నవజాత శిశువుకు తల్లి చనుబాలే స్వచ్ఛమైన, రుచికరమైన అమృతాహారమనే విషయం అందరికీ తెలిసిందే. అయినా కాలుష్యం, రసాయనాల పట్ల పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి స్వచ్ఛమైన తల్లి చనుబాలలో ప్రమాదకర మైక్రోప్లాస్టిక్స్ (5 మిల్లీమీటర్ల కన్న తక్కువ పరిమాణం) అవశేషాలు నిర్ధారణ అయ్యాయని తొలిసారిగా తాజా ‘జర్నల్ పాలిమర్’ పరిశోధనా గ్రంథంలో అచ్చయిన వ్యాసం వెల్లడించింది.
ఈ ప్లాస్టిక్ అవశేషాల దుష్ప్రభావం శిశువులు, తల్లులపై ఏ మేరకు ఉండవచ్చనే పూర్తి వివరాలను విశ్లేషించాల్సి ఉన్నప్పటికీ దీని ప్రభావం లేలేత శరీరాలపై పడటం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. గర్భవతిగా, శిశు జననానంతరం తల్లిలో కలుషిత మైక్రోప్లాస్టిక్ పరిమాణాన్ని తగ్గించడానికి మార్గాలను నిర్ధారించాల్సి ఉన్నది. తల్లి పాలు చేసే మేలుతో పోల్చితే కలుషిత మైక్రోప్లాస్టిక్స్ దుష్ప్రభావం తక్కువగానే ఉండవచ్చని, అయినప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.
పరిశోధనా ఫలితాలు: రోమ్ నగరంలో 34 మంది తల్లుల చనుబాలను సేకరించి విశ్లేషించిన శాస్త్రవేత్తల బృందం 26 మంది తల్లి పాలలో (ప్రసవించిన మొదటి వారంలో) 76 శాతం తల్లి పాలలో మైక్రోప్లాస్టిక్స్ కనుగొన్నారు. తల్లులు తీసుకునే ఆహారం, తాగే శీతల పానీయాలు, పండ్ల రసాల్లోనే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత, పర్యావరణ కాలుష్యం కారణంగా మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి చేరవచ్చునని అంచనా వేస్తున్నారు. గతంలో మానవ గర్భస్థ మావి (హ్యూమన్ ప్లాసెంటా), మానవ రక్తం, ఆవు పాలలో కూడా మైక్రోప్లాస్టిక్స్ 80 శాతం వరకు ఉన్నాయని కనుగొన్నారు. పిల్లలకు పాలు తాగించే ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా పిల్లల్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ చేరవచ్చని తెలుస్తున్నది. పాలిథీన్, పాలీ ప్రొపిలీన్, పీవీసీ ప్లాస్టిక్స్ ద్వారా ఉద్భవించే మైక్రోప్లాస్టిక్స్ అవశేషాలు మానవ శరీరంలోకి ప్యాకేజీ రూపంలో చేరవచ్చని తెలుస్తున్నది. చనుబాలలో 2 మైక్రోన్స్ పరిమాణం కన్న ఎక్కువ పరిమాణం ఉన్న మైక్రోప్లాస్టిక్స్ను మాత్రమే పరిశోధనలోకి తీసుకున్నారని (తక్కువగా ఉన్న మైక్రోప్లాస్టిక్ అవశేషాలను విశ్లేషించడం జరగలేదని) గమనించాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు: మైక్రోప్లాస్టిక్స్ ప్రభావాన్ని పూర్తిగా విశ్లేషించనప్పటికీ తల్లులు తాము తీసుకునే ప్లాస్టిక్ ప్యాకెట్ ఫుడ్స్, డ్రింక్స్, కాస్మొటిక్స్ పట్లనే కాకుండా ధరించే సింథటిక్ వస్ర్తాల ద్వారా కూడా కలుషిత మైక్రో ప్లాస్టిక్స్ శరీరంలోకి చేరే ప్రమాదం ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు. తల్లి పాలను పిల్లలకు ఇవ్వడం అత్యవసరమని, ప్లాస్టిక్ ప్యాకెట్లలోని ఆహార పదార్థాలు, పానీయాల పట్ల తల్లులు, కుటుంబసభ్యులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రపంచ మానవాళితో పాటు ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, విద్యాధికులు, నిపుణులు మైక్రోప్లాస్టిక్స్/కాలుష్యం పట్ల సామాన్య జనానికి, గర్భవతులకు, తల్లులకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉన్నది. నేడు ప్లాస్టిక్స్ సర్వవ్యాప్తమైంది. అతి సున్నితమైన నవజాత శిశువుల శరీరంపై మైక్రోప్లాస్టిక్స్ ప్రభావం ప్రమాదకరంగా మారవచ్చని గమనించాలి. శిశువు తాగే బాటిల్ పాల రూపంలో కొన్ని మిలియన్ల మైక్రోప్లాస్టిక్ కణాలు వారి శరీరంలోకి చేరుతున్నట్లు తెలుస్తున్నది. నానో-పరిమాణ ప్లాస్టిక్స్ శరీరంలో ఉన్నట్లయితే ప్రమాదం అధికంగా ఉండవచ్చని తెలుస్తున్నది.
ప్లాస్టిక్ ప్యాకెట్లలో ఆహారం హానికరం: నీరు, శీతల పానీయాలు, పాల ప్యాకెట్లు, ఆహారపదార్థాలు, వంట నూనెలు, ప్లాస్టిక్ బాటిల్స్, పండ్ల రసాలు, ఔషధాలు లాంటి అనేక పదార్థాలు ప్లాస్టిక్ ప్యాకెట్ల/బాటిల్స్ రూపంలో మన ఇంట్లోకి చేరుతున్నాయి. ప్రతి ఒక్కరు ఏడాదిలో 50 వేల ప్లాస్టిక్ కణాలను (పార్టికిల్స్) పలురూపాల్లో తింటున్నారని తేలింది. అధిక జనాభాతో పాటు పేదరికం, అపరిశుభ్రత, కలుషిత ఆహారం ఎక్కువగా ఉన్న భారత్ లాంటి దేశాల్లో మైక్రోప్లాస్టిక్స్ ప్రభావం అనేక రెట్లు ఉండవచ్చని గమనించాలి. సముద్రజలాల నుంచి పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, వినియోగించే వస్తువుల వరకు ప్రతిచోటా మైక్రో ప్లాస్టిక్ భూతం ఆవహించి ఉన్నది. ఇలాంటి ప్రమాదకర మైక్రోప్లాస్టిక్స్ పట్ల ప్రపంచ మానవాళి జాగరూకతతో ఉండాలి. మన వంతుగా మన కర్తవ్యాన్ని నిర్వహిద్దాం.
(పరిశోధనా గ్రంథం ‘జర్నల్ పాలిమర్’ తాజా సంచికలో ప్రచురిత వ్యాసం ఆధారంగా..)
-డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
99497 00037