లోరోసిస్‌పై అబద్ధమాడి అడ్డంగా దొరికిపోయారు. ఇదొక్కటి చాలు.. వాళ్లు చెప్పే మాటల్లో నీతి ఎంతో.. నిజాయతీ ఎంతో!
విముక్తి లభించింది ఇలా…
1937
హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న నల్లగొండలో మొట్టమొదటి ఫ్లోరోసిస్ కేసు వెలుగులోకి వచ్చింది. అప్పటి పరిమిత వైద్య సదుపాయాలు, పరిశోధనల దృష్ట్యా ఈ సమస్య నివారణకు పెద్దగా అడుగులు పడలేదు.
1948
భారతదేశంలో హైదరాబాద్ విలీనమైంది. ఆ తర్వాత ఎనిమిదేండ్లకు 1956లో ఆంధ్ర, హైదరాబాద్ రాష్ర్టాలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. కృష్ణా నది పక్కనే ఉన్నా కూడా నల్లగొండ వాసులకు ఫ్లోరోసిస్ పీడ తప్పలేదు. ఏండ్లు గడుస్తున్నా కొద్దీ ఆ సమస్య బాధితులు పెరిగిపోవటం ప్రారంభించారు. అయినా కూడా ఉమ్మడి రాష్ట్ర పాలకుల మనసు కరుగలేదు. సమస్య నిర్మూలనకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఫ్లోరోసిస్ నుంచి విముక్తి కోసం ఉద్యమాలు మొదలయ్యాయి.
2003
ఫ్లోరోసిస్ నుంచి రక్షించాలని కోరుతూ మార్చి 12న ఢిల్లీలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయిని జలసాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ, ఫ్లోరైడ్ విముక్తి పోరాట సమితి అధ్యక్షుడు కంచుకంట్ల సుభాష్ నేతృత్వంలో బాధితులు కలిశారు. వాజ్‌పేయి ముందున్న టేబుల్ మీద ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామిని పడుకోబెట్టారు. మరో బాధితుడు కొత్తపల్లి నర్సింహను ఎత్తుకొని నిలబెట్టారు. సమస్యను కళ్లకు కట్టారు. వాజ్‌పేయి వారి గోడు విన్నారు కానీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
2004-14
వాజ్‌పేయి హయాం ముగిసింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఓడించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వాలు, పాలకులు మారారుగానీ, నల్లగొండ ఫ్లోరోసిస్ సమస్య మాత్రం మారలేదు. యూపీఏ కూడా ఆ తానులో ముక్కే అని రుజువైంది.
2001
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ ఏప్రిల్ 27న ఆవిర్భవించింది. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్ తెలంగాణ అంతటా పర్యటించారు. తెలంగాణ వాసుల కష్టాలను స్వయంగా తెలుసుకుంటూ ఊరూరా తిరిగారు.
2003
వాజ్‌పేయి హయాం ముగింపు దశ. ‘ఫ్లోరైడ్పై పోరుయాత్ర’ను కేసీఆర్ ప్రారంభించారు. నల్లగొండలో పాదయాత్ర చేశారు. చౌటుప్పల్, నారాయణపురం, కొత్తగూడెం, వావిళ్లపల్లి, అంతంపేట, మర్రిగూడం, నాంపల్లి, చండూరు, కనగల్ మీదుగా నల్లగొండకు ఆయన పాదయాత్రసాగింది. శివన్నగూడెంలో అంశాల స్వామితోపాటు పలువురు ఫ్లోరోసిస్ బాధితులతో మాట్లాడారు. కన్నీటి పర్యంతం అయ్యారు. దుశ్చర్ల సత్యనారాయణ, కంచుకుంట్ల సుభాష్ తదితరులతో చర్చించారు. ప్రజాచైతన్యాన్ని కూడగట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా తానే స్వయంగా పాటరాశారు. స్వరాష్ట్రం సాధించుకుంటేనే ఈ పీడ వీడుతుందని ఎలుగెత్తి చాటిచెప్పారు.
2006
కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ నల్లగొండలోని మర్రిగూడకు నవంబర్‌లో వచ్చారు. ఫ్లోరైడ్ బాధితులతో సమావేశం అయ్యారు. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న సందర్శకుల పుస్తకంలో ఇలా రాశారు. ‘మనుష్యుల ప్రాథమిక హక్కు, మౌలిక అవసరమైన త్రాగు, సాగునీరు అందించి ఫ్లోరోసిస్ మహమ్మారిని పారద్రోలాలని అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న సుభాష్‌కు అభినందనలు. శారీరక, మానసికపరంగానే కాకుండా ప్రవృత్తిలో కూడా ప్రస్ఫుటంగా కనిపించే ఈ అవిటితనాన్ని రూపుమాపటం తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారానే సాధ్యం. 200 టీఎంసీల కృష్ణా జలాలను తీసుకొచ్చి నల్గొండ మాతృభూమిని పూర్తిగా కడిగివేయాలి’.
2007
‘నల్లగొండ నగారా’ పేరుతో ఏప్రిల్ 24న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించారు కేసీఆర్. ఫ్లోరైడ్పై యుద్ధాన్ని ప్రకటించారు. స్వరాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిషన్ భగీరథతో నల్లగొండ ఫ్లోరోసిస్ సమస్యను రూపుమాపే వరకూ ఏ సందర్భంలోనూ ఆ సమస్యను కేసీఆర్ మరువలేదు.
2015
తరతరాలుగా, దశాబ్దాలుగా అనుభవించిన నల్లగొండ దుఃఖాన్ని శాశ్వతంగా దూరం చేయటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథకు అంకురార్పణ చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌లో జూన్ 8న పైలాన్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ వాటర్‌గ్రిడ్‌గా మొదలైన పథకమే మిషన్ భగీరథగా రూపాంతరం చెంది రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించి, దేశానికే ఆదర్శంగా నిలిచింది.
2020
1 ఏప్రిల్ 2015 నాటికి తెలంగాణలో 967 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు ఉండగా, 1 ఆగస్టు 2020 నాటికి ఆ సంఖ్య సున్నాకు చేరుకుందని, అంటే ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామం తెలంగాణలో ఒక్కటి కూడా లేదని కేంద్ర జల్‌శక్తి సహాయమంత్రి రతన్‌లాల్ కటారియా లోక్‌సభలో (సెప్టెంబర్ 18న) ప్రకటించారు. ఫ్లోరైడ్ పీడ నుంచి, బతుకులను బుగ్గి పాలు చేసిన సమస్య నుంచి నల్లగొండ విముక్తి సాధించింది. సమకాలీన చరిత్రలో మానవ ప్రయత్నంతో జరిగిన ఒక మహాద్భుతం ఇది.
ప్రజలు గొర్రెలని, తాము చెప్పినట్టల్లా పుర్రెలూపుతారని, కల్లబొల్లి కబుర్లు చెప్పి మాయచేయవచ్చని బీజేపీ వాళ్లు భ్రమపడుతున్నారు. ఏది చెప్తే అది నమ్మడానికి ప్రజలు గొర్రెలు కాదుమునుగోడు ప్రజలు చైతన్యవంతులు! తెలంగాణ పులి బిడ్డలు! రేపటి ఎన్నికల్లో ఇది రుజువు కావడం తథ్యం!! అవునా.. కాదా!
-నూర శ్రీనివాస్
91827 77011