ఏ రాష్ట్రంలోనైనా ఏ రాజకీయ పార్టీకి అయినా ఒకరే అధ్యక్షులుగా ఉంటారు. కానీ తెలంగాణలో మాత్రం రాష్ట్ర బీజేపీ శాఖకు ఇద్దరు అధ్యక్షులు ఉండటం విశేషం! ఇద్దరేంటి… బండి సంజయ్ ఒకరే కదా ఉన్నది అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మరొక అధ్యక్షులు తెలంగాణ గవర్నర్‌గా పని చేస్తున్న తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర రాజన్! వారిని మరొక అధ్యక్షురాలిగా నేను ప్రస్తావించడానికి సహేతుక కారణాలున్నాయి. రాజ్‌భవన్ వేదికగా గత రెండేండ్ల నుంచి బీజేపీ చేస్తున్న కుట్రల్లో ఆమె భాగస్వామిగా మారిపోయారు. ప్రతిపక్ష నాయకురాలిగా మారి రాష్ట్ర ప్రభుత్వంపై అసంబద్ధ ప్రకటనలు చేస్తున్నారు.
గవర్నర్‌గా మూడేండ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా తమిళిసై సౌందరరాజన్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి తెలంగాణ ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్‌పైనా అనేక విమర్శలు చేశా రు. ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని, ఎట్ హోం కార్యక్రమానికి సీఎం రాలేదని, తన పర్యటనలకు వసతులు కల్పించలేదని వాపోయారు. దేశం మొత్తాన్ని తమ చెప్పుచేతల్లో ఉం చుకోవాలనుకునే బీజేపీ సామ్రాజ్యవాద కాంక్ష లో భాగంగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారనిపిస్తోంది. తమ హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీసే ముఖ్యమంత్రుల మెడపై నిరంతరం కత్తి వేలాడదీయాలని కేంద్రం చూస్తున్నది. రాజ్యాంగ పదవిలో ఉన్న తమిళిసై సౌందరరాజన్ అందుకు అనుగుణంగా రాజ్యాంగేతర శక్తిగా మారి రాజకీయ ఉపన్యాసాలు ఇస్తున్నారు.
బీజేపీయేతర ప్రభుత్వాలున్న చోట గవర్నర్లు ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని రాజ్యాంగ నిపుణులను, ప్రజాస్వామికవాదులను మేధావులు, విద్యావంతులు ప్రశ్నిస్తున్నా రు. బీజేపీ అధికారంలో ఉన్నచోట ఇలాగే వ్యవహరించగలరా అని అడుగుతున్నారు. కొందరు వివిధ కారణాల వల్ల రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు దూరం పెరిగిందని ఊహించుకుంటున్నా రు. కానీ వాస్తవం ఏమిటంటే.. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నచోట బీజేపీ తమ పార్టీ నాయకులను గవర్నర్లుగా నియమించి రాజ్భవన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుస్తున్నది.
తరచూ రాజకీయ ప్రసంగాలు చేయటం మొదలుకొని సెప్టెంబర్ 17న జరపాల్సిన కార్యక్రమంపై వ్యాఖ్యలు చేయడం వరకు తెలంగాణ గవర్నర్ చేస్తున్న పనులన్నీ వివాదాస్పదమే. ప్రతిసారీ నన్ను కాదు, నా పదవిని గౌరవించండని చెప్పే గవర్నర్ ఆ పదవిని ఆసరాగా చేసుకొని అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని గవర్నర్ అర్థం చేసుకోవడం లేదు. పైగా దవాఖానలు, పాఠశాలల్లో వసతులు సరిగా లేవని రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఈ వైఖరిని ఎలా సమర్థించుకుంటారో ఆవిడే వివరణ ఇవ్వాలి. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని బీజేపీ పాలిత రాష్ర్టానికి తరలించారు. గిరిజన విశ్వవిద్యాలయం, ఐటీఐఆర్, ఆయుష్ కేంద్రం, రక్షణ కారిడార్, బయ్యారం స్టీల్ ప్లాంట్… ఇలా చెప్పుకొంటూ పోతే ఒక్క హామీ కూడా కేంద్రం నెరవేర్చలేదు. వీటి గురించి గవర్నర్ కేంద్రాన్ని ప్రశ్నించరు కానీ రాష్ట్ర ప్రభు త్వం అవీ ఇవీ చేయలేదని మాత్రం విమర్శిస్తుంటారు. వివిధ రాష్ర్టాల్లో పలు సందర్భాల్లో గవర్నర్ల వ్యవస్థ మీద అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యవస్థ కొనసాగింపుపై పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయమని ప్రజల నుంచి డిమాండ్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని రాజ్యాంగ రక్షకులు, న్యాయ వ్యవస్థ గుర్తు పెట్టుకోవాలి.
(వ్యాసకర్త : మాజీ ఎమ్మెల్సీ)