విద్యుత్ బిల్లు విషయంలో కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. కమ్యూనికేషన్ లైన్లో విద్యుత్ ప్రైవేటీకరణను అనుమతించడం ఈ బిల్లు లక్ష్యంగా ఉంది. ప్రైవేటు కంపెనీలకు లాభాలు పంచి పేదలకు రాయితీలను దూరం చేసేలా ఉంది. విద్యుత్తు రంగంలో కేంద్రం ఆధిపత్యానికి బాటలు పరిచేలా సంస్కరణలు తీసుకొస్తోంది. ప్రజలకు కరెంటు ఛార్జీల షాకును ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం పంపిణీ నెట్‌వర్క్‌ల వినియోగాన్ని అన్ని లైసెన్సుల ద్వారా సులభతరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ బిల్లుతో రాష్ట్రాలకు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థికంగా బలహీనపడతాయి. ఈ విద్యుత్ సవరణ బిల్లు-2022 అమల్లోకి వస్తే ఈ రాయితీలు సాధ్యం కావు.
ఈ బిల్లు ప్రకారం ఒక ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ విద్యుత్ పంపిణీ సంస్థలు ఉంటే యూనివర్సల్ సప్లై ఆబ్లిగేషన్(యూఎస్‌వో) పేరిట ఒక నిధి ఏర్పాటు చేస్తారు. దీన్ని రాష్ర్ట ప్రభుత్వమే నిర్వహిస్తోంది. రాయితీలు ఉండని వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు ప్రైవేట్ కంపెనీల సేవలను వినియోగించుకుంటారు. రాయితీలు పొందే రైతుల వంటి వర్గాల బాధ్యత ప్రభుత్వ సంస్థల మీదనే పడుతుంది. డబ్బు చెల్లించని విద్యుత్ పంపిణీ సంస్థలకు డిస్పాచ్ సెంటర్లు విద్యుత్ సరఫరా చేయకూడదని ఈ బిల్లు చెబుతోంది. ఏదైనా పంపిణీ సంస్థ డబ్బు చెల్లించలేకపోతే విద్యుత్ సరఫరా ఆపివేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు.
దేశంలో కార్పొరేట్ కంపెనీలు భారీ స్థాయిలో సౌర విద్యుత్తు ప్లాంట్లు నడుపుతున్నాయి. వీటికి మేలు చేకూర్చడానికి పునరుత్పాదక విద్యుత్తు కొనుగోలు అభ్యంతరాల నిబంధన తీసుకొచ్చారు. ఈ నిబంధన ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థలు తప్పనిసరిగా కొంత మేరకు పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలి. అలా చేయకపోతే భారీ జరిమానాలు విధిస్తారు. చట్టంలో చాలా క్లాజులకు ‘కేంద్రం నిర్దేశించిన విధంగా’ అని పేర్కొన్నారు. అంటే రేపు చట్టంలో తమకు కావాల్సిన విధంగా కేంద్రం నిబంధనలు రూపొందించుకొని రాష్ట్రాల అధికారాలను హరిస్తుంది. కొన్నేళ్ల తర్వాత నిబంధనల పేరుతో పునరుత్పాదక విద్యుత్తును 50 శాతం కొనమంటే ఇప్పటికే ఉన్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి?
వినియోగదారులు తమకు ఏమైనా సమస్యలు వస్తే ఎవరిని సంప్రదించాలనే విషయమై బిల్లులో స్పష్టత లేదు. విద్యుత్తు డిస్ట్రిబ్యూటర్లను మార్చినప్పుడల్లా వైరింగ్, కనెక్షన్ మార్చాల్సి వస్తుంది. ప్రైవేట్ కంపెనీల రాకతో ప్రభుత్వ పంపిణీ సంస్థలు బలహీనపడితే ఆ ప్రభావం ఉద్యోగుల మీద పడుతుంది. జీతాలు, ఇతర ప్రయోజనాలు ఇబ్బందుల్లో పడతాయి. గతంలో వినియోగదారులకు అతి తక్కువ ధరకు నాణ్యమైన, నిరంతరమైన విద్యుత్‌ను అందిస్తామని చెప్పి ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ పంపిణీ ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టారు. కానీ ఆ కంపెనీలు మెరుగైన ప్రయోజనాలు కలిగించకపోగా ప్రజలపై అధిక ఛార్జీల భారం మోపాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలి.
-నాదెండ్ల శ్రీనివాస్ 9676407140