మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థి ఎవరన్న రగడను కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఒక కొలిక్కి తెచ్చింది. అయితే, దీని వెనుక పెద్ద కథే నడిచినట్టు సమాచా రం. టికెట్ ఆశించిన అభ్యర్థులతో పాటు రాష్ట్ర ముఖ్యనేతలు ఢిల్లీలోనే కసరత్తు జరిపారు. ఇటీవల ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన ధర్నాకు వెళ్లిన నేతలను టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అక్కడే తన ఇంటికి లంచ్‌కు పిలిచారు. మునుగోడు అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డి అయితే విజయావకాశాలు ఉంటాయని వారికి రేవంత్ రెడ్డి నూరిపోశారు.
ఈ విషయం తెలిసి, రేవంత్ ఇంట లంచ్‌కు వెళ్లిన నాయకులను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిన్నర్‌కు పిలిచి అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి అయితేనే బెటర్ అని చెప్పుకొచ్చారు. అయితే స్రవంతికి టికెట్ కోసం కోమటిరెడ్డి పట్టుబట్టడంలో ఉన్న మతలబు ఏమిటో రేవంత్‌రెడ్డి తమకు ముందే చెప్పడంతో సదరు నేతలు నోరెళ్లబెట్టినట్టు తెలిసింది. వెంకట్‌రెడ్డి ఎంతసేపు పార్టీ గెలుపు కంటే, తన తమ్ముడి గెలుపు కోణంలోనే అభ్యర్థి ఎవరైతే బాగుంటుందో ఆలోచిస్తున్నారని రేవంత్ వారికి చెప్పినట్టుగానే స్రవంతి ఎంపిక జరుగటం కొసమెరుపు.