విశ్వవిద్యాలయాలు జ్ఞాన భాండాగారాలు. విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసి మార్గనిర్దేశనం చేసే దిక్సూచీలు. విద్యార్థులను చైతన్యపరుస్తూ దేశ పురోభివృద్ధికి తోడ్పడేలా వారిని కార్యోన్ముఖులను చేసే బృహత్తర బాధ్యత విశ్వవిద్యాలయాలది. పాఠాలు బోధించడమే కాకుండా, దేశ ఔన్నత్యాన్ని, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను భావిభారతానికి అందిస్తూ మార్గ నిర్దేశనం చేసే కీలకమైన బాధ్యత విశ్వవిద్యాలయాలదే.
న్యాయశాస్త్ర విద్యాబోధనే కాకుండా, పారిశ్రామికరంగాల్లో వివిధ స్థాయిల్లో నల్సార్ సేవలందిస్తున్నది. వృత్తిపరమైన న్యాయ నైపుణ్య, మెలకువలను మెరుగుపరుస్తున్నది. ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆయారంగాలకు న్యాయ సమస్యలపై అవగాహనకు వినూత్న కోర్సుల ద్వారా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది.
భారతదేశంలో విలువలు, సంప్రదాయాలు, మానవీయ దృక్పథాలతో కూడిన విద్యాబోధన ఆవశ్యకమైనది. విద్య కేవ లం వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడేదిగా కాకుం డా, సమాజ హితాన్ని కాంక్షించే ఉద్దేశాలతో కూడుకొన్నదిగా ఉండాలి. విద్యార్థులు వివిధ వృత్తుల్లో రాణించే విధంగా, వారిలో దృఢ నిశ్చ యం కలిగించేలా చూడాలి. ఇందుకోసం విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలను సమకూర్చాలి. అస్మదీయ, తస్మదీయ అనే వివక్ష లేని పారదర్శక పాలనను తీసుకురావాలి. నిమ్న, మధ్య, ఉన్నత తరగతి అనే తారతమ్యాల్లేకుండా విద్యార్థుల్లో సమ దృష్టి ఉండేవిధంగా తీర్చిదిద్దాలి. పాశ్చాత్య సం స్కృతి మోజులో పడి కొందరు బాధ్యతారహితంగా, అనైతికంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వర్సిటీల వాతావరణం కలుషితమవుతున్నది. ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దేశకీర్తిని, ఔన్నత్యాన్ని పెంచే విలువలను, సంప్రదాయాలను ప్రోదిచేసే సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో అత్యున్న త లక్ష్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాల యం నల్సార్. తెలంగాణకే కీర్తి కిరీటంలా నిలుస్తున్న ఈ విద్యా సంస్థ న్యాయ శాస్త్ర బోధనలో అత్యుత్తమ సంస్థగా పేరు గడించింది.
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 1998లో హైదరాబాద్‌లోని బర్కత్‌పురాలో చిన్న ప్రాంగణంలో ఏర్పాటైంది. ప్రస్తుతం శామీర్‌పేటలో 54 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్నది. ఈ సుప్రసిద్ధ న్యాయ విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించటం సులభమేం కాదు. ప్రవేశ పరీక్షరాసి ఉత్తీర్ణులు కావటానికి దేశవిదేశాల విద్యార్థులు పోటీ పడుతుంటారు. ఈ విద్యా సంస్థ తెలంగాణలో ఉండటం రాష్ర్టానికి ఒక వరం. న్యాయశాస్త్ర విద్యాబోధనే కాకుండా, పారిశ్రామికరంగాల్లో వివిధ స్థాయిల్లో నల్సార్ సేవలందిస్తున్నది. వృత్తి పరమైన న్యాయ నైపుణ్య, మెళకువలను మెరుగుపరుస్తున్నది. ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తు న్న మార్పులకు అనుగుణంగా ఆయారంగాలలో న్యాయ సమస్యలపై అవగాహనకు వినూత్న కోర్సుల ద్వారా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది.
నల్సార్‌లోని ‘సెంటర్ ఫర్ ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ లా’ విభాగం సేవలకు ఐరాస గుర్తింపు లభించింది. ఐరాస డైరెక్టరీలో ఈ కోర్సును పొం దుపరిచారు. అలాగే ‘సెంటర్ ఫర్ ట్రైబల్ అండ్ ల్యాండ్ రైట్స్’ విభాగం చేస్తున్న కృషి అపారమైనది. తెలంగాణలోని దాదాపు 112 ల్యాండ్, రెవెన్యూ చట్టాలను సమీక్షించి, సవరించి తిరిగి ప్రచురించింది. తెలంగాణ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ యాక్ట్, రూల్స్-2016, తెలంగాణ మున్సిపల్ చట్టం-2019, తెలంగాణ బాలల రక్షణ తదితర చట్టాలను న్యాయ నిపుణులతో రూపొందించింది. ‘పిల్లలు, యువత న్యాయకేంద్రం’ ఎప్పటికప్పుడు బాలల హక్కులు, స్త్రీ సంక్షేమ హక్కుల విధానాలు, ముసాయిదాలు, చట్టాలు, వాటి ని అమలుపరిచే కార్యక్రమాలు చేస్తూ ఆయా రంగాల వారి అభివృద్ధికి తోడ్పడుతున్నది.
స్త్రీ శిశు సంక్షేమశాఖకు, బాల నిందితుల విచారణ విభాగం వారికి జ్ఞాన భాగస్వామిగా ఉంటూ న్యాయపరమైన సూచనలు, సలహాలందిస్తున్నది. రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖలు, న్యాయవాదులు, సర్పంచులకు పారా లీగల్, న్యాయ చట్టాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నది. కేంద్రంలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులతో పాటు ఇతర దేశాల ఉన్నతాధికారులకు కూడా జాతీయ, అంతర్జాతీయ న్యాయచట్టాలపై నల్సార్ శిక్షణ ఇస్తున్నది. ఇలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ, నైపుణ్యాలను పెంచటానికి కృషిచేస్తున్నది.
తెలంగాణలోకి వైమానిక, అంతరిక్ష, రక్షణ, ఔషధ, ఆరోగ్య తదితర రంగాల్లో అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి. ఈ నేపథ్యం లో ఆయా రంగాల వారికి సంబంధించిన న్యాయపరమైన, దౌత్యపరమైన, వివాదాలను పరిష్కరించేందుకు న్యాయశిక్షణ, నైపు ణ్యం తప్పనిసరి. అంతర్జాతీయ న్యాయసూత్రాలు, చట్టాలపై లోతైన అవగాహన అత్యవసరం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో న్యాయ పరిశోధన కేంద్రాలను ఏర్పాటుచేసి అవసరాలకు అనుగుణంగా స్పం దించే న్యాయవ్యవస్థలను నెలకొల్పాల్సిన అవసరం ఉన్నది.(వ్యాసకర్త: న్యాయవాది, న్యాయశాస్త్ర పరిశోధకులు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్)
-కె. శివచరణ్
95158 90088