‘నీళ్లు, నిధులు, నియామకాలు’ ఎజెండాగా తెలంగాణ మలి విడత పోరాటం సాగింది. ఉద్యమ నేత కేసీఆర్ అకుంఠిత దీక్ష, అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఆవిర్భవించింది. మొదటి లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందించే బృహత్తర పథకంలో భాగంగా తెలంగాణ నేలను కృష్ణా, గోదావరి జీవ నదుల ధారలతో తడపాలనే కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం ప్రారంభించి సకాలంలో పూర్తి చేశారు. 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సిద్ధమయ్యారు.
14 లక్షల ఎకరాల ఆయకట్టు: శ్రీరాంసాగర్ నిండాలంటే ఎగువన మహారాష్ట్రలో వర్షాలు సమృద్ధిగా కురువాలి. అక్కడనుంచి వరద వస్తేనే ప్రాజెక్టుకు జలకళ. బాబ్లీ ప్రాజెక్టు కట్టిన తర్వాత శ్రీరాంసాగర్ వట్టిపోయింది. కొన్నిసార్లు మినహా వాన కాలంలో నీరురాక ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జలాశయంలో అన్ని కాలాల్లో నీరుండేందుకు ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకాన్ని ప్రారంభించింది. 2017 ఆగస్టు 10న సీఎం కేసీఆర్ ముప్కాల్ వద్ద ఈ పునరుజ్జీవన పథకానికి శంకుస్థాపన చేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేశారు. వరద రానప్పుడు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం నుంచి గోదావరి నీటిని వెనక్కి తీసుకువచ్చి, వరద కాలువ ద్వారా నీటిని ఎస్సారెస్పీకి మళ్ళించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సకాలంలో పనులు పూర్తి చేసుకొని ట్రయల్ రన్‌కు సిద్ధమవుతున్నది. రెండు వేల కోట్లతో నిర్మించిన ఈ పథకం ద్వారా 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల ద్వారా నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందనున్నది.
కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీటిని జగిత్యాల జిల్లా మల్యాల సమీపంలోని రాంపూర్‌కు తరలించి, అక్కడినుంచి మోటార్ల ద్వారా వరద కాలువలోకి వదులుతారు. మెట్పల్లి సమీపంలోని రాజరాజేశ్వరరావుపేట వద్ద రెండో పంప్‌హౌజ్ ద్వారా మళ్లీ నీటిని ఎత్తి పోస్తారు. అక్కడి నుంచి వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ దాకా నీరు చేరుకోగానే ముప్కాల్ వద్ద కాలువలోంచి పంపుల ద్వారా నీటిని ప్రాజెక్టులోకి ఎత్తి పోస్తారు. అవసరం మేరకు రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 టీఎంసీలు కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి తరలిస్తారు. రాంపూర్, రాజరాజేశ్వరిపేట పంప్‌హౌజ్‌లు పూర్తయ్యాయి. ఇదివరకే ప్రయోగాత్మకంగా రివర్స్ పంపింగ్ ద్వారా ముప్కాల్ వరకు నీరు వచ్చింది. ప్రస్తుతం ముప్కాల్ వద్ద పంప్‌హౌజ్ పనులు పూర్తి కావడంతో నేరుగా ప్రాజెక్టులోకి ఎత్తుకోవడమే మిగిలి ఉన్నది. చుట్టూ ప్రహరీ, అంతర్గత రోడ్లు వేయాల్సి ఉన్నది. ఈ ప్రక్రియ పూర్తయితే తెలంగాణ పచ్చని పంటలతో సస్యశ్యామలంగా మారుతుంది.
రెండు పంటలకు నీళ్లు: శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం ద్వారా బాల్కొండ, జగిత్యాల, వేములవాడ, ధర్మపురి, కరీంనగర్ నియోజకవర్గాల ఆయకట్టులో రెండు పంటలు వేసుకునేందుకు సాగునీరు అందనున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 180పైగా చెరువులకు జలకళ రానున్నది. ఇంతవరకు శ్రీరాంసాగర్ నీళ్లు చూడని జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాలకు సాగునీరు అందనున్నది. ఇప్పటికే పంప్‌హౌజ్‌లో 8 పంపులు, మోటార్లు బిగించారు. ఒక్కో పంపునకు 1,450 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్నది. దీనికి విద్యుత్ అందించడానికి ముప్కాల్‌కు సమీపంలో 220/11 విద్యుత్ ఉపకేంద్రం నిర్మించారు. ఈ వానకాలంలో కాళేశ్వరం నీటిని ఆయకట్టుకు అందించేందుకు శ్రీరాంసాగర్ పునరుజ్జీవం సిద్ధమైంది. వరద కాలువలో ఏడాది పొడవునా నీరు నిల్వ ఉండటం ద్వారా చెరువులు, కుంటలు నింపుకోవచ్చు. భూగర్భ జలాలు పెరుగుతాయి. ప్రాజెక్టు నిండుగా ఉంటే మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది.
(వ్యాసకర్త: పీఆర్టీయూ నాయకులు, నిజామాబాద్)
-అంకం నరేష్
63016 50324