మార్నింగ్ వాక్‌లో పరిచయమైన ముస్తాబాద్‌కు చెందిన షావుకారు అంజయ్య నాలుగు రోజుల తర్వాత కనిపించాడు. కుశల ప్రశ్నల తర్వాత కన్నీళ్లు కార్చుతున్నాడు. ఏమైంది అంజయ్య అని అడిగితే… అది ఏడుపు కాదు, నా ఆనందబాష్పాలు అన్నాడు. ఇరువై ఏండ్ల కింద పోయిందనుకున్న నా అర ఎకరం భూమి కేసీఆర్ ధరణి పోర్టల్ పుణ్యమాని నాకు తిరిగివచ్చింది. ఆ భూమి ధర ఈ రోజు 30 నుంచి 40 లక్షలు పలుకుతున్నదంటూ ఎంతో ఆనందపడిపోతున్నాడు. ఇదొక యదార్థ విషయం.
ఒక కొత్త రాష్ట్రంలో ఎనిమిదేండ్లలో సాధించిన విజయాలు దేశంలో ఎందుకు సాధించలేం. 24 గంటల విద్యుత్ సౌకర్యం, రైతుబంధు, రైతుబీమా, పల్లెప్రగతి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, దళితబంధు లాంటి అనేక పథకాలతో పాటుగా సాగునీరు, తాగునీరు కోసం ఒక శాశ్వత పరిష్కారం మార్గం చూపించి అమలు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు.
ఎనిమిదేండ్ల తెలంగాణలో ఒక్క పింఛన్ మినహా అన్నీ కొత్త పథకాలే. పింఛన్ సొమ్ము కూడా రూ.2,016లకు పెంచింది. కొత్తగా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు, పైలేరియా, హెచ్ఐవీ, డయాలిసిస్ రోగులకు కూడా ప్రభుత్వం పింఛన్ ప్రకటించింది. గుంపు లో గోవిందం వలె కాకుండా దేశంలో ఇలాంటివారిని కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి పింఛన్ ప్రకటించడం ఒక కొత్త విధానానికి స్వాగతించినట్లుగా ఉన్నది. పింఛన్ సొమ్ము కోసం ప్రతి నెల 45 లక్షల మంది ఎదురుచూస్తుంటారు. ఈ సొమ్ము వారికి మామూలు అవసరం కాదు, ప్రాణంతో సమానం.
కేసీఆర్ ‘భారత్ రాష్ట్ర సమితి’ ఆషామాషీగా ప్రారంభించలేదు. 140 కోట్ల మంది ప్రజలకు మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను వివరించడంతో పాటుగా సంక్షేమ పథకాల ఆవశ్యకతను వివరించడానికి బయల్దేరుతున్నారు.
కొత్త రాష్ట్రంలో, ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణలో సాధించిన విజయాలు దేశంలో ఎందుకు సాధించలేం. 24 గంటల విద్యుత్ సౌకర్యం, రైతుబంధు, రైతుబీమా, పల్లెప్రగతి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, దళితబంధు లాంటి అనేక పథకాలతో పాటుగా సాగునీరు, తాగునీరు కోసం ఒక శాశ్వత పరిష్కార మార్గం చూపించి అమలుచేయడానికి బయల్దేరుతున్నారు. గత ఎనిమిదేండ్లుగా తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా చర్చలకు దారితీశాయి. ఇప్పటికే తెలంగాణలో అమలవుతున్న పథకాలు ‘రైతు బంధు’ను పీఎం కిసాన్ యోజన, ‘మిషన్ భగీరథ’ను హర్ ఘర్ జల్ అని, ‘మిషన్ కాకతీయ’ను ‘ఆజాదీ కా అమృత్ సరోవర్’, ‘ధరణి’ని పీఎం స్వమిత్వ అని, ‘కల్యాణలక్ష్మి’ని ‘లార్డ్లీ లక్ష్మియోజన’ పేరుతో కేంద్రం అమలుచేస్తున్నది.
29 రాష్ర్టాలున్న భారతదేశంలో బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ రాష్ర్టాలు ఇంకా వెనకబడి ఉన్నాయి. ఈశాన్య భారతంలోని మిజోరం, మణిపూర్, మేఘాలయల్లోని గిరిజన తెగలకు ప్రత్యేకించిన పథకాల్లేవు. 75 ఏండ్ల భారతంలో విద్య, వైద్యం అన్ని గ్రామాలకు ఇంకా చేరలేదు. దేశంలో కాంగ్రెస్, జనతా, నేషనల్ ఫ్రంట్, బీజేపీ ప్రభుత్వాలని ప్రజలు చూశారు. 18 మంది ప్రధానమంత్రులను చూశారు. రాజకీయ సమీకరణలతోనే ప్రభుత్వాల కాలం గడుస్తుంది. రైతులు తమ పంటలకు కనీస మద్దతు కోసం కొట్లాడుతున్నారు. చదువుకున్న నిరుద్యోగులు లక్షల్లో ఉన్నారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన ఈ జిడ్డును తొలగించాల్సిన అవసరం ఉన్నది. ఈ జిడ్డు పోవాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది. 130 కోట్ల మందికి ప్రయోజనం కలిగించే అనేక పథకాలు, ప్రాజెక్టులు కేసీఆర్ మదిలో ఉన్నాయి. తెలంగాణ వస్తే, ఈ పథకాలను ఎలా అమలుచేయాలనుకున్నారో అలాగే, బీఆర్ఎస్ వస్తే భారతదేశ ప్రజలకు కొత్త పథకాలు, కొత్త విధానాలను అమలుచేసి తీరాలనుకునే సాహసి కేసీఆర్.
సముద్రంలోకి వృథాగా పోయే నీటికి అడ్డుకట్ట వేసి సాగు, తాగు నీటి కష్టాలకు తెరదించగలిగే నాయకుడు కేసీఆర్. దేశంలోని సుమారు ఆరు లక్షల గ్రామాల్లో ‘పల్లె ప్రగతి’ లాంటి పథకాలు అమలు జరిగితే దేశంలోని అన్ని గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయి. గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ అమలుచేసినట్లుగానే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గుజ్జర్లు, గడ్డీలు, బకర్వాలాలు, షెర్పాలకు స్థానికంగా ఉండే గొర్రెలను, మేకలను మంజూరు చేయడం వల్ల లక్షలాది మంది బాగుపడతారు. తెలంగాణలో అమలవుతున్న 24 గంటల విద్యుత్ సౌకర్యం, మైనారిటీ గురుకులాలు, నేతకార్మికుల కోసం ఐదు లక్షల ఉచిత బీమా, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, హరితహారం పథకం, టీఎస్ఐపాస్ లాంటి దమ్మున్న, ధైర్యమున్న పనులు కేసీఆర్ మాత్రమే చేయగలుగుతారు. ఈ పథకాలు దేశంలో అమలు చేసినపుడు దేశ ప్రజల జీవనవిధానాల్లో తప్పనిసరిగా మార్పులు వస్తాయి. ప్రజల్లో కొనుగోలుశక్తి పెరుగుతుంది. దేశ జీడీపీ గరిష్ట స్థాయిలోకి వెళ్తుంది. ఇవన్నీ కేసీఆర్ నాయకత్వంలో ‘భారత్ రాష్ట్ర సమితి’తోనే సాధ్యమవుతుంది. ఇదే కేసీఆర్ ఎజెండా. ఈ ఎజెండాతోనే ‘భారత్ రాష్ట్ర సమితి’ ముందుకుపోవడాన్ని దేశ ప్రజలు అందరూ స్వాగతించాలి.
భారతదేశ నైసర్గిక స్వరూపంపై, పొలిటికల్ మ్యాప్‌పై అనేకమంది నిపుణులతో నెలల తరబడి స్టడీ చేసిన కేసీఆర్ ‘భారత్ రాష్ట్ర సమితి’ పార్టీని ప్రకటించారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో దేశ ఆర్థికవ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతుంది.
-కన్నోజు మనోహరా చారి
79950 89083