దేశంలో ఆర్థిక సమానత్వం సాధించడంలో వ్యవసాయరంగానిదే కీలక భూమిక. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో దేశ సంపద కేవలం కొద్దిమంది చేతిలోనే కేంద్రీకృతమై ఉన్నది. దీంతో 90 శాతం మంది ఇబ్బందులు పడుతున్నారు. 140 కోట్ల జనాభా కలిగిన మనదేశంలో అభివృద్ధి ఫలాలు ఇంకా గ్రామాల్లోకి చేరలేదు. పాలకులు కేవలం పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరిచి స్వాగతిస్తున్నారే తప్ప అట్టడుగు వర్గాలాభివృద్ధికి ఆలోచనలు చేయడం లేదు. అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించకపోవడంతో భవిష్యత్ ఆకలి భారతం కండ్ల ముందు కదలాడుతున్నది.
భారతదేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా ఉపయోగించగల సమర్థవంతమైన నాయకుడు ఈ దేశానికి ఇప్పుడు కావాలి. అప్పుడే దేశం అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధి సాధిస్తుంది. తెలంగాణలో వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరం అని యావత్ ప్రజానీకం ఆశిస్తున్నది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏండ్లు గడుస్తున్నా ఆకలి చావులు, ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏటా 10 లక్షల మంది ఆకలి చావులకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంటున్నది. అంటే ప్రతి నిమిషానికి ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దేశం అపారమైన సహజవనరులను కలిగి ఉన్నది. దేశంలో ఉన్న 80 శాతం భూమిలో 49 శాతం వ్యవసాయ యోగ్యమైన సమశీతోష్ణ వాతావరణంతో కూడుకున్నదే. అయినా వ్యవసాయ రంగం ఇంకా కత్తి మీద సాములాగే సాగుతున్నది. జలవనరులు పుష్కలంగా ఉన్నా, 70 శాతం నీటిని సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల సముద్రంలో కలిసిపోతున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలో వ్యవసాయ యోగ్యమైన, సారవంతమైన భూమి ఉన్నప్పటికీ వ్యవసాయాభివృద్ధి కోసం పాలకులు సరైన విధానాలు చేపట్టకపోవడం విచారకరం. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో 60 ఏండ్లు కాంగ్రెస్ వారే పరిపాలించారు. గడిచిన ఎనిమిదేండ్లుగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కానీ అభివృద్ధి జాడలు మాత్రం కనిపించవు.
దేశంలో అపారమైన ఖనిజ సంపద ఉన్నప్పటికీ అమెరికా చైనా వంటి దేశాలకు దీటుగా ఎదగలేకపోతున్నాం. దీనికి ప్రధాన కారణం అక్కడి పాలకులు చేపట్టిన పాలనాపరమైన సంస్కరణలు మనం చేపట్టకపోవడమే. దేశ ప్రజలకు మౌలిక వసతుల కల్పన విషయంలో ఏ ఒక్క నాయకుడూ ఆలోచించిన దాఖలాల్లేవు. రోజురోజుకు పెరిగిపోతున్న నిరుద్యోగం, వెనుకబడుతున్న వ్యవసాయ, పారిశ్రామికరంగాలకు ప్రధానకారణం చిత్తశుద్ధి లేని పాలకులు, ఒక విజన్ అంటూ లేని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే.
దేశంలోని వ్యవసాయరంగ అభివృద్ధికి రైతుబంధు, ఉచిత కరెంటు వంటి సంక్షేమ పథకాలు చాలా అవసరం. ఈ రెండూ కూడా రైతులను ఆదుకోవడానికి దోహదపడేవే. ముఖ్యంగా గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు పడాలి. వ్యవసాయ రంగానికి ప్రభుత్వపరంగా చేయూతనివ్వడానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందడుగు వేయాలి. అలాంటి ప్రణాళిక వేయగలిగే నాయకత్వం ప్రస్తుత పరిస్థితు ల్లో దేశానికి అవసరం. రాజ్యాంగ వ్యవస్థను రూపొందించిన అంబేద్కరిజం కొత్త పరిపాలనా వ్యవస్థకు అవసరం. దాన్ని ఆచరించి చూపుతున్న కేసీఆర్ లాంటి నాయకుడి అవసరం దేశానికి ఉన్నది. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ యాజమాన్యాల జేబులు నింపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను నిలదీయాల్సి ఉన్నది.
దేశంలో రైతు రాజ్య స్థాపన కోసం, రైతులకు ఉచిత కరెం టు, గిట్టుబాటు ధర కల్పించేవిధంగా ప్రణాళికలు రూపొందించాలి. దేశవ్యాప్తంగా ఒకే విధమైన పంట ధరలను నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇదంతా కేసీఆర్ నాయకత్వంలో జరుగుతుందని ఆశిద్దాం. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేసే దిశగా కేసీఆర్ నాయకత్వాన బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం. ఒక విజన్‌తో ముందడుగు వేస్తున్న కేసీఆర్‌కు దేశవ్యాప్తంగా రైతులందరూ బ్రహ్మరథం పట్టే అవకాశం లేకపోలేదు. దేశంలో మత సామరస్యాన్ని కాపాడటమే కాకుండా ఫెడరల్ రాజ్యాంగవ్యవస్థను అమలుచేసి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను అత్యున్నతస్థాయికి తీసుకురాగలిగే వ్యవస్థను రూపొందించాలి. ఈ దేశంలో వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాలంటే స్వామినాథన్ కమిటీ సూచించిన విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి.
దేశంలో ఒకే రకమైన పంటలు పండించడం రైతులు ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. అలాంటి రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా మెట్ట పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. ఈ తరుణంలో చిరుధాన్యాల సాగు అధిక మొత్తంలో చేపట్టడానికి శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉన్నది.
దేశం ఆర్థికమాంద్యంతో సమస్యలు ఎదుర్కోబోతున్నప్పటికీ కేంద్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది. బీజేపీ పాలకులు ముందున్నది మొసళ్ళ పండుగ అని గుర్తించకపోవడం విడ్డూరం. ఆర్థికమాం ద్యంతో ఆహార కొరత, ఆకలిచావులు తప్పవని ఇప్పటికైనా గ్రహించాలి. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టగల సమర్థవంతమైన కొత్త పార్టీ బీఆర్ఎస్. ‘తెలంగాణ మాడల్’ మూలాలున్న ప్రజారంజకమైన పరిపాలన అందించడానికి బీఆర్ఎస్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం ఉన్నది. ఆ దిశగా ప్రజలు ఆలోచించాలి. బీఆర్ఎస్ను ఆదరించాలి.
(వ్యాసకర్త: పౌర సంబంధాల అధికారి,కాకతీయ యూనివర్సిటీ)
-డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి
98495 77610