కనురెప్పల ఇస్రురాళ్ళతో
సీకటినీ యిసిరి
ఆగులమాసై ఎంతా పాకినా
ఆగది అమాసపొద్దు
నెగులనియ్యని
నెర్రెలసూపు అది!
కొంకులు నరికి
పర్రెల పంతను పాతేదే కానీ
గుండె గురిగిలో వెన్నతడి
ఊరనియ్యది!
పీటుకం లేకుంటా పిడాత
బొండిగె పిసుకుడే కానీ
అలిస్టలేని బతుకులలో
ఆత్మలు కుదరనియ్యది…
న్యాల కనుబొమ్మలను
ముడేసుకుంట
తెగిన తొవ్వను అత్తుకుంటూ
నడుస్తున్నాను రేపటి కోసం…
ఇదేమిటి! ఇక్కడ?
వడ్లురాలిన వరిగొల్కల
ఎదలలో ఉట్టి కొయ్యకాళ్ళై
నిలబడి పోయిండు
పంజాకొట్టిన వరిగడ్డికుప్పై
బరబర తగలబడి బూడిదవుతుండు
ఓహో… ఇతను
ఆధునిక మానవుడు అప్డేట్ మనిషి!
లేటెస్టు వర్షన్..!
బంధాలు అనుబంధాలు
ప్రేమలు మరిసి
సానిబ్రమలు ఆన్లైన్లో
వెతుకులాడుతుండు..
-డాక్టర్ పొన్నాల బాలయ్య
99089 06248