రుద్రదేవుడు రణ రుద్రుడు. తన తర్వాత వచ్చిన స్వతంత్ర కాకతీయుల రాజకీయ వ్యూహాలకు, యుద్ధతంత్రానికి మార్గం వేసినవాడు. రుద్రదేవుడి గురించిన చరిత్ర ముఖ్యంగా శాసనాలలోనే దొరుకుతున్నది. రుద్రదేవుడు రాశాడని భావిస్తున్న నీతిసారమనే తెలుగు రచన పూర్తిగా దొరకలేదని అంటున్నారు. రాజనీతిపై ఉన్న ఈ గ్రంథంలో నాటి వాణిజ్యం, పన్నులు, సుంకాలు వంటి ఆర్థిక అంశాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. 17వ శతాబ్దంలో మడిక సింగన రాసిన సకల నీతి సారము అనే గ్రంథంలో రుద్రదేవుడి నీతిసారంలోని పద్యాలు కొన్ని ఉన్నాయని పరబ్రహ్మశాస్త్రి రాశారు. చాలా శాసనాల ద్వారా రుద్రదేవుడి విజయాలతో పాటు నాటి సమాజం, వర్గాలు వంటివి కూడా తెలుస్తాయి.
సాధారణంగా సామంతులు, పాలక వర్గం కట్టించిన గుళ్ళు, మత నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. అయితే రుద్రదేవుడి పాలనలో ఎక్కటీలు అంటే సైనికులు రుద్రేశ్వరాలయాలను కట్టించినట్టు శాసనాలున్నాయి. సిద్దిపేట జిల్లా కొండపాకలో క్రీ.శ.1194 నాటి శాసనం.. 130 మంది ఎక్కటీలు (సైనికులు) కట్టించిన రుద్రేశ్వరాలయానికి దానం చేసిన 12 మర్తరుల భూమి వివరాలు, ‘తూమునాయం’ అనే పన్ను నుంచి ఇచ్చిన మినహాయింపును తెలుపుతుంది. జనగామ జిల్లా ఆకునూరులో దొరికిన శాసనంలో.. ఆకునూరులో ఎక్కటీలు కట్టించిన గుడిని మహామండలేశ్వర కాకతీయ రుద్రదేవ మహారాజు స్వయంగా దర్శించుకుని, దేవుడికే కాదు అక్కడి కొన్ని వర్గాలకు కూడా ఇచ్చిన ఆయం (భూమి దానం) గురించి కూడా ఉంది. అక్కడక్కడ అక్షరాలు అరిగిపోయిన ఈ శాసనంలో గొల్లవారు, కుమ్మరెలు, శ్రీ మంగలె, వసది వారు, సంకటేలు, మాలకర్లు మొదలైన వర్గాల ప్రస్తావన ఉంది.
కృష్ణను గెలుచుకుని…
కందూరు చోడులు కాకతీయుల లాగానే కళ్యాణి చాళుక్యుల సామంతులు మాత్రమే కాదు కృష్ణా పరీవాహక ప్రాంతాన్ని పాలిస్తున్నవారు. ఈ ప్రాంతం మూడు విధాలుగా ముఖ్యమైనది. మొదటిది కృష్ణా పరీవాహక ప్రాంతమైనందున సుభిక్షంగా ఉండి, కోశానికి కావాల్సిన ధనమూ, ధాన్యాన్ని ఇస్తుంది. రెండవది నల్లమల అడవులతోపాటు, కృష్ణా నది తెలంగాణకు, తీరాంధ్ర ప్రాంతానికి మధ్య వ్యూహాత్మక సరిహద్దుగా ఉంది. మూడవది సమానులైన కందూరు చోడుల బలాన్ని తగ్గించి సామంతులుగా చేసుకోవడం. అందుకే రుద్రదేవుడు కందూరు చోడులను ఓడించి వారిని నల్గొండ ప్రాంతంలోని కృష్ణా పరివాహక ప్రాంతానికి పరిమితం చేసిండు. భూభాగాన్ని గెలుచుకోవడమే కాదు కందూరు చోడుల రాకుమార్తె పద్మావతిని పెళ్లి చేసుకుని కయ్యమే కాదు వియ్యంతో కూడా రాజకీయాన్ని నెరిపాడు.
పల్నాటి యుద్ధం
కృష్ణా నదికి దక్షిణాన పల్నాడులో మొదలైన రాజకీయ సంక్షోభం రుద్రదేవుడికి లాభించింది. పల్నాడును పాలిస్తున్న హైహయ వంశ పాలక కుటుంబంలోని వైరం పల్నాటి యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధంలో నలగామ రాజుకు రుద్రదేవుడు (మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా సాహిత్యంలో సంబోధించారు) సహాయం చేసిండని శ్రీనాథుడు ‘పల్నాటి వీరచరిత్ర’లో పేర్కొన్నారు. తొమ్మిది వేల కాలరిబంట్ల (కాల్బలం), నమ్మదగినయట్టి నాయకచయము (సైన్య నాయకులు), ఒక వేయి అశ్వాల (వేయి గుర్రాలు) నొనర ప్రతాపరుద్రుడు పంపించె అన్న వర్ణన పల్నాటి యుద్ధంలో రుద్రదేవుడి ప్రమేయాన్ని స్పష్టం చేస్తుంది. ఈ యుద్ధంలో గెలిచిన నలగామ రాజు రుద్రదేవుడి విస్తరణకు సహాయం చేసినాడు. పల్నాటి యుద్ధానికి ఇంకో రాజకీయ ప్రాముఖ్యత ఉంది. కళ్యాణి చాళుక్యుల పతనం తర్వాత కళ్యాణిపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న కాలాచూరి రాజులు, అప్పుడే ఎదుగుతున్న హోయసల బల్లాలుడు, కృష్ణా-పెన్నా మధ్య భాగాన్ని ఏలుతున్న వెలనాటి దుర్జయులు, కోట (ధరణికోట, నేటి అమరావతి) రాజులూ, గుడిమెట్ట చాగి వంశ పాలకులు.. ఇలా ఎందరో మండలేశ్వరులు పాల్గొన్న యుద్ధం ఇది.
తీరాంధ్రలో విస్తరణ
తీరాంధ్రలో కాకతీయ రాజ్య విస్తరణ క్రీ.శ.1181 తర్వాత మొదలైంది. అప్పుడు ఈ ప్రాంతం ఉత్తరాన సింహాచలం నుంచి దక్షిణాన దర్శి వరకు వెలనాటి రాజేంద్ర చోడుడి ఆధీనంలో ఉంది. క్రీ.శ.1181లో ఇతడి మరణం తర్వాత రుద్రదేవుడు క్రమంగా తీరాంధ్రను గెలుచుకోవడం మొదలుపెట్టాడు. తెలంగాణలోని మల్యాల, కొమురవెల్లి, నతవాడి, విప్పర్ల నాయకులు తీరాంధ్ర యుద్ధాల్లో పాల్గొన్నారు. మొదట కోట నాయకుడు దొడ్డభీముడిని ఓడించి ధరణికోటను గెల్చుకున్నాడు. కొండ పడమటి నాయకుల్ని ఓడించి వెలనాటి రాజ్యపు పశ్చిమ సరిహద్దుల్ని ఛేదించాడు. కృష్ణా తీరంలోని రేవూరు గ్రామాన్ని రుద్రదేవుడు త్రిపురాంతక మహాదేవుడికి కానుకగా ఇచ్చినట్టు క్రీ.శ.1185 నాటి త్రిపురాంతకం శాసనంలో ఉంది. అంటే అప్పటికి తీరాంధ్రలో కాకతీయ అధికారం నెలకొన్నట్టే.
పెరిగిన శైవ ప్రభావం
జైనులుగా మొదలైన కాకతీయ పాలకుల మత విశ్వాసం క్రమంగా శైవానికి మారడం, సామంత కాకతీయులు స్వతంత్ర కాకతీయులుగా మారే క్రమంతో పాటే కనిపిస్తుంది. బౌద్ధం క్షీణించి వైదిక బ్రాహ్మణీయ మతంతోపాటు జైనం ఎదగడం కళ్యాణి చాళుక్యుల కాలం వరకు, అంటే దాదాపు 12వ శతాబ్దం వరకు కొనసాగింది. క్రీ.శ.1090 నాటి కాజీపేట దర్గా శాసనం, బేతరస (బేతరాజు) కాలంలో కాలాముఖ శైవానికి ప్రాముఖ్యత పెరగడాన్ని సూచిస్తుంది. స్వతంత్ర కాకతీయ యుగంలోని ఐదుగురు పాలకులు అందరి పేర్లు శివునికి సంబంధించినవి కావడం దీనినే సూచిస్తుంది. రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమ దేవి, ప్రతాప రుద్రుడు- ఇలా అన్ని పేర్లు శివునికి సంబంధించినవేగాక, రణానికీ, రౌద్రానికీ చెందినవి కావడం మధ్యయుగాల్లో విపరీతంగా జరిగిన యుద్ధాలకు కూడా ప్రతిఫలనమే.
డాక్టర్
ఎం.ఎ. శ్రీనివాసన్ , 81069 35000