ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజకీయాల్లో సంపూర్ణ ఆధిపత్యం కోసం జర్మనీ నియంత హిట్లర్ బాటలో నడుస్తున్నారు. విపక్ష నేతలను లొంగదీసుకోవటానికి ఈడీ, డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) లాంటి కేంద్ర వ్యవస్థలను రాజకీయ ఆయుధాలుగా వినియోగిస్తున్నారు.
2002-2014 మధ్యకాలంలో ఈడీ 112 కేసులను మాత్రమే నమోదు చేసింది. కానీ మోదీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. జూన్ 2014-మార్చి 2022 వరకు ఈడీ 3,086 సోదాలు నిర్వహించి 5,310 కేసులు నమోదు చేసింది. రూ.1,04,702 కోట్ల ఆస్తులను జప్తు చేసి, 880 ఛార్జ్షీట్లను నమోదు చేసింది. ఇంత హడావుడి చేసినా కేవలం 23 కేసుల్లోనే శిక్షలు ఖరారయ్యాయి.
మోదీ ఎనిమిదేండ్ల పాలనలో వివిధ జాతులు, మతాల సమ్మేళనమైన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో పడింది. న్యాయ వ్యవస్థ కుప్పకూలిపోవడం కూడా ఇందుకు ఒక కారణం. జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్ తన పదవీ విరమణకు ముందు ఇచ్చిన చివరి రెండు తీర్పులు మోదీకి అనుకూలంగా మారాయి. ‘నేరారోపణ ఎదుర్కొంటున్న నిందితుడు దోషిగా తేలేంతవరకు అతనికి రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులన్నీ వర్తిస్తాయి. అప్పటివరకు అతడిని నిర్దోషిగానే చూడాలి’ అన్న స్ఫూర్తికి ఖన్విల్కర్ ఇచ్చిన తీర్పులు విఘాతం కలిగించాయి.
మనీ లాండరింగ్ చట్టంలో కేంద్రం చేయాలనుకున్న సవరణలను సవాలు చేస్తూ దాఖలైన 242 పిటిషన్లను ఆయన కొట్టివేశారు. దీంతో పన్ను ఎగవేతదారులు, మనీ లాండరింగ్ (హవాలా మార్గంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం) నిందితులను వేధించే, శిక్షించే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సంస్థల కోరలు మరింత పదునుతేరాయి. ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) చట్టంలో తెచ్చిన సవరణలు తీవ్రమైనవి. ఈ సవరణల ప్రకారం అక్రమార్జన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తాను నిర్దోషినని తానే నిరూపించుకోవాలి. ఇప్పటివరకు ఆ బాధ్యత నేరారోపణ చేసిన సంస్థలపై ఉండేది.
పీఎంఎల్ఏ చట్టం వల్ల్ల కలిగే దుష్ఫలితాలను అంచనా వేసిన మాజీ ప్రధానులు వాజపేయి, మన్మోహన్సింగ్ జాగ్రత్తగా దాన్ని అమలుచేశారు. దీనివల్ల 2002-2014 మధ్యకాలంలో ఈడీ 112 కేసులను మాత్రమే నమోదు చేసింది. కానీ మోదీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. జూన్ 2014-మార్చి 2022 వరకు ఈడీ 3,086 సోదాలు నిర్వహించి 5,310 కేసులు నమోదు చేసింది. రూ.1,04,702 కోట్ల ఆస్తులను జప్తు చేసి, 880 ఛార్జ్షీట్లను నమోదు చేసింది. ఇంత హడావుడి చేసినా కేవలం 23 కేసుల్లోనే శిక్షలు ఖరారయ్యాయి. ప్రత్యర్థి పార్టీలను మచ్చిక చేసుకోవడానికో, వాటి ఉనికిని దెబ తీయడానికో మోదీ ఈ చట్టాన్ని ఉపయోగిస్తున్నారు. భిన్నపార్టీల సమాహారమైన భారత్‌ను ఏక పార్టీ రాజ్యంగా మార్చడానికి కుట్రలు పన్నుతున్నారు.
తన జీవితకాలం భారత్‌కు ప్రధానిగా
ఉండాలన్నది మోదీ లక్ష్యం. అందుకోసం ఎలాంటి పనులు చేయడానికైనా ఆయన వెనుకాడటం లేదు. సెంట్రల్ విస్టా ప్రాంతాన్ని ధ్వంసం చేసి కొత్త పార్లమెంటు భవనాన్ని, రాజ మహలు వంటి ప్రధాని నివాసాన్ని నిర్మిస్తున్నారు. ఆ భవనంలో తాను జీవితాంతం
ఉండాలని మోదీ భావిస్తున్నారు.
పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఉన్న అపరిమిత అధికారాల సాయంతో ఆయన తన లక్ష్యాల సాధన ప్రారంభించారు. దేశంలోని రాజకీయపార్టీలను చీల్చారు. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టారు. 2019 నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)ను కూడా ప్రత్యర్థులపై ప్రయోగించడం ప్రారంభించారు. పీఎంఎల్ఏ ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్పర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) లేకుండానే నిందితులను అరెస్టు చేయవచ్చు. ఇలాంటి కేసుల్లో బెయిల్ లభించడం దాదాపు అసంభవం. మోదీ ప్రభుత్వం ఈ పీఎంఎల్ఎ అస్ర్తాన్ని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంపై తొలుత ప్రయోగించింది. 2014 డిసెంబర్లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందగానే ఈ పని ప్రారంభించింది. కేజ్రీవాల్‌పై బీజేపీ దేశవ్యాప్తంగా 33 పరువు నష్టం దావా కేసులు వేసింది. ఈ కుయుక్తులేవీ ఆప్ ప్రభుత్వాన్ని అస్థిరపరచలేకపోయాయి. దీంతో వివిధ అభియోగాలపైనా ఆప్ ఎమ్మెల్యేల అరెస్టులు ప్రారంభమయ్యాయి. జూలై 2016 నాటికి 67 మంది ఆప్ ఎమ్మెల్యేలలో 11 మంది పోలీసు కస్టడీలో ఉన్నారంటే వేధింపులు ఎంత తీవ్ర స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు.
ఢిల్లీ తర్వాత బెంగాల్ ప్రభుత్వాన్ని మోదీ లక్ష్యంగా చేసుకున్నారు. చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించి తెహల్కా స్టింగ్ ఆపరేషన్ వీడియోను ఆధారంగా చూపిం చి 12 మంది అగ్రశ్రేణి తృణమూల్ కాంగ్రెస్ నేతలను బెదిరించాలనుకున్నారు. కానీ మమత ప్రభుత్వం సీబీఐ అధికారులను రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించడంతో మోదీ ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత సీబీఐ దండయాత్ర ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్పైనా సాగింది. అయితే ఆ రాష్ర్టాలు ఢిల్లీ పోలీస్ చట్టాన్ని అమలుచేయబోమని ప్రకటించడంతో మోదీకి నిరాశే మిగిలింది. తర్వాత మోదీ తన దృష్టిని మహారాష్ట్ర పైకి మళ్లించారు. ఈ ఏడాది జూన్‌లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి ఉద్ధవ్ ఠాక్రే కుడి భుజమైన సంజయ్‌రౌత్‌పై ఈడీ అస్ర్తాన్ని ప్రయోగించారు.
ఇటీవల పంజాబ్‌లో అధికారం చేపట్టిన ఆప్ గుజరాత్లో బీజేపీకి సవాల్ విసురుతూ జాతీయపార్టీగా ఎదుగు తున్నది. దీంతో ఆప్‌పై మోదీ మరోసారి కక్షగట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్పైనా, ఆగస్టులో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాపైనా ఈడీ దాడులు చేయించారు. సోనియాగాంధీ కుటుంబానికి ఈడీ సమన్లు జారీచేసి నెహ్రూ, ఇందిరల ద్వారా ఆ కుటుంబానికి సంక్రమించిన కీర్తి ప్రతిష్ఠలను చెడగొట్టాలని చూస్తున్నారు. భారతదేశానికి సరికొత్త నియంతగా ప్రకటించుకోవాలనే ఆరాటంతో మోదీ ఈ కుయుక్తులన్నీ పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఖన్విల్కర్కు రోజూ వార్తా పత్రికలను చదువమని నేను సలహా ఇస్తున్నాను. తాను ఇచ్చిన తీర్పును ఆయన ఇప్పుడు మార్చలేకపోవచ్చు. కానీ కనీసం ఆ తీర్పు వల్ల రూపుదిద్దుకున్న చట్టం న్యాయం కోసం కాకుండా రాజకీయ బెదిరింపులకు ఉపయోగపడుతున్నదని ఆయనకు అర్థం అవుతుంది.
– ప్రేమ్‌శంకర్ ఝా, సీనియర్ జర్నలిస్ట్