రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రూపాయి విలువ క్షీణిస్తున్నది. ముడిచమురు ధరలు పెరగడం, ఈక్విటీ అమ్మకాలు, డాలర్ తిరోగమనం, ద్రవ్యవిధానాన్ని కఠినం చేయడానికి ఆర్బీఐ తీసుకున్న చర్యలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కఠినం కావడం… రూపాయి విలువ పతనానికి ప్రధాన
కారణాలు. అయితే దీన్ని నివారించడమెలా అన్న అంశంపైనే ఇప్పుడు అందరూ దృష్టి సారించాల్సిన అవసరం వచ్చింది.
ప్రభుత్వం, ఆర్బీఐ, పారిశ్రామిక వర్గాలు, ప్రజలు.. అందరూ తమ వంతు కర్తవ్యాలను నిర్వహిస్తేనే రూపాయి పతనాన్ని అడ్డుకోవచ్చు. కనీసం దాని దుష్ఫలితాల నుంచి తప్పించుకోవచ్చు. ఆర్బీఐ, ప్రభుత్వం ఏం చేయాలంటే… ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (ఎఫ్సీఎన్ఆర్(బీ)) ఖాతాలపైన ఉన్న క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్), స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో(ఎస్ఎల్ఆర్) పరిమితులను ఆర్బీఐ తగ్గించాలి. ఎన్నారై డిపాజిట్ల మీద ఎక్కువ వడ్డీ ఇవ్వడాన్ని అనుమతించాలి. మార్కెట్ల నుంచి బాండ్లను కొనుగోలు చేయాలి. నాన్ రెసిడెంట్ ఇండియన్ బాండ్లను విక్రయించాలి. సావరిన్ బాండ్ల జారీ నిర్వహించాలి. బ్యాంకు వడ్డీరేట్లను పెంచ డం ద్వారా కూడా రూపాయి విలువ క్షీణతను ఆర్బీఐ అరికట్టవచ్చు. వడ్డీరేట్లు ఎక్కువగా ఉంటే ప్రజలు తమ డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. దాని వల్ల ద్రవ్య లభ్యత తగ్గిపోతుంది. రెపోరేటును పెంచడం ద్వారా కూడా రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయవచ్చు.
దేశ కరెంటు ఖాతా లోటు తగ్గించడంపై దృష్టి సారించి, రష్యా లాంటి స్నేహ పూరిత దేశాలతో రూపాయి రూపంలో చెల్లించే విధానాన్ని కొనసాగించాలి. దీనివల్ల డాలర్ (అమెరికా)పై ఆధారపడటం తగ్గుతుంది. ఇదే సమయంలో ఆర్బీఐ, కేంద్రప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలి. దీని వల్ల వస్తువుల విక్రయానికి రూపాయి మార్పిడి అవసరమవుతుంది. ఇది చివరికి అంతర్జాతీయ మార్కెట్లలో రూపాయి విలువ స్థిరపడటానికి దోహదం చేస్తుంది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో రూపాయి వినియోగాన్ని పెంచాలి. ఆర్థికాభివృద్ధి మాత్రమే రూపాయి విలువ పతనాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం
ఆ దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాలి.
దిగుమతులు తగ్గించాలి: రూపాయి విలువ పతనమైనప్పుడు మనం దిగుమతి చేసుకునే ముడి సరుకులు, వస్తువులకు గతంలో కన్నా ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లను కొద్ది రోజులు వాయిదా వేయాలి. ధరల పెరుగుదల, తగ్గుదలతో సంబంధం లేకుండా భారతీయులు ఏటా బంగారం ఎక్కువగా కొంటున్నారు. దీని వల్ల దేశం ఏటా టన్నుల కొద్దీ బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. అలాగే ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, రసాయన రంగాలు విదేశాల నుంచి ముడి సరుకులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ దిగుమతులను కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. రూపాయి పతనం ద్వారా లాభాలు ఆర్జించే ఐటీ సేవలు, ఔషధాలు, వస్ర్తాల ఎగుమతులను మరింతగా పెంచాలి. పరిస్థితులు చక్కబడే వరకు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ప్రజలు ఈ విధానాన్ని పాటించాలి.
వ్యాపారులు, విద్యార్థులు, ప్రజలు అవసరమైతేనే విదేశీయానం చేయాలి. విదేశాల్లోని ఆస్తులను భారతీయ కరెన్సీతో కొనుగోలు చేయడం వాయిదా వేయాలి. ఇందుకు బదులుగా ఎక్సేంజ్ ఎర్నర్స్ ఫారిన్ కరెన్సీ(ఈఈఎఫ్సీ) ఖాతాలోని నగదును ఉపయోగించాలి. అధీకృత డీలర్ ద్వారా విదేశీ కరెన్సీ రూపంలో ఈ ఖాతా నిర్వహించుకోవచ్చు. అలాగే పెట్టుబడులు పెట్టాలనుకు నేవారు ప్రపంచవ్యాప్తంగా ‘లిస్ట్’ అయిన కంపెనీల్లో పెట్టుబడులు (గ్లోబల్ ఫండ్స్) పెట్టాలి. రూపాయి విలువ క్షీణించినప్పుడు నగదు రూపంలో ఉన్న డబ్బు వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల వ్యాపారులు, ప్రజలు డబ్బును నగదు రూపంలో ఎక్కువగా ఉంచుకోకూడదు.
– ఎ.భాస్కర్