కళ్ళల్లో పావురం తిరుగుతున్నది
కొత్తగా రెక్కలొచ్చినట్లు
నందీశుడి భుజాలపై ఎక్కుతూ దిగుతూ
దిగంతాలు దాటి రివ్వురివ్వున ఎగిరినట్లు
అదో రహస్య లోకం.
చీకటే లేని
సువర్ణ కాంతులీనుతున్న బంగారు లోకం
మనువాదపు మాటలు
వినబడని మరో లోకం
ఎటుచూసినా
మానవత్వం నిండిన పూలకొమ్మలు
పుస్తకాలు చెట్లు
ఆ చెట్లపై రహస్యంగా గూళ్ళు కట్టుకొని
అక్షరాల పిల్లల్ని కంటున్న తెల్ల పావురాళ్ళు
అక్కడో బుద్ధుడు
మహమ్మద్ ప్రవక్త
జీసస్ ఆడుకుంటున్నారు
అదొక విజ్ఞానపు బొమ్మలాట
నన్నూ పిలిచి ఆడమంటున్నారు
కానీ వెనక్కి ఎవరో లాగి రెక్కల్ని నరుకుతున్న కల
కళ్ళు తెరిస్తే దేహం సలుపుతున్న దుఃఖపు నది.
నన్ను ఎవరో ప్రశ్నల దండెం మీద
ఆరేసినట్లున్నది
తడి పొడి ఆలోచనలతో
అంతర్మథనం మొదలవుతున్నది
ఎగిసిపడే నిప్పుల నది ఒకటి
మెదడు నుంచి బయల్దేరుతున్నది
కవితల వంతెన వేస్తూ నా కలం కత్తి
రహస్యంగా యుద్ధానికి సిద్ధమవుతున్నది.
-శ్రీతరం
78936 13015