మన దేశం 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రాన్ని సాధించుకున్నది. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. భారతదేశం ఈ విధంగా ప్రజాస్వామ్య దేశంగా ప్రస్థానాన్ని ప్రారంభించినా హైదరాబాద్ రాజ్యం మాత్రం రాచరిక వ్యవస్థగానే ఉండిపోయింది. అనంతరకాలంలో జరిగిన ఉద్యమాల ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ కూడా భారతదేశంలో విలీనమై ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేసింది.
జాతీయోద్యమంలో పూర్వ హైదరాబాద్ స్టేట్ (రాజ్యం) ప్రజలు నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకమైనది. దాశరథి గారన్నట్లు భారత స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ వ్యతిరేక పోరాటమే గాక మధ్య యుగాల నాటి రాచరికం నుంచి స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం హైదరాబాద్ స్టేట్ ప్రజలు చేసిన పోరాటం కూడా గొప్పది. ఈ పోరాటంలో ప్రజలు, కవులు, మేధావులు, కళాకారులు చేసిన త్యాగాలు మనకెప్పటికీ స్ఫూర్తిదాయకం. భూస్వామ్య వ్యవస్థ తాలూ కు దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా కుల మతాలకు అతీతంగా ఇక్కడి ప్రజలు ఐక్యంగా పోరాడిన తీరు ఆదర్శనీయం.
బ్రిటిష్ వారు ప్రతి విషయంలోనూ భారతీ యులను తక్కువ జాతి వారుగా, అనాగరికులుగా చూశారు. సాంఘిక, మత వ్యవహారాల్లో బ్రిటీషర్లు జోక్యం చేసుకోవటంతో వారి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. తమ పాలానాధికారాన్ని ‘దైవదత్తమైన అధికారం’గా ఆంగ్లేయులు భావించారు. దీనిపై కుల, మత, ప్రాంత విచక్షణ లేకుండా ప్రజలు ఏకమై ఉద్యమించారు. దేశ ప్రజలు నిత్య దారిద్య్రంలో మగ్గటానికి బ్రిటిష్ వారి దోపిడీయే కారణమని దాదాబాయి నౌరోజీ తన రచనల ద్వారా చాటి చెప్పారు. ఇదే విధంగా నాటి తెలంగాణ ప్రాంత ప్రజల దీన స్థితి, జీవనం గురించి అనేక మంది రాశారు. పీవీ నరసింహారావు రాసిన ‘గొల్లరామవ్వ’ కథ చదివితే అప్పటి పరిస్థితుల గురించి తెలుస్తుంది.
1920 సెప్టెంబర్‌లో సహాయ నిరాకరణోద్యమానికి నేతృత్వం వహించి గాంధీ కాంగ్రెస్‌కు తిరుగులేని నాయకుడయ్యారు. ఆ క్రమంలోనే హిందు, ముస్లిం సమైక్యతను సాధించారు. స్వాతంత్య్రోద్యమానికి సారథ్యం వహించారు. మహాత్మాగాంధీ పిలుపు మేరకు..ఆంగ్లేయ విద్యాసంస్థలను, న్యాయస్థానాలను ప్రజలు బహిష్కరించారు. విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన నిషేదం లాంటి అనేక ఉద్యమాలు జరిగాయి. ‘బ్రిటిష్ సామ్య్రాజ్య పతనాన్ని నేను కోరుతున్నాను. నేను నా దేశాన్ని స్వేచ్ఛా భార తం చేయాలని తలంచాను’ అంటూ ‘వందేమాతరం’ అని నినదిస్తూ ఎంతో మంది యువకులు ఉరికంబాలెక్కారు.
బ్రిటిష్‌వారు వెళ్లిపోతే దేశానికి స్వాతంత్య్రం లభించింది కానీ, హైదరాబాద్ స్టేట్‌కు మాత్రం స్వేచ్ఛ లభించలేదు. రాజ్యం ఇంకా రాచరిక పాలనలోనే కొనసాగుతున్నది. దీంతో నిజాం వ్యతిరేక పోరాటాలు ఉధృతమయ్యాయి. బ్రిటిష్‌వారు వెళ్లిపోతే దేశంలోని సంస్థానాలు వాటంతట అవే భారతదేశంలో కలిసిపోతాయి అని చాలామంది అప్పట్లో అనుకున్నారు. కానీ అది జరగలేదు. పలు సంస్థానాల్లో ప్రజలు ఉద్యమించిన తర్వాతగానీ అది సాకారం కాలేదు. హైదరాబాద్ రాజ్యంలో కూడా ప్రజలు ఇదే విధంగా ఉద్యమించారు.
వందేమాతరం పాడినందుకుగాను కళాశాల నుంచి బహిష్కరణకు గురయ్యారు పీవీ నరసింహారావు. జాతీయ పతాకాన్ని ఎగురవే యటం వంటి చర్యలకుగాను పద్మజా నాయుడు, నరేంద్రజీ, బూర్గుల రామకృష్ణారావు, గణపతి రావు, జ్ఞాన కుమారి హెగ్డే, వట్టికోట ఆళ్వార్‌స్వామి, మొల్కోటే, ఎం.ఎస్.రాజలింగం, దామోదర్ పాంగ్రేకర్, కాళోజీ నారాయణ రావు లాంటి వారు జైలు పాలయ్యారు. 1947 ఆగస్టు 7న స్వామి రామానంద తీర్థ పలువురు దేశభక్తులతో కలిసి హైదరాబాద్ స్టేట్‌ను భారతదేశంలో కలుపాలని డిమాండ్ చేస్తూ సుల్తాన్ బజార్లో సత్యాగ్రహం చేశారు.
ఈ ప్రజా ఉద్యమం ఫలితంగా హైదరా బా ద్ రాజ్యం 1948 సెప్టెంబర్ 17న భారత్‌లో కలిసింది. జైళ్లలో ఉన్నవారందరినీ విడుదల చేశారు. స్వామి రామానందతీర్థ విడుదలైన తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన ఇంటికి చేరుకున్నారు. వారిని ఉద్దేశించి ఆయ న ప్రసంగిస్తూ.. ‘ఇది చరిత్రాత్మక దినం. ఎన్నో పరీక్షలు ఎదుర్కొని విజయం సాధించిన దినం’ అని అన్నారు. ఈ మహత్తర ఘట్టానికి 74 ఏండ్లు పూర్తయ్యి 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దీనిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపాలని, ఏడాదిపాటు వజ్రోత్సవాలు జరుపాలని నిర్ణయించటం హర్షణీయం.
ప్రారంభోత్సవాన్ని మూడు రోజులు సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో వైభవంగా జరుపాలని నిర్ణయించారు. 16న తెలంగాణ అంతటా ర్యాలీలు నిర్వహిస్తారు. 17న సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్స్‌లో జండా ఎగురవేస్తారు. తెలంగాణ అంతటా ఇది జరుగుతుంది. 18న స్వాతంత్య్ర సమరయోధులను సన్మానిస్తారు. ముగింపు ఉత్సవాలను కూడా ఇలాగే ఘనం గా జరుపతలపెట్టారు. చరిత్ర గతకాలపు జ్ఞాపకం. మనదైన చరిత్రను భావితరాలకు అందించటం అవసరం. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ ఉత్సవాలు దీంట్లో భాగమే. ఈ సమైక్యతే నేటి ఆదర్శం.
(వ్యాసకర్త: ఎమ్మెల్సీ, స్వామి రామానంద
తీర్థ మెమోరియల్ కార్యదర్శి)
తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు మాతరం వాళ్ళం 17 సెప్టెంబర్‌ను ఘనంగా జరుపుకోలేని పరిస్థితి. కానీ కాల మహిమ. అది ఎప్పుడూ ఒకేలావుండదు. మాతరం వాళ్ళమేకాక ప్రజలందరూ 17 సెప్టెంబర్‌ను జరుపుకొనే విధంగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు.
జైలు నుంచి స్వామి రామానందతీర్థ విడుదలైన తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన ఇంటికి చేరుకున్నారు. వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. ‘ఇది చరిత్రాత్మక దినం. ఎన్నో పరీక్షలు ఎదుర్కొని విజయం సాధించిన దినం’ అని అన్నారు.